Site icon వసుంధర అక్షరజాలం

బంగారు కోడిపెట్ట- చిత్రసమీక్ష

???????????????????????????????????

పెద్ద హీరోలు. గ్లామరస్ హీరోయిన్స్. భారీ తారాగణం. ఫారిన్ లొకేల్స్. ఐటమ్ డాన్సులు, ఆడపిల్లల అందాల ఆరబోతలు. తలలు పగిలిపోతూ, రక్తాలు కారిపోతూ కొట్లాటలు. భారీ బడ్జెట్. మూస కథ. ఈ సినిమాలకు జనం బాగా అలవాటు పడ్డారని మన ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుల భావన. కానీ జనం మారడంవల్ల- అలాంటి చిత్రాలు పది తీస్తే తొమ్మిది ఫట్ అయినా వాళ్లు మాత్రం మారరు.  సినీ నిర్మాణంలో ఇదో పద్ధతి.

ఓ చిన్న కథ. చిన్న తారలు. చిన్న బడ్జెట్. కొంచెం ప్రేమ. కొంచెం సెంటిమెంటు. కొంచెం సస్పెన్సు. కొంచెం సరదా. అంతో ఇంతో సందేశం. సినీ నిర్మాణంలో ఇప్పుడిదో పద్ధతి.

ఈ రెండో పద్ధతిలో జనం ముందుకొచ్చింది ఈ మార్చి 7న బంగారు కోడిపెట్ట అనే ఓ తెలుగు చిత్రం.  ఇది మూడు కథల సమాహారం.

మొదటి కథలో

భానుమతి పినిశెట్టి అనే ఓ మధ్యతరగతి అమ్మాయి. చదువు లేదు. ఇంట్లో ప్రశాంతత లేదు. దొంగ సర్టిఫికెట్లతో సంపాదించిన ఉద్యోగంలో లైంగిక ఇబ్బందులు. విసిగిపోయి డబ్బుకోసం ఏమైనా చెయ్యలనుకుంది. ఈ పాత్ర స్వాతి పోషించింది.

వంశీ అనే ఓ మామూలు కుర్రాడు. డబ్బుకోసం నేరాలకు పాల్పడ్డాడు. ఏంచేసినా ఒంటరిగానే చెయ్యాలనుకుంటాడు. ఈ పాత్ర నవదీప్ పోషించాడు.

వీళ్లిద్దరూ ఓ దొంగతనానికి చేతులు కలిపారు.

రెండో కథలో

వేణు అనే ఓ పేద యువకుడు. సినిమాల్లో హీరో కావాలని ఇల్లొదిలి వచ్చి పట్నంలో పీజా బాయ్‍గా పని చేస్తున్నాడు. అతడి అమాయకత్వాన్ని గ్రహించి సినిమావాళ్లు అతడితో ఆడుకుంటూంటారు. ఈ పాత్ర సంతోష్ పోషించాడు.

మూడో కథలో

దొరబాబు, ఎర్రబాబు అనే ఇద్దరు కవలలు. చిన్న పట్నంలో ఉండే వాళ్లమధ్య మాటలు లేవు. దొరబాబుకి ఓ సమస్య వచ్చి- తమ్ముడి కోడిపుంజు తీసుకుని సిటీకి బయల్దేరాడు. ఆ కోడిపుంజు అంటే ప్రాణం- ఎర్రబాబు కూతురు శృతికి. ఆ పిల్ల కూడా పెదనాన్నతో బయల్దేరింది. అక్కడ వాళ్లిద్దరూ కిడ్నాప్‍కి గురయ్యారు. ఈ పాత్రలు రామ్, లక్ష్మణ్, సంచలనలు పోషించారు.

దర్శకుడు రాజ్ పిప్పళ్ల ఈ మూడు కథల్నీ సమన్వయించి ఓ సస్పెన్స్ చిత్రాన్ని తీశాడు. కథనంలో కాస్త బిగుతు తక్కువనిపించినా- సాఫీగా, ఆసక్తికరంగా తీశాడు. నటీనటులు తమతమ పాత్రల్లో జీవించేలా చెయ్యడంలో దర్శకుడి పాత్ర కూడా ఉన్నదనిపిస్తుంది.

చిత్రం చివర్లో భాను, వంశీ మంచివారుగా మారిన తీరు, దర్శకుడు మంచితనానికి పట్టం కట్టిన విధం మెచ్చుకోతగ్గదిగా ఉంది. తప్పుదారి పట్టినవారు మంచిదారికి మళ్లి ప్రయోజనం పొందడం విశేషం. వేణు అసలైన హీరో అంటే ఎవరో తెలుసుకుంటాడు. దొరబాబు, ఎర్రబాబు మళ్లీ కలిసిపోతారు. అన్నీ మెచ్చుకోతగ్గ విధంగా జరిగాయి.

నవదీప్, స్వాతి ఎంతో సహజంగా తమ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఇలాంటి కఠాచిత్రాలు తరచుగా, ఇలాంటి నటీనటులతో ఇంకాస్త మెరుగైన కథనంతో రావాలనిపించే చిత్రమిది. చూస్తున్నంతసేపూ ఒక నవల చదువుతున్నట్లుంటుంది. తప్పుదారిన వెడుతున్నవారిని హెచ్చరిస్తుంది. చక్కని సందేశాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ కలిగిస్తుంది.

మాటలు బాగున్నాయి. పాటలు బాగున్నాయి. పాటల చిత్రీకరణలో- మబ్బు మబ్బు అన్న పాట పాత రోజుల్ని గుర్తు చేసే కొత్త ఒరవడి. పాటలో డాన్సులు లేవు, హీరో హీరోయిన్లు తప్ప వేరే జనాలు ఆడిపాడరు. ఐనా పాట గుర్తుండిపోతుంది- చిత్రీకరణ కారణంగా కూడా! అన్ని పాటల చిత్రీకరణా బాగుండడమే కాక ఎక్కడా కథనానికి అడ్డం రాకపోవడం విశేషం.

ఈ చిత్రం మచ్చు చూడడానికి చిన్నదానితో పాటు కాస్త పెద్ద ట్రెయిలర్ కూడా ఉంది.  దీనిపై ఓ విడియో సమీక్ష కూడా వచ్చింది.

భారీ బడ్జెట్ చిత్రాలతో విసిగిపోయినవారికి ఈ చిత్రం ఓ గొప్ప రిలీఫ్. అలాగని ఇది గొప్ప చిత్రమేం కాదు. అభిరుచి మాత్రం అభినందనీయం.  స్క్రీన్‍ప్లే విషయంలో మరికాస్త శ్రద్ధ వహిస్తే- రాజ్ పిప్పళ్లనుంచి ఇంకా మంచి చిత్రాలని ఆశించవచ్చు. 

Exit mobile version