ఫిబ్రవరి 12, 2014

ఉయ్యాలా జంపాలా- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 11:30 ఉద. by వసుంధర

 

 

uyyala jampala poster

పెద్ద హీరోల సినిమాలన్నీ- యుగళాలు, కొట్లాటలతో నిండిన ఫార్ములాలు. హీరోపై అభిమానముంటే తప్ప ప్రేక్షకుడికి మింగుడుపడని గరళాలవి. అందుకని జనం చిన్న నటీనటులతో తీసిన చిన్న బడ్జెట్ చిత్రాలవైపు మళ్లుతున్నారు. ఇక్కడ యుగళాలకూ, కొట్లాటలకూ ప్రాధాన్యం లభించకపోవచ్చు కానీ- ఇక్కడా ఒక ఫార్ములా ఉంది. దానికి మూలం ప్రేమ. యూత్‍ని పెట్టి యూత్‍తో ప్రేమ కథ తీస్తే యూత్ ఐనా చూస్తారని- సృజనాత్మకత లోపించిన యూత్ అనుకుంటారని నేడు లెక్కకు మించి వస్తున్న లోబడ్జెట్ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది. అలాంటి పాత చింతకాయపచ్చడి యూత్ సినిమా ఉయ్యాలా జంపాలా గత డిసెంబర్ 25న విడుదలైంది.

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్ని గుర్తు చేసే బావామరదళ్ల కథ ఇది. ఒకరినొకరు ఇష్టపడుతూనే కలహించుకునే ప్రేమికులు- తామొకరినొకరు ప్రేమిస్తున్నామని చిత్రం క్లైమాక్స్‍లో తెలుసుకోవడం- కథాంశం అని చెబితే పాఠకులకు ఒక్కుమ్మడిగా మరిన్ని చిత్రాలు గుర్తుకు రావచ్చు.

ఈ సినిమాకు కథ చెప్పిన విధానం కూడా చాలా పాతది. ఐతే దర్శకుడు చిత్రాన్ని నిదానంగానూ, శ్రద్ధగానూ తీశాడు. సంభాషణల్లో కొత్తదనం లేదు. ఐతే సందర్భోచితంగా ఉన్నాయి. ఈ కారణాలవల్ల- చదివిన కథనే చదివినట్లూ, చూసిన సినిమానే చూస్తున్నట్లూ ఉన్నా కూడా ఇది మంచి కథా, మంచి సినిమా అనే అనిపిస్తుంది.

హీరో రాజ్‍తరుణ్ తన పాత్రలో జీవించాడు. తూర్పు గోదావరి యాసని సునాయాసంగా, సహజంగా ఇతడు పలికిన తీరు ఇటీవల  ఏ హీరోలోనూ చూడలేదు. అతడి తీరే అంత ఐతే ఈ సినిమాకు అతడిని ఎన్నుకోవడం బాగుంది. ఈ పాత్రలో ఇమిడినట్లే ఏ పాత్రలోనైనా ఇమడగలిగితే- ఇతడు నేటి పెద్ద హీరోలకి గట్టి పోటీ ఇవ్వగలడని చెప్పవచ్చు.

కథానాయిక అవిక గౌర్ ఓ తెలుగు పల్లె పడుచు వేషంలో బాగా ఇమిడింది. నటనలో అతి ఉన్నా, ముఖంలో అమాయకత్వంతో అలరించింది. నవ్వు బాగున్నా అనవసరంగా నవ్విన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. హావభావాలు అలవోకగా ప్రకటించినా తెలుగమ్మాయిలా అనిపించడానికి మరికాస్త ప్రయత్నం చేస్తే బాగుండేది. మొత్తంమీద చిత్రానికి ఆమె కూడా కొంత ప్రాణం పోసింది.

మిగతా నటీనటులు కూడా తమతమ పాత్రల్లో జీవించారు. అందుకు బహుశా దర్శకుణ్ణి ఎక్కువ అభినందించాలేమో!

ఈ చిత్రంలో పాటలు వినడానికి బాగున్నాయి. ఐతే పూర్తి గ్రామీణ వాతావరణంలో మనోహరంగా నిర్మించబడిన చిత్రంలో- అచ్చతెలుగు జానపద బాణీలు ఉండాలని చిత్ర, సంగీత దర్శకులకి స్ఫురించకపోవడం బాధాకరం. ఆ వాతావరణంలో ఈ పాటలు- శంకరాభరణంలో బ్రోచేవారెవరురా దృశ్యాన్ని గుర్తు చేస్తాయి. పాటల చిత్రీకరణ బాగుంది. మచ్చుకి ఉయ్యాలైనా జంపాలైనా, లపక్ లపక్.

మన చిత్ర దర్శకులందరూ శాడిస్టులు అనిపిస్తుంది- ఏ చిత్రం క్లైమాక్స్ చూసినా! హీరోయిన్ హీరోని ప్రేమిస్తే- ఆమెకు మరొకడితో పెళ్లి నిశ్చయం కావడంవరకూ సరే! ఆ మరొకడు కూడా హీరో అంత మంచవాడూ, ఉత్తముడూ ఐనా- చివరి క్షణందాకా అతడినే పెళ్లి చేసుకుంటున్నట్లు ఊరించి- అప్పుడు హీరోని పెళ్లి చేసుకోవడం- ఆ శత్రకాయకు ఎంత బాధగా ఉంటుంది? నేనూ మనిషినే, నాకూ ఫీలింగ్సుంటాయి, పైగా విలన్ని కూడా కాను, హీరోని సంతోషపెట్టడానికి నన్నిలా అవమానించడం న్యాయమా- అని ఆ పాత్ర ఘోషించదూ! ఆ మేరకు ఈ చిత్రం విషాదాంతమే అనుకోవాలి.

సినీ దర్శకుడంటే సినిమా తియ్యడం వచ్చినవాడనుకుంటే- ఈ చిత్ర దర్శకుడు విజయం సాధించినట్లే! చూస్తుంటే గొప్పగా అనిపించకపోయినా, అంతగా విసుగు పుట్టనివ్వని ఈ చిత్రం ప్రేక్షకులకి విభిన్నంగా అనిపించి విజయం సాధించింది. ఆ స్ఫూర్తితో ఈ చిత్రబృందం- సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ అచ్చ తెలుగు కథని ఇంత బాగానూ తియ్యగలదని ఆశిద్దాం. 

Leave a Reply

%d bloggers like this: