జనవరి 31, 2014

యాబై ఏళ్ల మూగమనసులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:33 సా. by వసుంధర

నేను 1963లో ఎమ్మెస్సీ ఫైనలియర్ చదువుతున్నప్పుడు విశాఖపట్నంలో రామకృష్ణ థియేటర్‍లో విడుదలైంది మూగమనసులు చిత్రం. ఆ చిత్రానికి హిందీలో వచ్చిన బిమల్‍రాయ్ మధుమతి ప్రేరణ ఉన్నదని విన్నాం కానీ- చిత్రం చూసేక పోలిక పునర్జన్మ వరకూ మాత్రమేనని గ్రహించాం. ఈ చిత్రం నటిగా జమునకు చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టింది కానీ- అందుకు కారణం ఆదుర్తి పాత్రచిత్రణేనని స్వాభిప్రాయం. ఈ చిత్రంలో అల్లు రామలింగయ్య ఒక పెద్ద సెన్సేషన్. తన పాత్రను అద్భుతంగా పోషించి ఊహించని విలువని ఆ పాత్రకి ఆపాదించడం ఆయన ఘనత. నాగేశ్వరరావు నటన మామూలుగానే ఉన్నా- ఆయన నోట పలికిన యాస అద్భుతంగా రక్తి కట్టించింది. సావిత్రి తన పాత్రని హుందాగా, అద్వితీయంగా పోషించడం అనుకున్నదే. ఆమెకు భర్త పాత్ర హాస్యనటుడు పద్మనాభం పొషించడం ఒక విశేషమైతే- ఆ పాత్రకు తగిన హుందాతనాన్నివ్వడం ఆయన నటనా వైదుష్యానికి నిదర్శనం. ఈ చిత్రానికి నాగభూషణం మార్కు విలనీ గొప్ప ఆకర్షణ అయింది. ఆత్రేయ పాటలు ఎక్కువగా మాటల్లా ఉంటాయనీ, వరుసలు కట్టకపోతే వాటిలో కవిత్వం ఉండదనీ మాకో అభిప్రాయం. ఈ చిత్రంలో కూడా మానూ మాకును కాను– ఆ మార్కు పాటే. అయితే ముద్ద బంతిపూవులో, పాడుతా తీయగా, నా పాట నీనోట పలకాల సిలకా- అన్న మూడు పాటల్లో ఆయన కవితా పటిమకు జోహారులనాలనిపించేలా ఉన్నాయి.  ఇక వాటికి బాణీలు కట్టింది మహదేవన్ కావడం మాకు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన పాటల్ని అభిమానిస్తూ, తరచుగా హమ్ చేసుకునే మాకు అచ్చతెలుగు వాతావరణానికి మాత్రం రాజేశ్వరరావు, పెండ్యాల, వేణు వంటివారు సంగీతం సమకూర్చితే బాగుండును అనిపించేది. ఎందుకంటే ఆయన పాటల్లో ఎంతోకొంత తమిళ ధ్వని మాకు ఆనిపిస్తుంది. (శంకరాభరణం దీనికి పూర్తి మినహాయింపు). ఈ సినిమాలో ఈనాటి అనుబంధం, గోదారీ గట్టుందీ, నా పాట నీనోట పాటల్లో  తెలుగుతనం కొంత తక్కువేననిపించింది. నా పాట నీ నోట అన్న పాట 1962లో వచ్చిన డబ్బింగ్ చిత్రం ప్రాయశ్చిత్తంలోని నీ పేరె నా ప్రాణం అన్న పాటకి దగ్గిర్లో ఉంటుంది. ఆ చిత్ర సంగీత దర్శకులు విశ్వనాథన్-రామ్మూర్తి.  ఐనా వినడానికి ఆ పాటలన్నీ ఇప్పటికీ మాకెంతో ఇష్టం. ఆపైన మాన్యులు శ్రీ  విఎకె రంగారావు మూగమనసులు పాటలన్నింటినీ ఎంతగానో మెచ్చుకునేవారు. ఆయనకి జమునారాణి పాడిన ముక్కుమీద కోపం అన్న పాట చాలా ఇష్టం. ఈ చిత్రానికి మాటలు ఆత్రేయ అని విన్నాం కానీ- అప్పట్లో ఎందుకో మేమంతా ముళ్లపూడి వెంకటరమణ అనుకున్నాం. ‘అమ్మగారైతే దిబ్బరొట్టే కాయం’ అన్న డైలాగ్ అప్పట్లో సామెతగా కూడా వాడేవాళ్లం. మొత్తానికి నటీనటులతోపాటు దర్శకుడు ఆదుర్తి, సహకార దర్శకుడు విశ్వనాథ్, ఆత్రేయ, ముళ్లపూడి, మహదేవన్, ఘంటసాల. సుశీల కలిసి ఇరస్మరణీయం చేసిన ఓ గొప్ప కళాఖండం ఈ చిత్రం. అప్పుడే యాబై ఏళ్లు గడిచిపోయాయా అనిపించేటంత తాజాగా ఉన్నజ్ఞాపకాలీ చిత్రానివి. ఈ సందర్భంగా నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

mugamanasulu 50 years

1 వ్యాఖ్య »

  1. hari.S.babu said,

    మన తరానికి సంబంధించిన తీపి గుర్తులవి!ఇప్పటి వాళ్ళకి అవి యెలా ఉంటాయో తెలీదు. దేవదాసు మళ్ళీ తీస్తే దేవదాసు చంద్రముఖిని చేసుకున్నట్టూనో లేకపొతే పార్వతి లేచిపోయి వొచ్చేసి దేవదాసుని చేసుకున్నట్టుగానో తియ్యాలేమో?


Leave a Reply

%d bloggers like this: