జనవరి 23, 2014

సామాన్యుడిగా రాణించిన అసామాన్యుడు

Posted in కళారంగం at 9:22 సా. by వసుంధర

anr photo నటుడిగా అశేషకీర్తిని ఆర్జించిన అక్కినేని- నిన్న కీర్తి శేషులయ్యారు. ఎన్నో మార్లు తీవ్ర అనారోగ్యాన్ని ఎదిరించి అధిగమించి తన 90వ ఏట క్యాన్సర్ వస్తే చిరునవ్వుతో ప్రేక్షకుల ముందుకొచ్చి- నాకు మీ అభిమానం కావాలి, ఓదార్పులొద్దు అని మందలిస్తూ వేడుకున్నారు. వ్యాధిగ్రస్థులైనా కృంగి కృశించక నవనవలాడే పండుటాకులా రాలిపోయారు.

ప్రముఖ పాత్రికేయులు, సినీ పండితులు- శ్రీ వేమూరి సత్యనారాయణ- ఆమధ్య తన మాతృమూర్తి కాలం చేసినప్పుడు తన బంధుమిత్రులకి ఇలా తెలియబర్చారు- ‘నేను సంతాపాన్ని ప్రకటించడం లేదు. ఆమె జీవిత సాఫల్యాన్ని వేడుకగా జరుపుకుంటున్నాను’ అని. అక్కినేని విషయంలో ఇది ఎంతలా వర్తిస్తుందో వేరే చెప్పాలా? 

అక్కినేని అన్ని రకాల పాత్రలూ ధరించినా- ఎక్కువగా సామాన్యుడి పాత్రలే వేశారు. ఏ పాత్ర వేసినా సామాన్యుడికి వినోదం అందించారు. మన రాజకీయాల తీరుని పూర్తిగా ఆకళింపు చేసుకున్న ఆయన సామాన్యుడికి- రాజకీయాలకంటే తన నటనే ఎక్కువ మేలు చేస్తుందని భావించారు. గుప్తదానాలు చాలా చేశారు. సుడిగుండాలు, మరోప్రపంచం వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీశారు. 

కొన్నేళ్లక్రితం- వసుంధరలో భాగమైన శ్రీమతి రామలక్ష్మిని  మరో ప్రముఖ రచయిత్రి శ్రీమతి వేదుల శకుంతల సహృదయంతో సన్మానించారు. ఆ సన్మానం శ్రీ అక్కినేని చేతులమీదుగా జరగడం (ఫొటోలు క్రింద ఇచ్చాం) మా ఆదృష్టంగా భావిస్తాం.

vedula shakuntala award 2 vedula shakuntala award 3 vedula shakuntala award 1

శ్రీ అక్కినేనితోపాటు వేదికమీద ఉండే అవకాశం నాకొకసారి ఓ పుస్తకావిష్కరణ సభలో వచ్చింది.  అప్పుడాయన- ఇది రచయితల వేదిక, నేను రచయితను కాను- అన్నారు. నాకప్పుడు చిన్నప్పుడు ఆంధ్రపత్రికలో ధారావాహికగా వచ్చిన రంగుటద్దాలు రచన గుర్తుకొచ్చింది. ఆది శ్రీ అక్కినేని రచన. వివిధ మనస్తత్వాలను విశ్లేషించిన ఓ గొప్ప రచన. అది గుర్తుకొచ్చి  తటపటాయిస్తూనే  ఆ విషయం ఆయనకి చెప్పి, ‘మీరు రచయిత కాకపోవడమేమిటి సార్- రంగుటద్దాలుందిగా’ అన్నాను. ఆయన నవ్వి పక్కనున్న నారాయణరెడ్డిగారితో, ‘చూడండి సార్! ఈయన రంగుటద్దాలు ఓ రచన అంటున్నారు’ అని వినయంతో కూడిన ట్రేడ్‍మార్క్ చిరునవ్వొకటి విసిరారు. ఆ రచన ఇప్పుడెక్కడా ప్రచారంలో ఉన్నట్లు లేదనుకుంటాను. పాఠకులకు అందజేయాల్సిన గొప్ప రచన అది. 

చక్రపాణి, మిస్సమ్మ, ప్రేమించి చూడు, గృహలక్ష్మి, అందాలరాముడు, బుద్ధిమంతుడు వగైరా చిత్రాల్లో హాస్యరసాన్ని అక్కినేని అద్భుతంగా పోషించిన తీరు చూస్తే- ఆయన తనని తాను హీరో పాత్రలకే పరిమితం చేసుకోకపోతే- తెలుగు తెరకు ఇందరు హాస్యనటులు లభించే అవకాశం ఉండేది కాదేమో అనిపిస్తుంది. 90వ పుట్టినరోజు సందర్భంగా  ఆయనపై అక్షరజాలంలో గతంలో వచ్చిన వ్యాసానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఆయన స్వంత చిత్రాల్లో ఎక్కువ వాటికి దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావు గతంలో అక్కినేని గురించి వ్రాసిన వ్యాసం నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. అది ఈ క్రింద ఇస్తున్నాం. 

akkineni adurti

Leave a Reply

%d bloggers like this: