మార్చి 8, 2014

హార్ట్ ఎటాక్- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:45 సా. by వసుంధర

Heart_Attack_(film)_Album_Cover 

అసాధారణ హాలీవుడ్ చిత్రాలు అద్భుతంగా ఉండి పదేపదే చూడాలనిపించొచ్చు. కానీ సాధారణ హాలీవుడ్ చిత్రాలు కూడా మళ్లీ మళ్లీ చూడాలనిపించకపోయినా ఒకసారికి విసుగనిపించవు. వాటిలో కథ చిన్నదిగా ఉంటుంది. కొన్ని అసాధారణ సన్నివేశాలుంటాయి. నటీనటులు సహజంగా అనిపిస్తారు. సాంకేతిక విలువలు బాగుంటాయి. గంటన్నరలోగా సినిమా ముగుస్తుంది. గొప్ప చిత్రం చూశామనిపించకపోయినా కాలక్షేపం అయిపోతుంది.

ప్రముఖ తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్- తెలుగు చిత్రాల్ని అసాధారణ హాలీవుడ్ చిత్రాల్లా తీయగల సమర్థుడు. అందుకు నిదర్శనాల్లో అగ్రగణ్యం పోకిరి. ఇటీవలి బిజినెస్‍మాన్ కూడా పోకిరికి సాటి వస్తుంది. అందుకు కారణం ఆయనలో సినిమాలు బాగా తియ్యగల సత్తాతోపాటు ఓ మేధావి కూడా ఉన్నాడు. ఐతే ఇటీవల ఆయన ఎక్కువగా తనలో మేధావిని పక్కన పెట్టి సినిమాని సాధారణ హాలీవుడ్ చిత్రంలా తియ్యడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో దేవుడు చేసిన మనుషులు లాంటి తిక్క సినిమాలు కూడా తీసి- సాధారణం కంటే బాగా దిగువకు వెళ్లిపోయారు. ఐతే ఇటీవల ఆయన స్వంతంగా నిర్మించి జనవరి 31న విడుదల చేసిన హార్ట్ ఎటాక్ చిత్రం- సాధారణ హాలీవుడ్ చిత్రాల కోవకు చెందుతుందని చెప్పవచ్చు

చిత్రంలో హీరో వరుణ్‍ది పైలాపచ్చీసుగా ఉంటూ విలువల్ని పట్టించుకోకుండా హిప్పీలా తిరగాలనుకునే  తత్వం. హీరోయిన్ హయతి విలువలకు ప్రాధాన్యమిస్తుంది. ఆమెను చూసీ చూడగానే వరుణ్‍కి హార్ట్ ఎటాక్ వచ్చింది. అంటే లవ్ యట్ ఫస్ట్ సైట్ అన్నమాట! విలువలు తెలియనివాడు కాబట్టి అతడామెని ముద్దడిగాడు. విలువలు తెలుసు కాబట్టి అమె ఒప్పుకోదు. అలాంటి సమయంలో ఆమె ఇష్టసఖి ప్రియ హరిదాసు అనే నల్లవాణ్ణి ప్రేమించింది. ప్రియ తండ్రి ఇస్కాన్ రమణ ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. హయతి తనకి ముద్దిస్తే రమణని ఆ పెళ్లికి ఒప్పిస్తానంటాడు వరుణ్. అతడు తన మాట నిలబెట్టుకుంటే హయతి కూడా తన మాట నిలబెట్టుకుని వరుణ్‍ని గంటకి పైగా ముద్దెట్టుకుంది. అప్పటికే ఆమెకి అతడిపై నిజంగానే ప్రేమ పుట్టింది. ఐనా అతడికి బంధాలు ఇష్టముండదని తెలుసు కాబట్టి- ‘మళ్లీ నాకు కనబడకు’ అని మాట తీసుకుని వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయాక అచ్చం తనలాంటి పైలాపచ్చీసు అమ్మాయి చిత్రాంగద తటస్థపడితే- ఆమెకు దగ్గిర కావాలని ప్రయత్నించాడు వరుణ్. అప్పుడు తెలిసింది అతడికి- తన మనసంతా హయతి నిండిపోయిందని. ఆమెకోసం బయల్దేరడం, ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎలా కలుసుకుని ఒకటయ్యారో మిగతా కథ. ఇది సాధారణ హాలీవుడ్ స్థాయి కథ. ఈ మధ్యలో కొన్ని పాటలు, ఫైట్‍స్, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బానిసలుగా అమ్మే ఓ మాఫియా- అదనం.

వరుణ్‍గా నితిన్ స్టైలుగా ఉన్నాడు. అతడి గెటప్, భంగిమలు గొప్పగా ఉన్నాయి. క్లోజప్‍లో భావప్రకటన, బరువైన డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం చాలా పేలవంగా అనిపించాడు. అతి కొద్దిసేపు కనిపించిన నికోల్ (చిత్రాంగద) కూడా ముఖంలో అతడికంటే చక్కగా ముఖభావాలు చూపగలిగింది. హయతిగా ఆదా శర్మకి ఈ చిత్రం గొప్ప అవకాశం. అదామె చక్కగా ఉపయోగించింది. మాఫియా డాన్‍గా విక్రమ్‍జీత్ విర్క్ మూసలో నటించాడు. విలన్ అనుచరుడు అమ్ముగా అజయ్ ఎప్పటిలాగే నటించినా ఈ చిత్రంలో బాగా అనిపించాదు. హరిదాసు పాత్రలో హరి దాస్ కనిపించింది కాసేపే ఐనా గుర్తుండిపోతాడు. ఇస్కాన్ రమణగా బ్రహ్మానందం, మొబైల్ ఫుడ్ అమ్మేవాడుగా ఆలీ హుందాగా ఉన్నారు. ప్రేక్షకులు మామూలుగా వారినుంచి ఆశించే హాస్యం మాత్రం ఆ పాత్రలకు లేకపోవడం అభినందనీయం. ఇస్కాన్ వారు ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని గొడవ చెయ్యకపోవడం కూడా వారి పరిణతికి నిదర్శనం, అభినందనీయం. చివర్లో ప్రకాష్‍రాజ్ మెరుపులా మెరిశాడు. ఏది ఏమైనా హీరో, హీరోయిన్లకు తప్ప మిగతా నటీనటుల పాత్రలు సంక్షిప్తం అనే చెప్పాలి.

పూరీ జగన్నాథ్ కథనం హాల్లో కూర్చోబెడుతుంది. ఐతే స్త్రీ పాత్రల చిత్రణ, స్త్రీలపట్ల హీరో దృక్పథం, పాటల్లో స్త్రీలనుద్దేశించిన మాటలు- ఈ నిర్భయ కాలంలో స్త్రీలపట్ల చులకన భావాన్నే కలిగిస్తాయి. మచ్చుకి చూపించండే పాట. పూరీ ఈ ధోరణినుంచి బయటపడ్డం అవసరం.

చిత్రంలో కెమెరా పనితనం కనుల విందు చేస్తుంది. పాటలు వినడానికీ హమ్ చేసుకుందుకూ బాగున్నాయి. వాటిలో అక్షరాలే తప్ప సాహిత్యం ఉన్నట్లు అనిపించదు. చిత్రీకరణ మాత్రం గొప్పగా ఉంది. సెలవనుకో పాటలో ఇటీవలి కాలంలో అరుదైన లాలిత్యముంది.  యశుమతి మయ్యా పాట హుందాగా, సరదాగా ఉంది. తూహీహై స్టైల్‍గా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న పాటలో సాహిత్యం యువతని ఆకర్షించినా అది క్షణికం. సాహిత్యం కన్విన్సింగ్‍గా ఉండడం కూడా అవసరం మరి.

పోకిరి, బిజినెస్‍మాన్ చిత్రాలు చూసినప్పటి గొప్ప అనుభూతిని ఈ చిత్రం ఇవ్వదు. సినిమా బాగా తీశారన్న భావంతో పాటు- ఇంత బాగా తియ్యగలిగినవారు గొప్ప చిత్రాలు తియ్యాలన్న ప్రయత్నం ఎందుకు చెయ్యరూ అన్న బాధ కూడా కలుగుతుంది.

మన సినీ దర్శకులు కాపీ కొట్టడానికి విదేశీ చిత్రాలు చూస్తారు. తమ కథలో అక్కడక్కడ ఉపయోగించుకుందుకు పుస్తకాలు చదువుతారు. కానీ ఓ తెలుగు కథ చదివి జీర్ణించుకుని చలనచిత్రంగా మలచగల సత్తా మాత్రం వారికి లేదు. అందువల్ల వారి చిత్రాలు తెలుగుతనానికి దూరంగా, యువతని తప్పుదారి పట్టించే విధంగా ఉంటున్నాయి. ఐనా సొమ్ము చేసుకుంటున్నారు కాబట్టి  కాలం గడిచిపోతోంది. వారి చిత్రంలో కాలంలో గతించిపోతున్నాయి.

థియేటర్‍లో కూర్చున్నంతసేపూ ఎందుకొచ్చామా అనిపించకుండా తీసినందుకు దర్శకుణ్ణి అభినందిద్దాం. మున్ముందు- తన తెలివికి, సమర్థతకు అద్దంపట్టే చిత్రాలు ఈ దర్శకుడినుంచి రాగలవని ఆశిద్దాం. ప్రస్తుతానికి హార్ట్ ఎటాక్ చిత్రం- హార్ట్ ఎ టాక్ అని సరిపెట్టుకుందాం. 

 

1 వ్యాఖ్య »

  1. సినిమా చూడటం ఒక ఎత్తు, చూస్తూ ఉన్నంత సేపూ అనిపించిన ఐడియాలు,అనుభవించిన ఆలోచనలు, సినిమా చూసి వచ్చాక, అదే క్రమం లో,అదే ఒరవడి తో అక్షర బద్ధం చేయటం ఇంకో అసలైన ఎత్తు. రచనా చదరంగం లో ఎలాంటి ఎత్తు నైనా చిత్తు చేయగల కత్తి వసుంధర గారి సొత్తు. అసలు సినిమా రివ్యూ ఎలా రాయాలో ఆది లో ముళ్ళపూడి వెంకట రమణ గారు రాసి రాసి, వాసి కెక్కారు. కాని ఈ డిజిటల్ యుగం లో సినిమా రివ్యూ రాస్తూ, పాటలు విని (కని) పిస్తూ రాయటం ఒక వైపు అయితే, సినిమా లోని మంచి ని మెచ్చు కోవటానికి వెనుకాడని విద్య తో పాటు, చెడు ని చెప్పడానికి వెరవని విజ్ఞత ఇంకో వైపు వున్న వున్న వసుంధర గారి కత్తి, కలాని కి మరో పేరు కదా. (హార్ట్ ఎటాక్)సినిమా ఎందుకు చూడాలో ఒక వేళ చూడ లేక పొతే లాభమో నష్టమో తేల్చు కోలేని సందిగ్ధత లో పడేసే దే సమీక్ష (రివ్యూ) అన్నది మరో సారి రుజువయ్యింది.
    సమీక్ష చాలా బావుంది అన్న ఒక్క మాట రాసి వూరుకోలేని నా బలహీనత ని అర్థం చేసుకుంటే చాలు .


Leave a Reply

%d bloggers like this: