Site icon వసుంధర అక్షరజాలం

రౌడీ- చిత్రసమీక్ష

Rowdy-telugu-movie-poster-01

రామగోపాలవర్మ తెలుగు చిత్రసీమలో ఒక సంచలనం. భయపెట్టడంలో ఆయనదొక విభిన్న విలక్షణ బాక్షాఫీస్ స్టైల్. శివ చిత్రంలో- రౌడీయిజంతో భయపెట్టాడు. క్షణక్షణం చిత్రంలో హాస్యంతో భయపెట్టాడు. మనీ చిత్రంలో కిడ్నాప్‍తో భయపెట్టాడు. సత్యా చిత్రంలో మాఫియాతో భయపెట్టాడు. కొన్నింటికి తనే దర్శకుడు. కొన్నింటికి నిర్మాత. అన్నింటికీ కథనీ, కథనాన్నీ, కొత్తదనాన్నీ నమ్ముకున్నాడు. ఆ తర్వాత తను తీసిన చిత్రాలనే నమ్ముకుని కథ లేకుండా, పాతదనంతో వరుసగా తనదైన కథనానికి పూనుకున్నాడు. అంతవరకూ వర్మ చిత్రాలు చూసి భయపడి వినోదించే ప్రేక్షకులు- అప్పట్నించీ వర్మ చిత్రాలు చూడాలంటే భయపడుతున్నారు. ఆ భయంలో ఒకోసారి కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం అప్పలరాజు వంటి లోతైన విమర్శనాత్మక చిత్రాలని కూడా అనుమానించి భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఏప్రిల్ 4న విడుదలైంది- అర్థబలంకంటే తారాబలానికి ప్రాధాన్యమిచ్చిన రౌడీ చిత్రం.

కథ పాతదే. మంచివారికి సాయపడుతూ, చెడ్డవారిని రౌడీయిజంతో శిక్షిస్తూ, చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని- అసహాయ పౌరులకు ఆశాదీపమేకాక ఆరాధ్యదైవంగా కూడా ఉంటున్న అన్న (మోహన్ బాబు) కథ ఇది. అవినీతిపరుడైన ఓ రాజకీయ నాయకుడు (ఊహకందే సస్పెన్స్), కమేడియన్సులాంటి ఓ బృందంతో (భరణి, జీవా తదితరులు) క్రూరమైన పథకాలు వేస్తుంటాడు. ఆ బృందం- అన్న పెద్ద కొడుకు భూషణ్‍ (కిషోర్) బలహీనతల్ని ఆసరా చేసుకుని అన్నకి వ్యతిరేకంగా పని చేసేలా చేస్తుంటారు. అన్న రెండో కొడుకు కృష్ణ (విష్ణు) తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మంచిపనులు చేస్తుంటాడు. మంచి రౌడీకీ, చెడ్డ రౌడీకీ జరిగే ఈ పోరాటం- విష్ణు కొత్త అన్నగా రూపొందడంతో ముగుస్తుంది. సన్నివేశాలు, పాత్రలు అన్నీ పాతవే. పూర్తి కథకు ఇక్కడ, రెండు ఇతర సమీక్షలకు ఒకటి, రెండు మీద క్లిక్ చెయ్యండి.

అన్న పాత్రకి మోహన్ బాబు ప్రాణం పోశాడు. కృష్ణ పాత్రలో విష్ణు రాణించాడు. భూషణ్ పాత్రలో కిషోర్ కళ్లలోనే భావప్రకటన చేసిన తీరు గొప్పగా ఉంది. ఈ నటుడి గెటప్ క్రికెట్ స్టార్ శిఖర్ ధవన్‍ని గుర్తు చేస్తుంది. పాత్ర చిన్నదైనా బెనర్జీ గొప్పగా నటించాడు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ఉన్న తనికెళ్ల భరణి మొదటిసారిగా- నటనలో విఫలమై బోర్ కొట్టించాడు. గతంలో తన పాత్రలో జీవించే జయసుధ ఈ చిత్రంలో నటించింది. కథానాయికగా శాన్వి చాలా అందంగా ఉంది. నటించడానికీ, వళ్లు చూపించడానికీ కొద్దిగా అవకాశాలు వస్తే- రెండో అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుందామె.

మాటలు మోహన్ బాబు పలకడంవల్ల చాలా బాగున్నాయి. తనికెళ్ల భరణి పలకడం వల్ల చిరాగ్గా అనిపించాయి. అక్కడక్కడ మాటల్లో మెరుపులున్నా- మొత్తంమీద కాంతి 30-40 వాట్లు దాటదు.

పాటలు ఉన్నాయనిపించదు. విన్నాక గుర్తుండేవీ తక్కువే. నీమీద ఒట్టు పాటలో శాన్వి అందాల ఆరబోతకు హద్దు సెన్సారు వారు మాత్రమే అనిపించింది. ఈ పాట వినడానికి ఇంపుగా, చూడ్డానికి సొంపుగా ఉంది. ఉదాత్తమైన మోహన్ బాబు, జయసుధలమీద పాట పెట్టాలనుకున్నప్పుడు- వారి పాత చిత్రాల్లో దృశ్యాలు ఉపయోగించుకోవాల్సింది. కానీ ఈ చిత్రంలో పాట ఆ పాత్రల ఉదాత్తతకు భంగం కలిగేలా ఉంది. మచ్చుకి మరో రెండు పాటలుః ఒకటి  రెండు

దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రంలో చెప్పుకోతగ్గది. ఒక్క ఊపులో కథను నడిపించడం తెలుగు తెరకు అరుదు. పాటలు కథనానికి అడ్డు రాకపోవడం, కామెడీ ట్రాక్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించకపోవడం, చిత్రీకరణ, కథనానికి తగిన నేపథ్యం- మెచ్చుకోతగ్గ అంశాలు. Fights చాలా బాగున్నా- అన్ని చిత్రాల్లోనూ అవే కాబట్టి అంత ఆసక్తికరంగా లేవు. వాటికి బదులు- ఎత్తులు, పై ఎత్తులు (సత్యా చిత్రంలోలా) ఉంటే బాగుండేది. కథనంలో ప్రావీణమున్నా సృజనాత్మకత లోపించిందని చెప్పక తప్పదు. అన్న పెద్దకొడుకు భూషణ్ శత్రువుల్తో కలిసిపోవడంవల్ల కథలో పెద్దగా టెన్షన్ పుట్టకపోవడం- కథకుడి వైఫల్యం. చివర్లో విష్ణు మొత్తం విలన్లందర్నీ ఒక్క ఊపులో చంపేసినప్పుడు- ఈమాత్రం దానికి ఇంత సినిమా తీయాలా అనిపించడం సహజం. కథకి పెద్ద పీట వేస్తే- వర్మ కథన ప్రతిభకు న్యాయం జరుగుతుంది. కానీ ఏంచేస్తాం- చాయిస్ వర్మది!

ఈ సినిమా ఎందుకు తీసినట్లూ అనిపించినా, ఎందుకు చూశామా అని మాత్రం అనిపించదు. ఆమేరకు దర్శకుడు సఫలీకృతమైనట్లు అనుకోవచ్చు. కానీ ఐఐటి స్థాయి విద్యార్థి- డొనేషన్ కట్టి ఇంజనీరింగు కాలేజిలో చేరినప్పుడు కలిగే బాధ మాత్రం ఈ చిత్రం చూసినప్పుడు మావంటి వర్మ వీరాభిమానులకు కలుగుతుంది…..

Exit mobile version