జనవరి 16, 2014

దళితవాదంలో కులతత్వం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:51 సా. by వసుంధర

మన ఆధునిక సమాజం ఒక అయోమయంలో ఉంది. కులతత్వాన్ని నిరసిస్తూనే మన సంప్రదాయానికి బ్రాహ్మణవాదం అని పేరెట్టింది.  నిజానికి మన సమాజంలో బ్రాహ్మణులనేది ఒక బలమైన స్థాయి. ఎవరివద్ద డబ్బు, పదవి, తెలివి ఉన్నాయో వారు అగ్రకులాలు. లేనివారు దళితులు. అప్పట్లో బ్రాహ్మణులు రాజ్యాంగాన్ని వ్రాశారు. కాబట్టి దాన్ని బ్రాహ్మణవాదం అన్నారు. ఇప్పుడు దళితుడు రాజ్యాంగం వ్రాశాడు. దీన్ని దళితవాదం అనవచ్చా? 

ఇప్పుడు కులాలవారీగా చూసుకుంటే- నాటి దళితులెందరో ఆర్థికంగా, జ్ఞానపరంగా, అధికారపరంగా చాలా ఎత్తున ఉన్నారు. వారు కులపరంగా దళితులకు ఒరగబెట్టిందేమీ లేదు. నాడు అగ్రకులాలు చేసినవన్నీ నేడు వీరు చేస్తున్నారు. 

ప్రతి మనిషికీ భగవంతుడు తెలివినిచ్చాడు. దాంతోపాటే స్వార్థాన్నీ ఇచ్చాడు. స్వార్థపరులు అమాయకుల్ని దోచడం అప్పుడే కాదు ఇప్పుడూ జరుగుతోంది, ఎప్పుడూ జరుగుతుంది. అందుకు మనిషి ఎవరినో కాదు. తనని తానే బాధ్యుణ్ణి చేసుకోవడం నేర్చుకుంటే- పరిస్థితుల్లో మార్పు వస్తుంది. లేని పక్షంలో సాటివారిపై ఆధారపడాలి. సాటివారు మనని దళితుల్ని చేసి తాముఅగ్రకులాలయ్యేందుకు ప్రయత్నిస్తారు. ‘నన్నెవరూ అణగద్రొక్కలేరు- నా అథోగతికి నేనే కారణం’ అన్న స్పృహని సాటి మనిషిలో కలిగించేదే ప్రయోజనకరమైన సాహిత్యం. ఈ విషయాన్ని మేము అహం బ్రహ్మాస్మి అనే కథలో వివరించాం.  కులాల్ని పూర్తిగా విస్మరించి కులం పేరెత్తడమే పాపంగా అనుకోవడం ప్రారంభిస్తే- నేటి బ్రాహ్మణుల్లో దళితులూ, దళితుల్లో బ్రాహ్మణులూ చాలామందే  కనిపిస్తారు. వాళ్లని ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే రెండే రెండు వర్గాలుగా విభజించి- గతంపట్ల ద్వేషాన్ని భావిపట్ల ఆశగా మలచుకునేందుకు ప్రయత్నిస్తే ప్రగతి మన వెంట పడుతుంది. లేని పక్షంలో జనం ఒకరినొకరు ద్వేషించడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు.

ఇక గుర్తింపు విషయం- తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలెలెవ్వరు అని వాపోయిన శ్రీశ్రీ కూడా- తన కవితల పుస్తకాల్ని అచ్చొత్తిన కంపోజిటర్ల ప్రసక్తి ఎక్కడా తేలేదు. మేడలు కట్టిన కమ్యూనిస్టులెవ్వరూ ఆ నిర్మాణానికి రాళ్లెత్తిన వారి జాబితా తయారు చేసి దగ్గిర పెట్టుకోలేదు. ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్యుడు. గుర్తింపుతో నిమిత్తం లేకుండా వేళకి ఉదయించి వేళకి అస్తమిస్తాడాయన. అలా తమ పని తాము చేసుకుపోయే శ్రామిక వర్గాన్నిసూర్యునితో పోల్చుతూ మేము వ్రాసిన సూర్య నమస్కారం స్వాతి నవలానుబంధంగా (జూన్ 2002) అనిల్ అవార్డ్ అందుకుంది. 

ఇటీవల కత్తి పద్మారావు ప్రచురించిన బ్రాహ్మణవాదం మూలాలు ప్రత్యామ్న్యాయ సంస్కృతి నిర్మాణం గ్రంథం ప్రయోజనాన్ని చదువరులు ఈ నేపథ్యంలో పరిశీలించాల్సి ఉంది. ఆ గ్రంథంపై శ్రీ బి.ఎస్. రాములు సమీక్షకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

 

Leave a Reply

%d bloggers like this: