ఏప్రిల్ 30, 2014

లెజెండ్- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 5:08 సా. by వసుంధర

legend poster

కొన్ని చిత్రాలు పేరు తెచ్చుకుందుకు తీస్తారు. అలాంటి తాపత్రయం తెలుగు నిర్మాత-దర్శకులకు తక్కువ. కొన్ని చిత్రాలు అవార్డులకోసం తీస్తారు. అలాంటి ప్రయత్నాలు తెలుగులో చాలా తక్కువగా జరిగాయి. చాలా చిత్రాలు ప్రేక్షకులకోసం తీస్తారు. వాటిలో పెద్ద తారలతో తీసే చిత్రాలు తెలుగునాట అయితే కేవలం అభిమానులకోసమే తీస్తారు. అలాంటి చిత్రమే ఇటీవల మార్చి 28న విడుదలైన లెజెండ్.

లెజెండ్ పేరు వినగానే గతంలో హిందీలో వచ్చిన షోలే అంత అద్భుతమైన కథ ఉంటుందని ఊహిస్తాం. కానీ ఈ లెజెండ్‍కి కథ పరంగా అంత సీను లేదు. సూపర్ స్టార్ బాలకృష్ణకోసం అల్లిన పరమ రొటీన్ కథ ఇది.

చెడ్డవాళ్లని శిక్షించి మంచివాళ్లని కాపాడ్డానికి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న ఓ మంచి కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద సుమన్. ఆయన పెద్ద కొడుకు బాలకృష్ణ.

మంచివాళ్లని బాధిస్తూ, చెడ్డపనులు చెయ్యడమే ధ్యేయంగా పెట్టుకుని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న జగపతిబాబు. హీరోముందు దేనికీ కొరగాకపోయినా- కానిస్టేబుల్నించి హోం మినిస్టరుదాకా తన పేరు చెబితేనే వణికిపోగల సత్తా అతడిది.

వీరిద్దరికీ మధ్య హోరాహోరీన పోరు జరుగుతుంటే మిగతా ప్రపంచమంతా ప్రేక్షకుల్లా చూస్తుంటారు. అది సహజం అనుకోవడం అలవాటైన మన ప్రేక్షకులు కూడా వినోదంగా భావించి చూస్తారు.

హీరో కుటుంబం చివరిదాకా అష్టకష్టాలూ పడుతుంది. చిత్రం చివర్లో విలన్ అంతమౌతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విలన్ని చిత్తు చేయగల హీరో సత్తానుబట్టి జరిగినదంతా ప్రేక్షకులకోసం అతడాడిన లీల అనిపిస్తుంది.

ఈ చిత్రంలో బాలకృష్ణ తనదైన శైలిలో తన పాత్రలో జీవించాడు. మొదటి సగంలో కృష్ణగా సరదాగా, రెండవ సగంలో అతడి అన్న జితేంద్రగా హుందాగా కనిపించినప్పటికీ- రెండు పాత్రల్లోనూ మనకి తెలిసిన బాలకృష్ణే కనిపిస్తాడు.

సోనాలీ చౌహాన్ అందంగా, ఆకర్షణీయంగా, దేనికైనా రెడీ అన్నట్లుంది. ఐతే ప్రేక్షకులు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదని మీడియా ఉవాచఏది ఏమైనా ఆమె పాత్ర చిత్రణపై దర్శకుడికి అంతకుమించిన ఆసక్తి ఉన్నట్లు లేదు. లేకపోతే నిస్వార్థ ఆదర్శ సంప్రదాయ కుటుంబపు లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న హీరో మనసు గెల్చుకునే లక్షణాలు ఆమెలో లేదు.

రాధికా ఆప్టే అందంగా, ముద్దుగా, హుందాగా ఉంది. బాలకృష్ణ పక్కన మరీ చిన్నదానిలా కనబడ్డానికి సంజాయిషీ కాబోలు- అతడు ప్రియురాలిని అమ్మా- అని సంబోధిస్తూంటాడు. ఇద్దరికీ రొమాన్స్ లేకపోతే ఓకే- కానీ ఈ పాటవల్ల ఆ పిలుపు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

థ్రిల్ పేరిట అపహాస్యం పాలయ్యే పాత్రలో బ్రహ్మానందం కాబట్టి రాణించాడు. ప్లాట్ బొత్తిగా బాగోలేదు.

మిగతా వారంతా సోసోయే కానీ- ఈ చిత్రంలో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శక్తియుక్తుల్లో హీరో కాలిగోటికి పోలని పాత్రకి షోలే చిత్రంలో అంజాద్‍ఖాన్ లెవెల్ బిల్డప్ తేగలగడం సామాన్యం కాదు. జగపతిబాబు నటనా సామర్ధ్యానికి గీటురాయి ఈ చిత్రం. అరుపులు ఎక్కువైనా, హావభావాలు కూడా ఎక్కువైనా- వాటిని విలన్ మేనరిజంలో భాగం చెయ్యగలిగిన ప్రతిభకి జోహార్లు. ఇకమీదట ఆయనకి మరిన్ని విలన్ పాత్రలు రావచ్చు. ఒకో చిత్రంలో ఒకోలా (గతంలో హిందీ విలన్ ప్రాణ్‍లా) ఒకో మేనరిజంతో ఒప్పిస్తే తెలుగు తెరపై విలన్ నోట తెలుగు కాని తెలుగు వినాల్సిన దుర్గతి తొలగిపోవచ్చు.

దేవిశ్రీప్రసాద్ పాటల గురించి చెప్పాల్సిందేముంటుంది. కొన్ని వినగానే గొప్పగా, కొన్ని వినగా వినగా గొప్పగా- మొత్తంమీద ఎప్పటికో అప్పటికి అన్నీ గొప్పగా ఉంటాయి. ఈ చిత్రంలో పాటలూ అంతే! మచ్చుకి నీ కంటి చూపుల్లో, ఓం శర్వాణిటైటిల్ సాంగ్, హంసనందిని ఐటమ్ సాంగ్.

ఈ చిత్రానికి మాటలు ప్రాణం. ఐతే ఉద్యమ కవిత్వం ఉద్యమస్తోత్రం చేసినట్లు- ఆ మాటలు ఒక హీరో స్తోత్రానికి ఉపయోగించడంవల్ల ఎక్కడో ఏదో తేడా ఉందనిపిస్తుంది. మనకి పురాణ పురుషులున్నారంటే- వారి వెనుక మానవత్వానికి సంబంధించిన ఎన్నో ఘనకార్యాలున్నాయి. జనమంతా వాటిని ఉత్సాహంగా వింటారు. కానీ నటనే వృత్తిగా కేవలం తెరమీద నటిస్తూ, సామాన్యప్రజలకోసం చెప్పుకోతగ్గ కృషి, త్యాగం చెయ్యకుండా- జనసేవా కార్యక్రమాల్లో పాల్గొనకుండా- అభిమానసంఘాలకే పరిమితమౌతున్న హీరోలు మనకి చాలామందే ఉన్నారు. వారి గురించి- ‘వస్తున్నా, నేనొచ్చేస్తున్నా’ అంటూ ప్రజలకి సందేశాన్నివ్వడం అభిమానులు కానివారికి చాలా పేలవంగా, కృతకంగా, విచిత్రంగా అనిపిస్తుంది. అలాంటి డైలాగ్స్ చెప్పినప్పుడల్లా- ‘ఈ చిత్రంలో వ్రాసిన మాటలు కేవలం అభిమానుల్ని సంతృప్తి పర్చడానికి వ్రాసినవి’ అన్న caption ఒకటి వేసే మాటైతే- రత్నం డైలాగులు అద్భుతం అని ఒప్పుకుని తీరాలి.

ఒక రొటీన్ కథా చిత్రానికి స్క్రీన్‍ప్లే ఎంత గొప్పగా తయారు చెయ్యొచ్చో తెలుసుకుందుకు- ఈ చిత్రం మొదటి సగం చూసి తీరాలి. రొటీన్ కథలకి స్క్రీన్‍ప్లే అవసరమా అన్న దృక్పథం రెండో సగంలో కనబడుతుంది. మన పిల్లల మాటలు, చేతలు- రోజూ చూసినా మనకి ముద్దే! పెద్ద హీరోల అభిమానులూ అంతే! లెజెండ్ అభిమానులకోసం తీసిన చిత్రం కాబట్టి- దర్శకుడు తన సింహా చిత్రాన్ని ఇక్కడా అనుకరించి ఉండొచ్చు. మరి గతాన్నీ, అభిమానుల్నీ మాత్రమే నమ్ముకున్నవారికి భవిష్యత్తు ఉంటుందని తెలుగు చిత్రసీమ హామీ ఇస్తుందేమో తెలియదు.

ఈ చిత్రంలో దర్శకుడు, సంగీత సారథి, నటీనటులు, మాటల రచయిత- అంతా అసమాన ప్రతిభ చూపారు. అందువల్ల చూస్తుంటే ఈ చిత్రం విసుగనిపించదు. కానీ అభిమానులకోసం మాత్రమే తీయడంవల్ల- మిగతా ప్రేక్షకులకి గొప్పగా అనిపించకపోవచ్చు.

సామర్థ్యమున్న ఈ చిత్రబృందం మున్ముందు తమ ప్రేక్షకుల పరిధిని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.

2 వ్యాఖ్యలు »

  1. సినిమా బావుందా లేదా అన్నది ప్రేక్షకుడే తేల్చుకోవాలి కాని ఆ సినిమా చూడాలా వద్దా అన్నది వసుంధర గారి సమీక్ష చదివాకే అన్నది నా మట్టుకు నిజం. అది ఎలా అంటే – సినిమా రివ్యూ లకి కొంత వరుకు స్వాతి లో రాజా గారి రివ్యూ బావుంటుంది అనుకుంటే, వసుంధర గారి ఎంత వరుకూ అన్నది నేను ఎప్పటికీ తేల్చు కోలేను అన్నంత నిజం. సినిమా పత్రికల లోని రివ్యూ లు సర్క్యులేషన్ దిశ గా అభిమానులని ఆకట్టుకునే వైపు ఉంటాయన్నది నిర్వివాదం. కాని అక్షరజాలం లో వసుంధర గారి సమీక్షలు నిష్పక్షపాతం గానే కాక నిర్భయం గా నిజాయితీ గా వుంటాయి. దీనికి సర్క్యులేషన్ బాధ వీరాభిమాన వెర్రి వర్తించదు కనక. సినిమా బావుందో లేదో మేం నిర్ణయించుకుంటాం మీరు మీ తరహా లో మీ కాలాన్ని కత్తి లాగ అవసరం అయిన చోట అందమైన పూల గుత్తి లాగ వాడటం మానద్దు. అభినందనలు అందుకోండి.

    • ధన్యవాదాలు. మీ సూచన మాము శిరోధార్యం.


Leave a Reply

%d bloggers like this: