మార్చి 5, 2014

అమెరికాలో రాగసాగరిక

Posted in పాడుతా తీయగా at 9:34 సా. by వసుంధర

పాడుతా తీయగా అంటూ మన బాసు (బాలసుబ్రహ్మణ్యం) అమెరికా వెళ్లాడు. అది పాటల పోటీ కాదు. ఔత్సాహిక గాయకులకు లలిత సంగీత శిక్షణ. సంగీతప్రియులకు వీనులవిందు. సంగీత జిజ్ఞాసువులకు పరిజ్ఞానం. ఈ కార్యక్రమం ఇంత అపురూపంగా నిర్వహించడం అనితరసాధ్యం అనిపించేలా చేస్తున్నది మన బాసు. ఆయనకు అభినందనలు. గత కొద్ది మాసాలుగా అమెరికాలో రాగసాగరిక పేరిట ఆయన నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో అమెరికాలోని తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఇందులో ఫైనల్సుకి చేరుకున్న నలుగురు విజేతలుః అర్జున్ అద్దేపల్లి (ప్రథమం), వంశీప్రియ (ద్వితీయం), ఉదయబిందు గొట్టపు (తృతీయం), మనీషా ఈరబత్తిని (చతుర్థం). విజేతలందరికీ అభినందనలు. ఐదువారాలు నడిచిన ఈ తుది ఘట్టం చూడడానికి ఇక్కడ ఇచ్చిన ఆయా తేదీలలో క్లిక్ చెయ్యండి. 

ఫిబ్రవరి 3    ఫిబ్రవరి 10    ఫిబ్రవరి 17   ఫిబ్రవరి 24   మార్చి 3 

ఈ కార్యక్రమంలో మనం గమనించాల్సిన కొన్ని అంశాలు. 

1. పాడుతా తీయగా అనన్య సామాన్యమైన గొప్ప లలిత సంగీత శిక్షణా కార్యక్రమం.

2. 67 ఏళ్ల వయసులో గాత్రమాధుర్యం ఏమాత్రం తగ్గకుండా, గానప్రతిభలో సాటివారికి దీటుగా- ఉన్న బాసు ఎందరికో ఆదర్శం, ప్రేరణ.

3. ఈ కార్యక్రమానికి నిరంతర వేదికగా ఉన్నఈటివి అభినందనీయం.

4. ఈ కార్యక్రమంలో వాద్యసంగీతం ఒక అద్భుతం.

 5. సినీ ప్రముఖులు భువినుంచి దివికి వచ్చిన అసాధారణ వ్యక్తులు అన్న భావం కలుగుతుంది- ఈ కార్యక్రమంలో వ్యాఖ్యలు వింటే. అసంఖ్యాకంగా సామాన్యులని ఆకర్షించడంవల్ల సినీప్రపంచానికి చెందినవారికి ఎక్కువ ప్రాచుర్యం లభించడం సహజం. వారి గుర్తింపు ఆ మేరకేననీ, మిగతావి అతిసయోక్తులనీ గ్రహించాలి.

6. అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంలో అమెరికాలో ఉండే తెలుగువారు పాల్గొన్నారు. వారు తెలుగు పాటలు పాడడమే విశేషమని కొందరు ముచ్చటపడొచ్చు. కానీ తెలుగువారికి తెలుగు రావడం ముచ్చట పడాల్సిన అంశం కాదు. రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయం. 

7. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాటల్లో చక్కని తెలుగు ఉచ్చారణతో మురిపించారు.  వారికి అభినందనలు. ఐతే పాటల్లో వినిపించిన ఉచ్చారణ మాటల్లో వినిపించకపోవడం గమనార్హం. అంటే వారు పోటీకోసం కష్టపడి పాటల్లో ఉచ్చారణ నేర్చుకున్నారు అనుకోవాలా? పాటలకు నేర్చుకున్నది మాటలకు అవసరం లేదనుకున్నారా? ముఖ్యంగా ప్రథమ బహుమతి గెల్చుకున్న అర్జున్ అద్దేపల్లి తన పేరు చెప్పేటప్పుడు కూడా- అర్జున్ ఆడ్‍పల్లి అని చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా మాటాడు నీ భాష నీ వారికిలా అని అంతా అనుకోవాలి. 

8. జర్మనీలో గ్యోతే ఇన్‍స్టిట్యూట్ ద్వారా జర్మన్ భాషని ఉచ్చారణతో సహా పకడ్బందీగా నేర్పే ఏర్పాటుంది. అలాంటి సంస్థలు తెలుగులోనూ ఉద్భవించాలి. వాటిని బాసు వంటివారు నిర్వహించాలి. పాడుతా తీయగా కార్యక్రమంలో బాసు తెలుగు ఉచ్చారణ విషయమై వహిస్తున్న శ్రద్ధ, చేస్తున్న హెచ్చరికలు ఆదర్శప్రాయం. 

 

4 వ్యాఖ్యలు »

 1. స్వాతి మాసపత్రిక వారు ‘అనిల్ అవార్డ్ కథల పోటీ’ ప్రకటించారు. అనిల్ అవార్డ్ కు ఎంపిక అయిన కథ కు రూ.25000/- బహుమతి.

  నిబంధనలు:

  *కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. పోటీ తేదీని పొడిగించేందుకు లేదా రద్దు చేసేందుకు స్వాతి పబ్లికేషన్స్ యాజమాన్యానికి సర్వ హక్కులూ ఉన్నాయి.

  *కథ అరటావు సైజు లో 10 పేజీలకు మించరాదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.

  *అనువాదాలు, అనుకరణలు ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్న కథలను పంపవద్దు.

  *బహుమతిని పొందని కథల్లో యోగ్యమైన వాటిని మామూలు ప్రచురణకు తీసుకునే హక్కు స్వాతి వారికి ఉంది.

  *మామూలు ప్రచురణకు తీసుకున్న కథలను స్వాతి మాసపత్రికలో లేదా సపరివార పత్రికలో ప్రచురిస్తారు.

  *ప్రచురణకు స్వీకరించబడని రచనలు తిప్పి పంపగోరు వారు తగినన్ని స్టాంపులు అతికించి, తమ చిరునామా వ్రాసిన కవరును జతపరచాలి.

  *కథను పంపించేటప్పుడు కవరు మీద ‘అనిల్ అవార్డ్ కథల పోటీకి’ అని వ్రాయాలి.

  కథలు పంపించవలసిన చిరునామా:

  ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట,
  పోస్ట్ బాక్స్ నం.339, విజయవాడ – 520 002.

  కథలు చేరవలసిన ఆఖరు తేదీ: 30 ఏప్రిల్, 2014.

  • ధన్యవాదాలు. ఇప్పుడే ఈ సమాచారాన్ని టపాగా ప్రచురించాం.


Leave a Reply

%d bloggers like this: