ఫిబ్రవరి 12, 2014

ఎవడు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:12 సా. by వసుంధర

yevadu poster

ప్రభుత్వానికి ఆదాయం కావాలి. మద్యం దుకాణాలకి లైసెన్సులు ఇస్తుంది. సినీ నిర్మాతలకి లాభాలు రావాలి. సెక్సు, హింసల్ని సినిమాలో చొప్పిస్తారు. పెద్ద హీరోల సినిమాలు భారీగా ఉండాలి. అందుకు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. ప్రేక్షకులకి వినోదపు మత్తు కావాలి. మత్తుకి సృజనాత్మకత ఎందుకూ- ఫార్ములా సరిపోతుంది. పల్లెటూళ్లో కాలవ ఒడ్డున అమ్మే మిర్చిబజ్జీ ఒక రూపాయైతే, నగరంలో ఎగ్జిబిషన్లో అదే బజ్జీ వెల పది రూపాయలు. అలా ఈ జనవరి 12న విడుదలైంది ఓ భారీచిత్రం ఎవడు.

నిజానికిది అచ్చం ఒకేలాంటి రెండు కథల్ని రెండు భాగాలుగా తీసిన పగ, ప్రతీకారాల చిత్రం. రెండు భాగాల్లోనూ ఒకే తరహా పగ, ప్రతీకారం ఉండడంవల్ల- దీన్ని కొందరు ఒకే టికెట్‍కి రెండు సినిమాలు అన్నారు. కాసేపు అల్లు అర్జున్ కనిపించడంవల్ల దీన్ని కొందరు మల్టీస్టారర్‍గా కూడా పరిగణించారు. ఐతే దీన్ని ఒకే టికెట్‍తో ఒకే హీరోతో రెండు పాత సినిమాలు అనడం న్యాయం. కథలో మలుపులు, మెలికలు ఉన్నా అన్నీ పాతవే!

కథలో కొత్తదనం ఏమిటంటే- అల్లు అర్జున్ హీరోగా కథ మొదలౌతుంది. ఆదిలోనే హీరో విలన్ చేతుల్లో మరణించడం కూడా కొత్తదనమే కదా! కానీ అతడు కొన ఊపిరితో ఉండగా ఓ డాక్టర్ అతణ్ణి బ్రతికించి- ప్లాస్టిక్ సర్జరీతో రామ్ చరణ్ తేజ ముఖాన్నిచ్చింది. ఇది సుమారు పది నిముషాల కథ. అంతే- కొత్తదనం ఐపోయింది. చరణ్ ముఖంతో ఉన్న అర్జున్- తన శత్రువుల్ని వెదికి వేటాడి చంపడంతో ఇంటర్వల్. ఇప్పుడేమౌతుందా అనుకునేటంతలో చరణ్‍ ముఖానికి ఓ కథ ఉంది. అదీ పగ, ప్రతీకారాలదే. మొదటి పగ శరీరానిదైతే రెండో పగ ముఖానిది.

కథ మరీ పాత చింతకాయ పచ్చడి ఐనప్పటికీ మసాలా దట్టించి పోపు పెట్టడంవల్ల బాగానే ఘుమఘుమలాడుతుంది. సృజనాత్మకత లేని దర్శకులు- మసాలా మత్తుకి అలవాటుపడ్డ ప్రేక్షకులకోసం తీసిన ఈ చిత్రం చూస్తుంటే విసుగనిపించదు.

ఈ చిత్రంలో కనిపించింది కొన్ని క్షణాలే ఐనా అర్జున్ ప్రేక్షకులపై తన ముద్ర వేస్తాడు. సినిమా అంతా తనే కనిపించినా రామ్ చరణ్ గురించి గుర్తుంచుకుందుకు పెద్దగా ఏమీ లేదు. డాన్సులు బాగా చేశాడు కానీ- ఈ గ్రాఫిక్ రోజుల్లో బాబూ మోహన్ కూడా తన డాన్సులతో ఒప్పించి మెప్పించాడు మరి.  నటనకు వస్తే- చరణ్ ముఖంలో గాంభీర్యం తప్ప మరే భావమూ కనిపించడంలేదు. ఐతే అతడి సమక్షం విసుగూ అనిపించలేదు కాబట్టి- కనీసం అభిమానులకు పండగ. వారసత్వాన్ని దాటి అభిమానుల్ని సంపాదించుకునేందుకు రామ్ చరణ్ ఇంకా కృషి చేయాల్సి ఉంటుందనడానికి ఈ చిత్రం కూడా ఓ ఉదాహరణ.

కాజల్ పేరున్న నటి కాబట్టి కానీ ఆమెది ఎక్స్‍ట్రాలు ధరించాల్సిన పాత్ర. ఆమెలో పూర్వపు సొగసు లేదు. అమీ జాక్సన్‍కి అందాల ప్రదర్శనకి మాత్రమే అవకాశముంది. ఆ విషయంలో ఆమె రెచ్చిపోయింది. శ్రుతిహాసన్ పరిస్థితీ అంతే! ఐతే ఆమె వేడితనంతోపాటు ఆడతనాన్నీ సొగసుగా ప్రదర్శించింది.

చాలాకాలం తర్వాత బ్రహ్మానందం పాత్ర అతడికోసం కాక కథకోసం ప్రవేశించింది. అతడి నటన కూడా హుందాగా ఉంది. రాహుల్ దేవ్ భావప్రకటనలో రామ్ చరణ్‍తో పోటీ పడ్డాడు. అజయ్, సుబ్బరాజులు ఈ తరానికి నటులుగా ఎదుగుతారనిపించదు. కోట శ్రీనివాసరావు చూపులతోనే భయం పుట్టించేటంత ప్రతిభ కనపరిచాడు. సాయికుమార్ మాటలతో భయపెట్టి కాస్త రొటీన్‍గా అనిపించాడు. సామాన్యుడు చిత్రంలో అతడి ప్రతిభ ఈ చిత్రంలో పునరావృతం కాలేదు. అతడి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి కాబట్టి- ఇకమీదట విలన్‍గా పతనం మొదలయ్యే ప్రమాదముంది. జయసుధకి నటిగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ- ఒక బలమైన పాత్రకు- నటనలో కానీ, సంభాషణలు పలకడంలో కానీ ఆమె న్యాయం చేకూర్చలేక పోయింది.

దేవిశ్రీ పాటల్లో ఊపుంది కానీ జీవం లేదు. చిత్రీకరణ బాగుంది కానీ కొత్తదనం లేదు. అయ్యోపాపం పాటలో స్కార్లెట్ విల్సన్ మగవారిని అలరించేలా వంపుసొంపుల ప్రదర్శన చేసింది.

ఈ చిత్రం విజయవంతమైంది. అది లాటరీలో నెగ్గడంవంటిదే. చిత్రాన్ని చివరివరకూ చూసేలా తియ్యగలగడమే దర్శకత్వ ప్రతిభ అనుకుంటే- వంశీ పైడిపల్లి ప్రతిభావంతుడే! ఈ చిత్ర విజయం అతడు దర్శకుడిగా ఎదగడానికి ఆటంకం కావచ్చు. ఆ విషయం గ్రహించకపోతే- ఒకే టికెట్‍కి నాలుగు సినిమాలకు పాల్పడే ప్రమాదముంది. ఈ విజయ స్ఫూర్తితో ఈ చిత్రబృందం- సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తూ కొత్తదనమున్న తెలుగు సినిమాలు ఒకే టికెట్‍కి ఒకే సినిమాగా తియ్యడానికి మున్ముందు ప్రయత్నించగలదని  ఆశిద్దాం.  

Leave a Reply

%d bloggers like this: