Site icon వసుంధర అక్షరజాలం

ఏకత్వంలో భిన్నత్వం

భిన్నత్వంలో ఏకత్వానికి భారత దేశం ప్రసిద్ధి. ఏకత్వంలో భిన్నత్వానికి సూచికగా నిన్న మన లోక్‍సభ తెలంగాణ బిల్లును ఆమోదించింది. దీనిపై నేడు ఆంధ్రభూమిలో వచ్చిన సంపాదకీయం ఎంతో లోతైనది. అక్షరం అక్షరమూ అర్థవంతమైన ఆ వ్యాసంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో తెలుగువారున్నా- మన దేశంలోని తెలుగువారందరికీ వేదికగా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అసలు ఈ రాష్ట్రానికి తెలుగునాడు అని పేరు పెడితే బాగుండేది. కానీ అక్షరక్రమంలో ప్రథమస్థానం కోసం ఆశపడ్డారో ఏమో- అప్పట్లో మన నేతలు ఆంధ్రప్రదేశ్ అన్న పేరువైపు మొగ్గు చూపారు. ఐతే అప్పటికే తెలుగువారికోసం ప్రత్యేకరాష్ట్రమొకటి ఆంధ్రరాష్ట్రం పేరిట ఏర్పడి మూడేళ్లు  కావడంతో- ఆ ప్రాంతంవారిని ఆంధ్రులుగా వ్యవహరించడం జరిగింది. తెలంగాణ ఆంధ్రులనుంచి ఆంధ్ర శబ్దం విడివడింది. అలా ఆంధ్ర, తెలంగాణలు వేర్వేరు అన్న భావం అంతో ఇంతో అప్పుడే ఏర్పడింది. ఆంధ్రాన్ని భాషగా కాక ప్రాంతంగా గుర్తించడం రాజకీయాలు ప్రారంభించిన చారిత్రక తప్పిదం.

తెలంగాణ ప్రజలు నిజాం పాలనలో దోపిడికి గురయ్యారు. ఆ దోపిడికి అక్కడి దొరలు కూడా సహకరించారు. వారు ఎన్నో కష్టాలు పడ్డారు. తెలుగు నేర్చుకోవడం కూడా తప్పిదంగా భావించబడ్ద ఆ రోజుల్లో వారు గురయిన మానసిక, శారీరక హింస ఊహకందనిది. నిజాంనుండి విముక్తికోసం వారు ప్రాణాలకు తెగించి పోరాడారు. పోరాట పటిమ వారి రక్తంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి తెలంగాణ ఆంధ్రులు బాగా వెనుకబడి ఉన్నారు. తమ పరిస్థితి మెరుగుపడుతుందని వారు ఆశిస్తే అది సహజం. అలా జరక్కపోతే నిరాశ పడడమూ సహజం. అప్పుడు వారిలోని పోరాటపటిమ బయల్పడడమూ సహజం. అది 1969లో తీవ్రతరమై ఉప్పెనగా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడే పదవికి ఆశపడి ఆ మహోద్యమానికి ఆనకట్ట వేశాడు. ఆ తర్వాత 1972లో ఇరుప్రాంతాలవారూ కూడా వేరు పడాలంటూ ఉధృతంగా ఉద్యమించారు. రోగి కోరినదే వైద్యుడి మందు అయిన ఆ చక్కని సందర్భంలో- ఈ సమస్యకి పరిష్కారం లభించినట్లే కదా! కానీ నాయకులు అలా అనుకోలేదు. ఎలాగో ఆ ఉద్యమమూ చప్పబడిపోయింది.

దాంతో హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‍కి రాజధాని అన్న అభిప్రాయం అందరికీ కలిగింది. రాష్ట్రమంతా హైదరాబాద్ అందరిదీ అనుకున్నారు. అవకాశాలు ఉన్నప్పుడు మనది కాని చోటుకి కూడా ధైర్యం చేసి వెళ్లడం జరుగుతుంది కదా! ఇప్పుడు తెలుగునాట మధ్యతరగతి వారిలో కనీసం ఇంటికొకరు చొప్పున మనది కాని అమెరికా దేశంలో ఉన్నారు కదా!  మరి మన రాజధాని అన్న మమకారంతో రాష్ట్రం నలుమూలలనుంచీ కనీసం ఇంటికొకరు చొప్పున హైదరాబాద్ చేరుకుంటే- అది సహజం.

కోస్తా ప్రాంతానికి 123గురు ఎమ్మెల్యేలు, 18గురు ఎంపీలు- రాయలసీమ ప్రాంతానికి 52గురు ఎమ్మెల్యేలు,  7గురు ఎంపీలు ఉంటే- తెలంగాణ ప్రాంతానికి ప్రతినిధులుగా 119గురు ఎమ్మెల్యేలు, 17గురు ఎంపీలు ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు 468 రోజులు, మర్రి చెన్నారెడ్డి 1329 రోజులు (ఒకసారి 950, మరోసారి 379 రోజులు), టంగుటూరి అంజయ్య (501 రోజులు) ఆంధ్రప్రదేశ్‍కి ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పివి నరసింహారావు దేశానికే ప్రధానిగా ఉన్న తొలి (ఏకైక) తెలుగు బిడ్డ అయ్యారు. ఆయా ప్రాంతాలకు న్యాయం జరిపించడానికీ, అన్యాయం జరక్కుండా ఆపడానికీ- బాధ్యత వీరందరిదీ. అన్ని ప్రాంతాలకూ అంతో ఇంతో అన్యాయం జరుగుతూనే ఉన్నా- అన్ని ప్రాంతాల ప్రతినిధుల్లోనూ అధికశాతం ఆర్థికంగా కోట్లకు పడగలెత్తడం ఈ 57 సంవత్సరాలలోనూ జరగడం గమనార్హం. ఐతే నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం తప్పును ఇతరులపైకి నెట్టి ఇరుగుపొరుగులూ, అన్నదమ్ములూ ఒకరినొకరు ద్వేషించుకునేలా ప్రచారం చేశారు. ఐనప్పటికీ మూడు ప్రాంతాల ప్రజలమధ్యా సామరస్యభావం తొలగకపోవడం, ద్వేషభావం రగలకపోవడం కూడా వారి అనుబంధానికి నిదర్శనం. ఉమ్మడి కుటుంబాలు పోయి తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు వేరు కుంపట్లు పెట్టుకుంటున్న ఈ రోజుల్లో- వేర్పాటువాదం తప్పు కాదని తెలంగాణ ప్రాంతం వారు అనుకుంటే అది సహజమే కదా! ఆ వాదంతో వారు కెసిఆర్ సారథ్యంలో ఈ శతాబ్దంలో మళ్లీ ఉద్యమించారు. ఆ ఉద్యమం తీవ్రతరమై సకలజనుల సమ్మెకి దారి తీసినా- సీమాంధ్రలో చీమ కుట్టినట్లయినా లేదు. కారణం వారు పూర్తిగా తమ నాయకులపైనే విశ్వాసం ఉంచారు. తెలంగాణలో జరిగే ప్రజా ఉద్యమం పూర్తిగా నాయకులదనీ- సమస్యని నాయకులూ నాయకులూ పరిష్కరించుకుంటారనీ భ్రమపడ్డారు. దానికి తగ్గట్లే ఢిల్లీ పీఠం కూడా ఉద్యమాన్ని పట్టించుకోలేదు. అప్పుడు తెలంగాణలో ఢిల్లీ నేతల దిష్టిబొమ్మల్ని దహనం చెయ్యడం జరిగింది. ఐనా అక్కడ చలనం లేదు. తెలుగు జాతికి వన్నె తెచ్చి, తెలుగు భాషకు  మెరుగులు దిద్దిన, తెలుగువారికి గర్వకారణమైన మహానుభావుల శిలా విగ్రహాల్ని- ఇతర ప్రాంతాలకు చెందినవారివన్న కారణంగా విధ్వంసం చేసే స్థాయికి ఉద్యమం చేరుకున్నా-  ప్రజల గోడు పట్టని ప్రభుత మనది. అప్పుడు సీమాంధ్ర ప్రజలు కలగజేసుకుని- సోదరుల కష్టసుఖాలు అడిగి తెలుసుకోవలసింది. కానీ ఉద్యమం విఫలమైందని ఊరుకున్నారు.      

కోపం, ఆవేశం, ఉద్రేకం- ఉద్యమాలకు సరికాదని అప్పుడు తెలంగాణ నాయకులు అర్థం చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటయ్యారు. సంయమనంతో వ్యవహరించారు. ఓర్పుగా ఎదురుచూశారు. ఈలోగా ఢిల్లీ పీఠానికి ఎన్నికల జ్వరం వచ్చింది. తెలంగాణ ఆ జ్వరానికి మందుగా తోచింది. ఇచ్చింది.

ఇది సీమాంధ్రకు ఊహించని పరిణామం.  అందరిదీ అనుకున్న హైదరాబాదు తమకి పరాయిదన్న  ఊహ సీమాంధ్ర ప్రజలకు భరించశక్యం కాలేదు. వారు తీవ్రంగా ఉద్యమించారు. అధిష్ఠానానికి షరా మామూలే. ఎప్పటిలాగే వారు పట్టించుకోలేదు. కానీ ఏ నాయకుడూ పూనుకోకుండా తనంత తానే వచ్చిన ఈ ఉద్యమం తీవ్రరూపం అక్కడి నాయకుల్ని వణికింపజేసింది. అధిష్ఠానానికి సాష్టాంగపడడం తప్ప మరేమీ తెలియని వారు ఏం చెయ్యాలో తెలియక తోచిన మాటలు చెప్పారు. రాజీనామా లన్నారు. ధిక్కారం అన్నారు. రకరకాల విన్యాసాలు చేశారు. కానీ ప్రజలు ఒక్క త్రాటిమీద ఉంటే తాము మాత్రం తలో దారీ అయ్యారు. ఒకరినొకరు తప్పు పడుతూ సమైక్యపోరాటం అన్న పదాన్ని అపహాస్యం పాలు చేశారు. అది నటనో, అమాయకత్వమో, విధేయతో, స్వార్థమో, అసమర్ధతో తెలియదు కానీ- రాష్ట్ర విభజనకు తామే సహకరించారు.

ఎట్టకేలకు ఫిబ్రవరి 18న- తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. లోక్‍సభ తెలంగాణను 29వ రాష్ట్రంగా ప్రకటిస్తూ- ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈలోగా అప్పటి విగ్రహ ధ్వంసంలాగే, ఇప్పుడు పెప్పర్ స్ప్రేలు వార్తల్లోకొచ్చాయి. ఎవరూ ఎవరినీ తప్పు పట్టేది లేదు. మన నాయకత్వం అలాంటిది. మన ప్రతినిధులు అలాంటివారు. వారికి తప్పొప్పులు, సిగ్గెగ్గులు తెలియవు. వారు మనకి ప్రతినిధులు కాబట్టి- వారిని మనం తప్పు పట్టలేం.

తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలను, వారి ఉద్యమస్ఫూర్తిని, వారి నేతల్ని అభినందిద్దాం. వారికి శుభాకాంక్షలు అందజేద్దాం. ఐతే ఒక హెచ్చరిక! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- ఏ తెలంగాణ నాయకులు తాము బాగుపడి ప్రజలకు మేలు చెయ్యలేకపొయ్యారో, వారే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాయకులుగా పోటీ చెయ్యనున్నారు. సంజాయిషీ లేదు కాబట్టి- వారివల్ల మేలు జరుగుతుందన్న ఆశ పెట్టుకోవచ్చు. కానీ తమ నాయకుల గత చరిత్రను క్షుణ్ణంగా విశ్లేషించుకుని- ఎంపికలో తగిన జాగ్రత్త వహించడం పౌరుల బాధ్యత. ఇకమీదట సంజాయిషీలకు, ఆరోపణలకు తావుండరాదని వారు నేతలకు గట్టిగా చెప్పాలి. అలా జరిగి తెలంగాణ వర్ధిల్లాలని అక్షరజాలం కోరుకుంటోంది.

ఇదే హెచ్చరిక సీమాంధ్ర పౌరులకూ వర్తిస్తుంది. అధిష్ఠానాన్నే తప్ప పౌరుల్నిపట్టించుకోని నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పి- మీ ప్రతిభావ్యుత్పత్తులకు తగిన వేగంతో, ముందుచూపుతో సాగిపొండి. ప్రస్తుతానికి తెలంగాణ కాదనలేజి్సత్యం. అది గుర్తించక తప్పదు.

తెలంగాణ వచ్చేక దేశంలో తెలుగువారి స్థానమేమిటో పరిశీలిద్దాం.

చిదంబర రహస్యం: పూర్వం మహామంత్రి తిమ్మరుసు- పెద్ద గీతని చిన్న గీత చెయ్యడానికి- ఆ గీత పక్కన ఇంకాస్త పెద్ద గీత గీశాడట. దక్షిణ భారతంలో 42గురు ఎంపీలతో అగ్రస్థానంలో ఉన్న ఆంద్రప్రదేశ్‍ అనే పెద్దగీతని- 39 ఎంపీలున్న తమిళనాడుకంటే చిన్నగీత చెయ్యాలనుకున్నాడు చిదంబరం. అందుకాయన పెద్ద గీతలో బీటలు సృష్టించాడు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‍లో ఎంపీల సంఖ్య 25కి, తెలంగాణలో ఎంపీల సంఖ్య 17కి పడిపోయింది. మొత్తంమీద తెలుగువారు తమిళనాడుకంటే ప్రాతినిధ్యంలో ఎంతగానో వెనుకబడ్డారు. కానీ రాష్ట్రం ఏమైనా- తెలుగువారు  ఒక్కటిగా ఉంటే- దక్షిణాదిన తెలుగువారి అగ్రస్థానం ఇంకా కొనసాగుతుందన్నది చిదంబర రహస్యం.

నెహ్రూ కుటుంబ నాయకత్వం: 1965లో లాల్ బహదూర్ శాస్త్రి, 1977లో మొరార్జీ దేశాయ్, 1991లో పివి నరసింహారావు, 1999లో అతల్ బిహారీ వాజపేయి- మన దేశ ప్రధానుల్లో నెహ్రూ కుటుంబానికి చెందనివారు. సుమారు 13 సంవత్సరాల్లో వారి సాఫల్యాలముందు మిగతా 53 సంవత్సరాల నెహ్రూ కుటుంబీకుల పాలన వెలవెలబోతుందన్నది చారిత్రక సత్యం. ఇప్పుడు తెలంగాణ సాధనకు నెహ్రూ కుటుంబమే సహకరించినా- చేసిన తీరులో వంకలున్నాయని దేశమంతా ఘోషిస్తోంది. కాబట్టి ఆ కుటుంబాన్ని సన్మానానికి అర్హంగా భావించినా,  నాయకత్వం ఇవ్వడం విషయంలో తెలంగాణ పౌరులు దూరాలోచన చెయ్యాల్సి ఉంది. రాష్ట్రసాధనకు చేసిన పోరాటంలో చూపిన సమైక్యభావాన్ని చిరకాలం చూపేలా నాయకుల్ని శాసించగల సత్తా తెలంగాణ పౌరులకున్నదనే అక్షరజాలం నమ్ముతోంది.

తెలంగాణ తల్లిః తెలంగాణ భాష కాదు. ఒక ప్రాంతం. అది ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రమైనా ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ప్రాంతానుగుణంగా సామాన్యులు మాట్లాడే భాషలోని యాస అక్కడా ఉంది. అలా ఒకచోట నండూరి వారి ఎంకి పాటలుంటే, ఒకచోట గద్దర్ పాటలుంటాయి. కానీ భాష బ్రతకాలన్నా, వర్ధిల్లాలన్నా మాతృభాషకు తగిన ప్రాధాన్యముండాలి. పోతన, సినారె, దాశరథి వగైరాల సాహిత్యం వారితోనే అంతరించి పోరాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‍కి ఆంధ్రప్రదేశ్ తల్లి, తెలంగాణకు తెలంగాణ తల్లి అనికాక- అందరికీ తెలుగు తల్లి కావాలి. భాషలు వేరైనా మన దేశపౌరులందరూ భరతమాత బిడ్డలు.  అలాగే రాష్ట్రాలు వేరైనా తెలుగువారందరూ తెలుగుతల్లి బిడ్డలు. ఈ భావాన్ని ప్రాథమిక పాఠశాల స్థాయినుంచే పిల్లల్లో ప్రవేశపెట్టాలి.

సమైక్యం: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ పౌరులు వేర్పాటు కావాలనుకున్నారు. వారి అభీష్ఠాన్ని మన్నించాలి. ఆంధ్రప్రదేశ్‍నుంచి తెలంగాణ విడిపోతే తెలుగు జాతి విడిపోయినట్లు కాదు. కులం, మతం, వర్గం పేరిట విడిపోయి మసలుతున్న మనల్ని ఒక్కటిగా కలిపి ఉంచుతున్నది భాష. ఆ భాష బ్రతికినంతకాలం మనం కలిసే ఉంటాం. రెండవ ప్రపంచ యుద్ధంలో రెండుగా విడిపోయిన జర్మనీ- నాలుగు దశాబ్దాల తర్వాత తిరిగి ఒక్కటయింది. ఒకే భాషవారు రెండు శత్రు దేశాలుగా విడిపోయిన బాధ ఆ దేశీయుల్లో ఏ ఒక్కరినడిగినా చెబుతారు. మనం ఒకే దేశంలో రెండు రాష్ట్రాలుగా విడిపోయాం. అదీ మిత్రభావంతో. ఇప్పుడు ఆంగ్ల ప్రభావంతో తెలుగు భాష అంతరించిపోకుండా కాపాడడానికి రెండు ఆధిపత్యాలు కృషి చెయ్యవచ్చు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అగ్రస్థానానికి కారణం- ఆ దేశం భాషకోసం గ్యోతే ఇన్‍స్టిట్యూట్ల ద్వారా చేస్తున్న గొప్ప కృషి. అలాంటి కృషి మనమూ మన భాష విషయంలో చెయ్యాలి. ఆ స్ఫూర్తి పౌరుల మానసిక వికాసానికీ, తద్వారా ఆర్థిక ప్రగతికీ పునాదులు వేస్తుంది. మనకున్న సమస్యలే మానసికం, ఆర్థికం. అవి తొలగిపోతే- మనని ప్రభావితంచెయ్యగల మహానాయకులు మనలోంచే పుడతారు. వారు మనల్ని ప్రాంతీయంగానూ సమైక్యం చెయ్యడానికి ప్రభావితం చేస్తారు. ఇది కాలజ్ఞానం.

కొసమెరుపుః నేను రాజమండ్రి ప్రాంతాల్లో 18 సంవత్సరాలు, విశాఖపట్నంలో 6 సంవత్సరాలు, ఒరిస్సాలోని భువనేశ్వర్‍లో 35 సంవత్సరాలు గడిపి పదేళ్లుగా హైదరాబాద్‍లో ఉంటున్నాను. నా భార్య కాకినాడ ప్రాంతాల్లో 14 సంవత్సరాలు, విశాఖపట్నంలో రెండేళ్లు- మిగతాది నాతో డిటో. మా అమ్మాయి 22 సంవత్సరాలు భువనేశ్వర్లో గడిపి, హైదరాబాద్ అబ్బాయిని పెళ్ళి చేసుకుని, 21 సంవత్సరాలుగా హైదరాబాద్‍లో ఉంటోంది. మా అబ్బాయి 18 సంవత్సరాలు భువనేశ్వర్లో గడిపి, నాలుగు సంవత్సరాలు బీహార్‍లోని మెస్రాలో (ఇప్పుడు జార్ఖండ్‍లో ఉంది) గడిపి, తర్వాతనుంచి అమెరికాలో ఉంటూ ఇప్పుడు అమెరికన్ పౌరుడుగా అక్కడే స్థిరపడ్డాడు. తన భార్య ఖమ్మం అమ్మాయి. ఇప్పటికీ మాది ఒకే కుటుంబం. మేము, మాలాంటి ఎందరమో- మీరెవరని ఎవరైనా అడిగితే- కులం, మతం, రాష్ట్రం, దేశం  పేర్లు చెప్పకుండా ముందుగా తెలుగువారిమని చెప్పుకుంటాం. అదీ భాష!

 

Exit mobile version