ఏప్రిల్ 17, 2014

సినిమాగా సినిమాకి- జాతీయ అవార్డు

Posted in పుస్తకాలు at 9:33 సా. by వసుంధర

nandagopal vemuriసినీ ప్రముఖులు నందగోపాల్ వ్రాసిన సినిమాగా సినిమా పుస్తకం ఓ విశిష్ట సఫల యత్నం. ఆ పుస్తకాన్ని సినీప్రముఖులు, ప్రముఖ పాత్రికేయులు- శ్రీ వేమూరి సత్యనారాయణ (ఫొటోలో శ్రీ వేమూరిని, నందగోపాల్‍తో చూడొచ్చు) మాటల్లో అక్షరజాలం గతంలో పరిచయం చేసింది. ఆ పుస్తకానికి ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది. సినీరంగంపై ఆసక్తి, అభిమానం ఉన్నవారందరూ చదివి తీరాల్సిన ఈ పుస్తకాన్ని ఓ తెలుగువాడు వ్రాయడమూ, దానికి జాతీయస్థాయిలో అవార్డు వ్రాయడమూ- మనందరికీ గర్వకారణం. శ్రీ నందగోపాల్‍కి అక్షరజాలం అభినందనలు. ఆ వివరాలివి.

అరవై ఏళ్ల సేకరణ… ఐదేళ్ల కృషి! (ఈనాడు దినపత్రిక ఏప్రిల్‌ 17, 2014): ప్రపంచ సినిమాపై నందగోపాల్‌ చేసిన అధ్యయన సారం ‘సినిమాగా సినిమా’ పుస్తకం. కదిలే బొమ్మల కాలం నుంచి సినిమా ఎలా మాటలు నేర్చింది.. ఆ తర్వాత సినిమాకి ఎలాంటి సొబగులు అద్దారు.. వాటి మూలంగా ప్రస్తుతం సినిమా ఏ స్థానంలో ఉంది అనే విషయాల్ని నందగోపాల్‌ ఈ పుస్తకంలో అక్షరీకరించారు. తెలుగులో వచ్చిన ఈ పుస్తకానికి ఇప్పటికే అనేక ప్రశంసలు దక్కాయి. తాజాగా 61వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ‘సినిమాపై ఉత్తమ రచన’ విభాగంలో పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా పుస్తక రచయిత నందగోపాల్‌ ఈనాడు సినిమా’తో మాట్లాడారు. ”చిన్నతనం నుంచి సినిమాయే జీవితంగా జీవించాను. సినిమాలో జరిగే ప్రతి మార్పును పరిశీలిస్తూ వచ్చాను. ఇలా అరవయ్యేళ్ల క్రితం ఓ సారి ‘సినిమా చరిత్రను పుస్తకంగా రాస్తే ఎలా ఉంటుంది’ అనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. దేశవ్యాప్తంగా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, వర్క్‌షాపులు తిరిగాను. ఈ క్రమంలో నాగిరెడ్డి, ఎల్వీప్రసాద్‌, చక్రపాణి లాంటివాళ్లు నాకు చాలా సహకారం అందించారు. అలా పొందుపరుచుకున్న సమాచారాన్నిఐదేళ్లపాటు శ్రమించి పుస్తకరూపంలోకి తీసుకొచ్చాను. నా ఈ కష్టానికి పురస్కారం దక్కడం చాలా ఆనందంగా ఉంది. సెన్సార్‌ బోర్డు సభ్యునిగానూ, ఎన్‌ఎఫ్‌డీసీ సభ్యునిగా చేయడం కూడా నాకు ఈ పుస్తక రచనలో ఉపయోగపడింది. పుస్తకంలో రాసిన ప్రతి అక్షరం సినిమాని పూర్తిస్థాయిలో ప్రజల ముందుకు తీసుకురావాలనే ఆలోచన నుంచి వచ్చినదే” అన్నారు. ఇంకా ఆంధ్రభూమి, సాక్షి వగైరా పత్రికలు కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి.

nandagopal

 

Leave a Reply

%d bloggers like this: