ఏప్రిల్ 14, 2014
నరేంద్ర సంచలన మోడి
సోషలిజం మా నినాదం అనేవారు ఆయన్ను- చాయ్‌వాలా అని నిరసించారు. మతం తప్ప మరొకటి బుర్రలో లేనివారు- ఆయన్ను మతతత్వవాది అని ఆరోపించారు. అర్హతలతో నిమిత్తం లేకుండా అధికారాన్ని ఒక కుటుంబానికే పరిమితం చేసినవారు- ఆయనది పదవీకాంక్ష అని ఈసడించారు. వ్యక్తిగతంగా నిండా లొసుగులున్నవారు- ఆయనపై ఏ ఫిర్యాదూ చెయ్యని భార్యకి అన్యాయం చేశాడన్నారు. దేశాన్ని వెనక్కి నెడుతున్నవారు- ఆయన సాధించిన ప్రగతిని కళ్లు మూసుకుని చూస్తున్నారు.
ఆయన దేవుడు కాదు. మనిషిగా కూడా సామాన్యుడు. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారని నమ్మి- అహర్నిశలూ జనంకోసం ఏదో ఒకటి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నవాడు. ఆయన తప్పులు చెయ్యలేదనీ కాదు. చెయ్యడనీ కాదు. కానీ ఆయన్ను తప్పులెన్నువారిలో తమ తప్పులెరుగనివారే ఎక్కువ.
ఆయన నరేంద్రసింగ్ మోడి. నిన్నటిదాకా గుజరాతీయులకు తిరుగులేని నాయకుడు. నేడు ‘నమ్మి అవకాశం ఇచ్చినవారు నట్టేట ముంచారు. నిండా ములిగినవారికి చలేమిటిలే అన్న స్థితిలో ఉన్న’ భారతీయులకు ఆశాదీపం.
దేశనిర్మాణం వైపు, ప్రగతిపథంవైపు చూసే జనం- మెరుగైన మౌలిక సదుపాయాలు ఆకాంక్షించే జనం- కనీసావసరాలకోసం అలమటించే జనం- కుల మత వర్గ భాషా విభేదాల్ని రెచ్చ్గగొట్టే నాయకుల మాట వినరు. రాజకీయ పక్షాల పేర్లు, చిహ్నాలు చూడరు. ప్రస్తుతం మోడిని అంతా జాతి నాయకుడిగా, జాతీయవాదిగా భావిస్తున్నారు. బూజుపట్టిన పాత భావాలకి స్వస్తి చెప్పి, దేశాభ్యున్నతికోసం- ఓటు విలువ అంతగా తెలియని అధికసంఖ్యాక జనం కూడా ఆయనకో అవకాశం ఇస్తారని దేశాన్ని ప్రేమించేవారు ఆశపడుతున్నారు. రాజకీయాలకు, స్వలాభేపేక్షకు ప్రాధాన్యమివ్వనివారు- వాస్తవాన్ని అవగాహన చేసుకున్నవారు- మోడిని సమర్థించే అవకాశం ఉంది.
మనది అసలు సిసలు ప్రజాస్వామ్యం. నియంతలా ఎమర్జన్సీని విధించిన ఇందిరనే గద్దె దింపగలిగిన వ్యవస్థ మనది. దేశమంతటా ప్రభంజనమౌతున్న మోడి నినాదం- ఆయననో నియంతగా మార్చకుండా- ఆయన గురించి ఎన్నోవివాదాస్పద వ్యాఖ్యలు రేగాయి. రేగుతున్నాయి. వాటికి సమాధానాలు వివేకమున్నవారెవరికైనా వెంటనే స్ఫురిస్తాయి. మోడినే అడిగితే వాటికేం సమాధానాలు చెప్పగలడో తెలుసుకుందుకు- ఇటీవల రజత్ శర్మనిర్వహించిన ఆప్కీ అదాలత్ కార్యక్రమం విడియో ఇక్కడ ఇస్తున్నాం.
Leave a Reply