Site icon వసుంధర అక్షరజాలం

వన్ నేనొక్కడినే- చిత్రసమీక్ష

File:1 Nenokkadine film poster.jpg
ఒక సైంటిస్టు ప్రపంచంలో సామాన్యుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసే గొప్ప పరిశోధన చేస్తాడు. ఒక దుర్మార్గుడు ఆ పరిశోధన వివరాలను తనకు అమ్మేయమని సైంటిస్టుని అడుగుతాడు. సైంటిస్టు డబ్బుకి లొంగడు. బెదిరింపులకి భయపడడు.  దుర్మార్గుడు సైంటిస్టుని చంపేసి ఆ పరిశోధన రహస్యాన్ని తెలుసుకుందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు. సినిమాలకు సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది, 21వ శతాబ్దంలోనూ కొనసాగుతున్న అతి పాత కథ.

తన బాల్యంలో దుర్మార్గులు తలిదండ్రుల్ని హత్య చేస్తే- పెద్దయ్యాక ఆ హంతకుల్ని చంపి ప్రతీకారం తీర్చుకోవడమే జీవిత ధ్యేయంగా ఉండే హీరో కథ భారతీయ చలన చిత్రాల్ని కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న మహా పాత(క)కథ.

ఓ ఐదు పాటలు, కొన్ని ఫైట్‍స్, కొన్ని chases- ఇవి ఇప్పటికీ తెలుగు సినిమాకు ఫార్ములా.

తెలుగు సినిమా చూడ్దానికి థియేటర్‍కి వెళ్లేముందు మెదడుని ఇంట్లో వదిలిపెట్టాలని అంతా అనుకునే మాట. ఆ మాటకు నిదర్శనంగా- ఏ తెలుగు సినిమా చూసినా ఏమున్నది ఈ మాటకు భిన్నంగా అనిపించడం మామూలు.

వీటిలో వేటినీ ఉపేక్షించకుండా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ జనవరి 10న ఓ తెలుగు చిత్రం. హీరో మహేష్‍బాబు. దర్సకుడు సుకుమార్. ఇద్దరూ కూడా మూస చిత్రాలకు   భిన్నమైన చిత్రాలకు పేరు పడినవారే. అందువల్లనేమో- ఇటీవల లోపించిన కొత్తదనాన్ని ఆద్యంతం ప్రదర్శిస్తూ-  వన్ నేనొక్కడినే అన్న పేరుకి పూర్తి న్యాయం చేకూర్చింది.

సినిమాలకి కథ కంటే కథనం ముఖ్యం. ఈ చిత్ర కథనం చాలా కొత్తగా, హాలీవుడ్ చిత్రాలకు దీటొచ్చేలా ఉంది. ఫొటోగ్రఫీదీ అదే స్థాయి. సమీక్ష 1   సమీక్ష 2

నటీ నటుల్ని తీసుకుంటే ఈ చిత్రంలో- మహేష్‍బాబు తొలిసారిగా రాక్‍స్టార్‍గా నటించాడు. ఐతే రాక్‍స్టార్‍గా అతడి తను భాష (body language) ఆ పాత్రకి న్యాయం చేకూర్చలేదు. రాక్‍స్టార్ అనగానే వళ్లు వదులుగా (ఇంకా చెప్పాలంటే) ప్రభుదేవా టైపులో కదలాలి కదా! మహేష్ కొంచెం stiffగానే ఉన్నాడనిపించింది. ఐతే ఈ చిత్రంలో అతడు రాక్‍స్టార్ కావడం అంత ప్రధానం కాదు కాబట్టి ఆ విషయంలో సద్దుకుపోవచ్చు అనుకుంటే- మహేష్- వన్ నేనొక్కడినే అంటే- తనే అనిపించేటంత అందంగా కనిపించాడు, గొప్పగా నటించాడు. అతడికి జోడుగా నటించిన కృతి సనన్‍కి ఇది తొలి చిత్రం. ఆమెది జర్నలిస్టు పాత్ర. ఆధునిక జర్నలిస్టుగా ఆమె హుందాగా ఉంది. నటనకు కొత్త అనిపించదు. తెలుగు సినిమా హీరోయిన్‍కి ఏమవసరమో అవన్నీ సంతరించుకున్నట్లే ఉంది. అందాలను ప్రదర్శించడంతో పాటు- అంతో ఇంతో నటనను ప్రదర్శించే అవకాశాన్ని బాగా ఉపయోగించుకుందామె. ఒక ఐటమ్ సాంగ్‍లో ప్రధానపాత్ర సోఫీ చౌదరిది ఐతే- అందులోనూ తను విజృంభించి కొన్ని సీన్లు తీసుకుందామె. తీసుకుని న్యాయం చేకూర్చింది కూడా.

మిగతా నటీనటుల్లో చాలా పెద్ద పేర్లు కనిపిస్తాయి. నాజర్, కెల్లీ దోర్జీ, ప్రదీప్ రావత్, శాయాజీ షిందే, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి వగైరాలున్నారు. అందరివీ ఎంత చిన్న పాత్రలంటే- మహేష్‍బాబు వన్ నేనొక్కడినే అనొచ్చు. మహేష్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేష్‍గా కనిపించాడు. ఈ పాత్ర మిగతావాటికంటే కాస్త పెద్దదే.  అభిమానులు గౌతమ్‍ని చూసి ముద్దు పడొచ్చు కానీ- మహేష్‍ని బాలనటుడుగా చూసినవారికి- అందంలో తండ్రిని మించిన తనయుడు అనిపించదు.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్. హాలీవుడ్ సినిమాల తరహాలో తీసిన చిత్రం కాబట్టి- పాటలకంటే- నేపథ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాదు. ఐనా ఐదు పాటలూ కూడా బాగానే ఉన్నాయి. లండన్ బాబూ అన్న ఐటమ్ పాటకి దేవిశ్రీ ముద్ర బాగాఉంది. ఈ పాటకి చంద్రబోస్ అందించిన వ్యాఖ్యలు హాస్యకవితలా బాగున్నాయి. మరో పాట ఆవ్ తుజో మోగ్ కర్తా అన్న పాట కూడా మిగతావాటికంటే ఎక్కువ బాగుంది.

ఈ సినిమాకి ప్రాణం పోసింది సుకుమార్. హాలీవుడ్ తరహా తెలుగు చిత్రం తియ్యడం- అందులో  పూర్తిగా ఒరిజినాలిటీ చూపించడం (అని మేమనుకుంటున్నాం), చిత్రం పొడవునా మెదడుకి పని చెప్పేలా ఉండడం, కామెడీట్రాక్ కోసం తాపత్రయం పడకపోవడం- సాహసానికే  కాదు, తెలివికీ, ఆత్మవిశ్వాసానికీ నిదర్శనం. ఇంటర్వల్ ముందు దర్శకుడిచ్చిన మెలికకు hats off.  ఎటొచ్చీ సెంట్రల్ థీమ్ ప్రతీకారం కాకుండానూ, ఆ ప్రతీకారానికి మూల కారణంగా పాతచింతకాయ పచ్చడి సైంటిస్టు కథ కాకుండానూ చూసుకుంటే (ఉదాహరణకి నైట్ శ్యామలన్- sixth sense) ఇంకా బాగుండేది.

సమీక్షలకు వస్తే- ఈ చిత్రం మాస్‍కి ఎక్కదని కొందరు, గజిబిజిగా ఉండి- సరదాగా సినిమాకొచ్చినవారికి బుర్ర వేడెక్కించి బాధ పెడుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. సినిమా అంటే ఈలలు వేయించుకోవాలనీ, చూడ్దానికొచ్చేవారు బుర్ర లేనివారనీ- అనుకునే ఇతర దర్శకులకు భిన్నంగా- ప్రేక్షకులపై గౌరవముంచి సుకుమార్ తీసిన చిత్రమిది. అతడిపై నమ్మకముంచిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర అభిరుచికి అభినందనీయులు.

ఈ చిత్రం గొప్పది అనలేము. కానీ వినోదానికి మూసని అనుసరించని విభిన్న చిత్రం. చూస్తున్నంతసేపూ కళ్లతోపాటు మెదడుకీ పనిచెప్పి- పూర్తయ్యాక  ఒక తృప్తిని మిగిల్చే చిత్రం. ఇలాంటి చిత్రాలకు ఆదరణ లభిస్తే- తెలుగునాట వినోదానికి కొత్త శకం మొదలు కావచ్చు.

Exit mobile version