ఫిబ్రవరి 26, 2014

పాండవులు పాండవులు తుమ్మెద- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:02 సా. by వసుంధర

pandavulu psterమోహన్ బాబు అలనాటి కథానాయకుడు. పలు విద్యాసంస్థల సంస్థాపకుడు. రాజకీయవాది. రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు జనాదరణకే ప్రాధాన్యమున్న చిత్రాలలో నటించినా, ఇప్పుడతడి ఆధ్వర్యంలో చిత్రం వస్తున్నదంటే- ఈ నేపథ్యాన్ని విద్యాధికులు గుర్తు చేసుకుంటారు. కానీ సినిమా అంటే వ్యాపారం మాత్రమేనన్న దృక్పథానికే అతడు కట్టుబడ్డాడనడానికి ఇటీవల జనవరి 31న విడుదలైన పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం నిదర్శనం.

ఇటీవల ఈటివిలో సంచలనం సృష్టిస్తున్న జబర్దస్త్ అనే సీరియల్‍లో కొందరు నటులు అత్యంత ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కానీ మగవాళ్లు ఆడవాళ్ల వేషం వెయ్యడమూ, చీటికీ మాటికీ తన్నుకోవడాలూ, రెండర్థాల అశ్లీలాలూ- హాస్యానికి ప్రధానం అనుకోవడం తరచుగా జరుగుతూండడంవల్ల ఆ కార్యక్రమం అభిరుచి పరంగా చిన్నబోతోంది. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రానికి జబర్దస్త్ కార్యక్రమం ప్రేరణ కాదు కదా అనిపిస్తుంది.

ఈ చిత్రానికి కథని ప్రత్యేకంగా చెప్పడం వృథా. ఈ సమీక్షలో అది నిక్షిప్తం. ఐతే హిందీ చిత్రం గోల్‍మాల్-3కి ఇది అనుకరణ అన్న ప్రచారం ఉంది. చూడ్డానికి మాత్రం హిందీ చిత్రం అనికాక తెలుగు సినిమా అనే అనిపిస్తుంది. ఆమేరకు చిత్రీకరణ ఫలప్రదమైంది.

ఈమధ్య చిత్రానికీ పెట్టిన పేరుకీ పొంతన ఉండడం లేదు. కానీ ఈ చిత్రానికి పెట్టిన పేరు చాలావరకూ  సరిపోయింది. ఐతే మహాభారతంతో సరిపోల్చాలన్న తాపత్రయం చిత్రం పొడుగునా కనిపిస్తుంది.

ఇందులో జోక్స్ చాలా ఉన్నాయి. అవి కథతో కలవవు. కథని నడిపించవు. నిజానికి తారాబలం లేకపోతే- ఈ చిత్రాన్ని ఓపికగా చూడడం కష్టం.  మోహన్‍బాబు, మనోజ్, విష్ణువర్ధన్, వరుణ్ సందేశ్, హంసిక, ప్రణీత, రవీనా టండన్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, గిరిబాబు, ముఖేష్ ఋషి కాక ఇంకా ఎందరో మహామహులు ఉన్నారు ఈ చిత్రంలో. సంగీతం బప్పి లాహిరి. అందువల్ల ఇది భారీ చిత్రం. అలా దీన్ని ఖరీదైన చౌకబారు చిత్రంగా భావించవచ్చు.

ఈ చిత్రంలో మంచు మనోజ్ హీరోగాకంటె స్త్రీపాత్రలో ఎక్కువ గుర్తుండిపోతాడు. విష్ణు నృత్యాల్లో ఫరవాలేదనిపించినా భావప్రకటనలో ఇంకా బాగా వెనుకబడి ఉన్నాడనిపిస్తుంది. వరుణ్ సందేశ్ అన్నివిధాలా తన ఇతర చిత్రాల్లోకంటే చాలా బాగున్నాడు. మోహన్‍బాబు వయసు కాస్త తగ్గినట్లు తోస్తుంది. ఓ పాటలో అతడి కదలికలు రికార్డింగ్ డ్యాన్సుల్ని స్ఫురణకు తెస్తాయి. ఐతే సంభాషణల్లో, భాషలో ఈ చిత్రంలో ఏ హీరో కూడా అతడి దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.

ఈ చిత్రంలో దాసరి నారాయణరావు నటుడిగా కొద్ది నిముషాలు కనిపిస్తాడు- ఆయనలోని నటుడికి జోహారు అనిపించేలా.

హంసికకు నటనకు కాస్త అవకాశమున్న పాత్ర. ఆమె బాగా ఉపయోగించుకుంది. ప్రణీత దేనికైనా రెడీ అన్నట్లు కనిపించింది, నటించింది. అందంగా కనిపించినా అత్తారింటికి దారేదిలోలా ముచ్చటగా అనిపించదు. రవీనా టండన్ బాగుంది. అవకాశం ఉన్నంతలో బాగా నటించింది.

బ్రహ్మానందంతో సహా మిగతా నటీనటులు ఉన్నామనిపించారు. ఎవరికీ గుర్తుంచుకోవాల్సిన పాత్రలు లేవు.

ఈ చిత్రంలో పాటలు కాలక్షేపాన్నిస్తాయి.  పాట వరస వినడానికి కాస్త హాయిగా అనిపించిన చూసేశా, అంతా చూసేశా అన్న గీతంలో మాట వరస అసభ్యతకు దగ్గిరగా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సందేహాలుంటే చిత్రీకరణ తీరుస్తుంది.

ఈ చిత్రానికి కథ ఉందా అన్న అనుమానం కలిగితే ఆ తప్పు కథకులదే కానీ, దర్శకుడిది కాదు. అంతమంది తారల్ని పెట్టుకుని, అందరికీ సమయాన్ని పంచిపెడుతూ, ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టేలా 156 నిముషాల చిత్రాన్ని తియ్యడానికి ఎంతోకొంత ప్రతిభ ఉండాలి. ఐతే చిత్రంలో ఎక్కడా ఉత్కంఠ కలుగదు. కానీ దర్శకుడు ఫరవాలేదనే అనిపిస్తుంది.

డబ్బే ప్రధానమనుకుని తీసిన చౌకబారు చిత్రాన్ని తారాబలం కారణంగానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలామంది సినీ దర్శక నిర్మాతల నమ్మకం. ఈ చిత్రం విజయం సాధించింది కాబట్టి ప్రేక్షక మహాశయులారా- చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ!

Leave a Reply

%d bloggers like this: