మే 16, 2014

మోదీ ముబారక్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:17 సా. by వసుంధర

modi1975లో ఇందిరమ్మ ఎమర్జన్సీ విధించింది. 1977లో తొలి అవకాశం రాగానే భారత పౌరులు ఇందిరమ్మను సకుటుంబ సపరివారసమేతంగా పక్కకు నెట్టి జనతా పార్టీకి పట్టం కట్టారు. భారత పౌరులకు సహనం, మర్యాద- కాస్త ఎక్కువ పాళ్లలో ఉండొచ్చు కానీ- విజ్ఞత లేదని ఎవరనగలరు?

వారు దేశానికి కొత్త మలుపునీ, కొత్త ఊపిరినీ ఇచ్చిన పివి నరసింహారావుని (1991-96) తర్వాత కాదన్నారంటే- అందుకు కారణం ఆయనకు పార్టీలోనే విలువ లేదని గ్రహించడం. 1999లో  అతల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో భాజపాకి పట్టం కట్టేరంటే- ఆయన నరసింహారావు విధానాలను కొనసాగిస్తారన్న నమ్మకం కారణం. అలా దేశం ముందుకు పోతుంటే- కాంగ్రెసుకీ ఓ అవకాశం ఇద్దామనుకున్నారు 2004లో. అప్పుడు కాంగ్రెస్ మన్‍మోహన్ సింగ్‍కి పట్టంకడితే- అయిదేళ్ల పాలన అంతంత మాత్రంగా ఉన్నా- మన్‍మోహన్ గత చరిత్రపై (1991-96) ఆశ పెట్టుకుని 2009లో మరో అవకాశమిచ్చారు. అదెంత ఘోర తప్పిదమో- 2009-14లో ప్రతి రోజూ చెప్పింది.ా మధ్యలో అవకాశం వచ్చినప్పుడల్లా పౌరులు వారిని ఏదో రూపంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పదవికెక్కిన వారికి కళ్లు నెత్తికెక్కడంతో పాలకులా హెచ్చరికలు లెక్క చెయ్యలేదు సరికదా-  తామేం చేస్తే అదే సరైనది అన్న అహంకారంతో వ్యవహరించారు. ఆ సమయంలో మోదీ ఆవిర్భావం జరిగింది. అప్పుడు కూడా భాషాకులమత వర్గ భేదాలతో- ప్రజలను విభజించి, మభ్యపెట్టి- మోడీని బూచిని చేసి భయపెట్టాలనుకున్నారే  తప్ప తమనుతాము సమ్స్కరించుకోవాలనుకోలేదు పాలకులు. అది ఏమేరకు చేరుకుందంటే దేశంలో  కొందరు మేధావులం అనుకునేవారు, నోబెల్ బహుమతి వచ్చింది కాబట్టి రాజకీయ అవగాహనలోనూ పరిణతి ఉన్నదని భ్రమించేవారు కూడా- మోదీని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు. ఐఐటిలో పట్టభద్రులై, అవినీతిపై ధ్వజమెత్తి- అనతికాలంలో ఢిల్లీ నగరపాలనకు అర్హత సంపాదించుకున్నవారు కూడా- అవినీతికంటే ఎక్కువగా మోదీని ద్వేషించడం ప్రధానంగా పెట్టుకున్నారు. జనం అందర్నీ గమనిస్తూనే ఉన్నారు. దేశమంతటా పాలకులకు ప్రతికూల పవనాలు వీస్తుంటే- పాలకులు, కుహనా మేధావులు- మోదీకి ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడంమీద దృష్టి పెట్టారు.

ఈ ఏప్రిల్-మే నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు వచ్చాయి. దేశవ్యాప్తంగా  భారతపౌరులు భాషాకులమత వర్గ భేదాలకు అతీతంగా వ్యవహరించి- పాలక పక్షాన్ని ఈడ్చి ఊడ్చి పారేశారు. ఉన్న 543 లోక్ సభ స్థానాల్లో- మోదీ నాయకత్వంలో ఎన్డీఏని-  335 స్థానాలు గెలిపించారు. పాలక కూటమికి 59 స్థానాలు మాత్రం దక్కాయి.  అదీ చాలదన్నట్లు- భాజపానే ఏకంగా 284 స్థానాల్లో గెలిపించి- మోదీకి అదనపు ధైర్యాన్నిచ్చారు. జయహో- భారతపౌరులారా!

కాంగ్రెస్‍కి గతంలో ఇలాంటి అవమానం 1977లో ఎదురైంది. అప్పటి జనతా ప్రభుత్వం- ప్రజాపాలనతోపాటు ఇందిరమ్మపై ప్రతీకారానికి కూడా అత్యంత ప్రాధాన్యమివ్వడంవల్ల- ప్రజల్లో ఇందిరమ్మకు సానుభూతి పెరిగి 1980లో తిరిగి అధికారంలోకి రాగలిగిందామె. జనతా ప్రభుత్వం అప్పుడు చేసిన తప్పుకి ఫలితాన్ని భారతపౌరులు కొన్ని దశాబ్దాలపాటు అనుభవించాల్సి వచ్చింది.

పౌరులు నేతలనుంచి ఆశించేది వారివారి ప్రతీకారాలు కాదు. సుపరిపాలన. పౌరులు సుపరిపాలనకోసం మొహం వాచి ఉన్నారు. మోదీ దృష్టి కేవలం సుపరిపాలనమీదనే ఉంటుందని ఆశిద్దాం. అదే జరిగితే- కాంగ్రెస్‍కి మళ్లీ అధికారం రావాలంటే- ఒక్కటే మార్గం మిగులుతుంది. అది- చేసిన తప్పులు ఒప్పుకుని తమని తాము సంస్కరించుకుని సుపరిపాలనకు తగిన పథకాలు సరిదిద్దుకోవడం. అంటే సెక్యులరిజం అనే పదాన్ని ప్రత్యర్థులపై బురద జల్లడానికి కాదని గ్రహించడం. అంతా సామరస్యంగా జీవిస్తున్న ఈ ఆదర్శ సెక్యులర్ దేశంలో సెక్యులరిజం అనే పదాన్ని ఎంత తక్కువ వాడితే అంత ఎక్కువగా సుపరిపాలనకు మార్గం సుగమం ఔతుంది.

మోదీ ముబారక్!

 

 

 

7 వ్యాఖ్యలు »

  1. jonnalagadda markandeyulu said,

    నూరుగొడ్లను తిన్న రాబందు ఒక గాలివానతొ సరి. అవినీతిపరుల పరాభవమును గురించినసామెతిది. అయెతే పర్యావరణ పరిరక్షణలో భాగంగ భగవంతుడు వాటికి సృష్టి స్థితిలయలు కల్పించాడని భావించడముకూడా ఉంది.అవినీతి ఉనికి తప్పనిసరి. వ్యాపారధోరణి లేదా ఆరోగ్యసూత్రముగ పాలల్లో నీరు కలుస్తున్నాయి..చిక్కదనముతో బాటు పాలరుచి చెడిపోయేకొలది కలిసిన నీళ్ళు పాలపోలిక ఉనికిని చాటాకా కేవలం పాలను వేరుచేయలేము. హంసకు మాత్రమే ఆ శక్తిఉంది. నీతి అవినీతి “పాలు నీళ్ళల్లా” కలిసిపోయాయి. వాటిని వేరుచేయగల శక్తి హంసఅనే చట్టానికి ఉంది. చట్టంతనపని తానుచేస్తుంది. అవినీతిపరులను వదిలేది లేదు. మంచిగతమున కొంచమేఅయినా స్వీకరిస్తానని చెప్పిన మోడి హంసన్యాయమును జీర్ణించుకున్న అజాతశత్రుత్వము మనము అలవరచుకోవాలి. ప్రజలు ఇందిరాగాంధిని తిరస్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవప్రతినిధి రామారావును ఓడించారు. ఆయనను వెన్నుపోటు పొడిచాడని వెక్కిరించిన వ్యక్తికి అధికారయోగమును, పదవీచ్యుతిని సంవత్సరాలతరబడి రుచి చూపించారు. సోనియా భజనపరులను తలదించుకునేలా చేశారు. వీరందరి వెంట నడిచినవారిలో పాలునీరు న్యాయములా నీతిమంతులున్నారన్నది నిజం.మంచిని స్వీకరిస్తాననిమోది చెప్పారు. అరవైఆరు కళలలో దొంగతనము కూడా ఉంది. అదినీతి అనలేము. రామాయణ కావ్యకర్త వాల్మీకి గజదొంగ. ఋషి ప్రబోధముతో ఆదికావ్య నిర్మాత అయ్యాడు. జ్ఞానపీఠకవి మొదలు అనామకకవి వరకు వాల్మీకిని స్తుతించినవారే!కావ్యసుందరికి కావలసిన అలంకార భాష వాల్మీకినుంచి సంగ్రహించిన దొంగలమేనని ప్రశంసిస్తారు. దొంగకవిత్వముగ నిరాదరింపబడలేదు.ప్రజాస్వామ్యప్రజలు ఋషులు వంటివారు. నహుషునివంటి నూరుయజ్ఞాలను చేసిన వ్యక్తిని ఇంద్రునిగా చేసి పల్లకెమోసిన సహనముగలవారు. సహనము నశిస్తె శక్తిచూపించగలిగారు. ఆ ప్రజల వ్యక్తి ఆరాధన ఎంతసహజమో వ్యక్తిగతదూషణకూడ అంతే సహజము. చట్తము తనపనితనుచేస్తుంది. అజాతశత్రుత్వము సర్వులకు మేలు చేస్తుందన్నమోడి నిజమైన భారతీయాత్మ. అధికారముకోసం చేసేరాజనీతి కూడ వేలెత్తి చూపుతుందని చెప్పడమే నాఉద్దేశము.

    • మన పురాణాలని శ్రద్ధగా పరిశీలిస్తే- ఏలుబడి కాలం ఎక్కువగా రాక్షసులది. అందుకు కారణం- రాక్షసులు మాయావులు. సామాన్యులు సులభంగా వారి మాయలో పడిపోతారు. తాత్కాలిక స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి వారిని సమర్థిస్తారు. రాక్షసులు ఘోర తప్పిదాలు చేసినా- ‘ఈ రోజుల్లో ఆ మాత్రం తప్పు చెయ్యనివారెవ్వరు?’ అని సరిపెట్టుకుంటారు. అలా బలపడిన రాక్షసులు చివరకు ప్రపంచానికే ముప్పు తెచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అవతార పురుషులు ఆవిర్భవించి రాక్షసుల్ని అదుపు చేసి అవతారం చాలిస్తారు. ఆ తర్వాత రాక్షసులు అదుపులో ఉండాలంటే- సామన్యుల్లో ప్రలోభం తగ్గాలి. వివేకం పెరగాలి. విచక్షణ ఉండాలి. అవతార పురుషుల్లో లోపాల్నీ, రాక్షసుల్లో మంచినీ- భూతద్దంలో పెంచి చూసి- రాక్షసుల వైపే మొగ్గే మనఃస్థితినుంచి బయటపడాలి. నాయకుల్లో హంసలకోసం వెతక్క తామే హంసలై- మంచినీ, చెడునీ విడదీయగల శక్తిని సంతరించుకోవాలి. మీ ఉత్తరాన్ని బట్టి- ప్రస్తుతం సామాన్యుల మనఃస్థితి మనమాశించిన స్థాయికి చేరుకున్నట్లు తోస్తోంది. మీరు మోదీపై పెట్టుకున్న నమ్మకం, ఆశ నెరవేరగలవని ఆశిద్దాం. గుజరాత్ అభివృద్ధికి మోదీ అనుసరించిన విధానాలు గతంలో చంద్రబాబువని మోదీయే స్వయంగా అంగీకరించడం జరిగింది. అక్కడ ఆయన వరుసగా 12 ఏళ్లు అధికారంలో ఉంటే- చంద్రబాబు ఇక్కడ 9 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉండడంవలన- మన రాష్ట్రంలో పరిస్థితి నేడిలా ఉందని కొందరు అనుకుంటున్నారు. వారు హంసలో కాదో తెలియదు కానీ వారిని కాదన్నవారు హంసలు అనిపించుకునే స్థాయికి చేరలేదన్నది నిజం. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో మోదీ- అధికారానికి రావడమే కాక కలిసికట్టుగా పని చేస్తామని అంటున్నారు. వారి మంచి చెడ్డలు కాలమే నిర్ణయిస్తుంది. మీ ఆశావాదం మాకు నచ్చింది. అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: