మార్చి 3, 2014

‘వి’భజనం- ఒక స్పందన

Posted in సాంఘికం-రాజకీయాలు at 1:50 సా. by వసుంధర

వెనుకబాటుతనంనుంచి బయటపడ్డానికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ కావాలని ఉద్యమం వచ్చింది.  తెలంగాణ వచ్చింది. రాగానే  ఏంచెయ్యాలి? అరవింద కేజ్రీవాల్ అట్టహాసాలు వదలాలన్నాడు. డబ్బుంటే ఉత్సవాలకు కాదు- పేదరైతులనో, వృత్తిపనులవారినో ఆదుకోవడానికి ఉద్యమించండి. పదవులకోసం ఎదురు చూడకుండా, వెనుకబాటు తనాన్ని తగ్గించడానికి ఉడతాభక్తిగా మీకు తోచింది చెయ్యండి. అసలైన ఉద్యమం ఇప్పుడ్డే మొదలయింది. సభలు నిర్వహించినా, ఘనంగా వేడుకలు జరిపినా మీవద్ద డబ్బుందనే అర్థం. ఆ డబ్బుని వెనుకబడినవారికోసం ఖర్చు చేయండి. ఆర్భాటాలు, అట్టహాసాలు ఎంత తగ్గించుకుంటే- అంత మేలు జరుగుతుంది సామాన్యులకి. 

సమైక్యానికి కట్టుబడ్డామన్న వారిలో చాలామంది- ఓ ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యగానే ఆ పదవికోసం ఎగబడ్డం- వారి చిత్తశుద్ధి ఎలాంటిదో నిరూపించింది. విడిపోయిన రాష్ట్రంలో కొత్త రాజధాని ఏమిటన్నవిషయంలోనే సమైక్యంగా ఉండలేనివారికి మరో ప్రాంతాన్ని సమైక్యం కోసం ప్రతిపాదించే హక్కు ఉందా? నిన్న మొన్నటిదాకా అమ్మనే తప్ప ప్రజల్ని పట్టించుకోనివారికి- ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇకనైనా స్వార్థ ప్రయోజనాల్ని వదలండి. ప్రజాస్వామ్యంలో స్వాములు ఢిల్లీలో ఉంటారన్న భావననుంచి బయటపడి- అసలైన స్వామిభక్ల్తిని ప్రదర్శించండి. ఒక సగటు పౌరుడు ఎలా జీవిస్తున్నాడో ఇప్పుడైనా తెలుసుకుని- అదే జీవన విధానాన్ని అనుసరించడమే అసలైన స్వామిభక్తి.  

బిజినెస్ మాన్ సినిమాలో మహేష్‍బాబు అన్నట్లు ‘దేశంలో కావాల్సినంత డబ్బుంది. ఎవరికి వారు దోచుకోవడమే’ అన్నట్లు ప్రవర్తించక- ఆ సంపదని మీ యజమానులైన ప్రజలకోసం వినియోగించండి. అదీ అసలైన ఉద్యమం. ఆ ఉద్యమం లేకుండా- ఎన్ని విభజనలైనా ‘వి’భజనకే దారి తీస్తాయి.

ఇది మా మాట కాదు. కోట్లాది తెలుగువారి హృదయ ఘోష. మచ్చుకి శ్రీ దివి కుమార్ స్పందన కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

Leave a Reply

%d bloggers like this: