మే 17, 2014

కొత్త జంట- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:05 సా. by వసుంధర

kotta janta

వ్యాపారంలో ధన సంపాదన ప్రధానం. తమ సంపాదన వారసులకి అప్పగించాలని వ్యాపారస్థులు అనుకుంటే అది సహజం. ప్రస్తుతం మన దేశంలో రాజకీయాలు, సినిమాలు కూడా పూర్తి వ్యాపారంగా మారిపోయాయి. అందుకే నేతలుగా, కళాకారులుగా వారసులను తయారు చెయ్యడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. ఈ పాత సంప్రదాయాన్ని అమలు చేసే మరో ప్రయత్నమే- అల్లు అరవింద్ తన కుమారుడు శిరీష్‍ని హీరోని చెయ్యడానికి తీసిన కొత్త జంట చిత్రం.

ఈ మే 1న విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి. సెక్యులరిజం అనగానే- బిజెపికి చెందనివారు- అని మన రాజకీయాల్లో కొందరు నిర్వచనం ఇచ్చినట్లే- యూత్ సినిమా అనగానే- కొంచెం యూతు, కొంచెం ట్రూతు, కొంచెం బూతు- అని మారుతి నిర్వచనం. తక్కువ బడ్జెట్లో తీస్తాడనీ, సినిమాలని హిట్ చెయ్యగలడనీ- కొందరికి అతడిమీద నమ్మకం. ఈ రోజుల్లో, ప్రేమకథా చిత్రం- బాగానే తీశాడని స్వాభిప్రాయం కూడా. తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు సాధించడం కోసమే నిర్మాత ఈ చిత్రాన్ని మారుతికి అప్పజెప్పినట్లు అనుకోవచ్చు.

తలిదండ్రులు పిల్లలకు ఉగ్గు పాలతోనే స్వార్థాన్ని నూరిపోయడంవల్ల- ఈ తరం ఇలా తయారౌతోందన్న మంచి పాయింటు ఈ కథకి మూలం. అలా స్వార్థం నిండిన ఓ యువకుడు శిరీష్, యువతి సువర్ణ- జీవితంలో ఎదగడానికి ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకే టివి చానెల్లో పని చేస్తూంటారు. చానెల్ రేటింగ్ పెరగడానికి- వాళ్లు కొత్త జంట అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కులమత వర్గ భేదాలవల్ల పెద్దలు ఒప్పుకోని ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చెయ్యడానికి ఆ కార్యక్రమం ఓ వేదిక. సువర్ణ అంటే పడి చచ్చే ఒక బిజినెస్ మాన్ (పోసాని)- శిరెష్‍ని పిలిచి- సువర్ణకోసం తనో చానెల్ పెడతాననీ- ఆమెను అందుకు ఒప్పిస్తే- తన చానెల్లో ఇద్దరికీ పెద్ద పోస్టులు ఇస్తాననీ ఆశ పెడతాడు. సువర్ణని ఒప్పించేందుకు వేరే దారి లేక- తనామెను ప్రేమించానని చెబుతాడు శిరీష్. అది నిజమే అనుకున్న సువర్ణ నిజంగానే అతణ్ణి ప్రేమించడం మొదలెట్టింది. కానీ శిరీష్‍లో స్వార్థమే తప్ప ప్రేమ ఏకోశానా లేదని తెలిసేక- ఆమె అతణ్ణి ఏవగించుకుని దూరంగా ఉంటుంది. కానీ ప్రేమ వైఫల్యాన్ని తట్టుకోలేక- ఆత్మహత్యకి కూడా ప్రయత్నిస్తుంది. శిరీష్‍లో మార్పు కథకి అంతం.

ఈ కథలో మంచి చెడ్డలు కూలంకషంగా చర్చించిన సమీక్షా విమర్శలు చదవడంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. సమీక్ష 1   సమీక్ష 2   సమీక్ష 3. వినడంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ కథలో పాయింటు, సందేశం గొప్పవి. ప్రేమలో అమ్మాయికున్న సిన్సియారిటీ అబ్బాయికి ఉండదన్న పాయింటు కూడా బాగుంది.  కానీ అవి సరైన కథగా రూపొందలేదు. పాత్రచిత్రణ కూడా లోపభూయిష్టం. వందల కోట్లకు అధిపతి ఐన శిరీష్ నేపథ్యానికీ, అతడి తీరుకీ సమన్వయం కుదరలేదు. చానెల్ రేటింగుపట్లకానీ, విద్యాధికులై ఉద్యోగాలు చేస్తున్న నేటి యువత మనస్తత్వంపట్ల కానీ సరైన అవగాహన లేకుండా సన్నివేశాలు రూపొందాయి.

ఐతే కథ చెప్పే విధానం, నడిపించిన పద్ధతి కొత్తగా, ఆసక్తికరంగా కొనసాగాయి. మాటలు కూడా చాలా బాగున్నాయి. మొదటి సగంలో ఓ కొత్త తరహా చిత్రం చూస్తున్నామన్న భ్రమ కలుగుతుంది. ఐతే నాతోపాటు ఈ సినిమా చూసిన ఓ ఈ తరం యువతి, ఓ పాతతరం మహిళ- విశ్రాంతి సమయానికే తలనొప్పి వస్తోందన్నారు. వారితో నేను ఏకీభవించడానికి రెండవ భాగం సహకరించింది.

హీరోగా అల్లు శిరీష్ పక్కింటి అబ్బాయిలా సహజంగా ఉన్నాడు. నటించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చెయ్యకపోవడంవల్ల మరింత సహజంగా అనిపించాడు. నాట్యాల్లోనూ, ఫైటింగుల్లోనూ కాస్త ఇబ్బంది పడ్డట్లే అనిపించింది. గంభీరమైన సన్నివేశాల్లో నటన పండించాల్సి వచ్చినప్పుడు మాత్రం- కొత్తవాడని స్పష్టంగా అనిపించింది. పక్కింటి అబ్బాయికి మించి కమర్షియల్ హీరోగా ప్రయత్నించడానికి మాత్రం ఈ చిత్రంలో పెర్‍ఫార్మెన్స్ పనికిరాదు. ఏదిఏమైనా- పోస్టర్లలో కంటే సినిమాలోనే ఎక్కువ బాగున్నాడు. ఇక్కడ ఒక చిన్న మాటః అమితాబ్ బచ్చన్ అందగాడు కాదు. అతడు డాన్సులు ఫయిట్లు చేసే హీరోగా పనికిరాడు. అందుకని అతడు ఆరంభంలో ఆనంద్‍లో బాబూ ముషాయ్ లాంటి వేషాలు వేసి నటుడిగా తన సత్తా నిరూపించుకున్నాడు. తను ప్రేక్షకులకి బాగా అలవాటయ్యాక నమక్ హరామ్ చిత్రంలో విలన్‍గా కూడా రాణించేక- అప్పుడు జంజీర్ చిత్రంలో సూపర్ స్టార్‍కి తగ్గ పాత్ర ధరించాడు. నటుడిగా తన విశ్వరూపం నిరూపించుకున్నాక- డాన్సులు, కామెడీ కూడా మొదలెట్టాడు. కొత్త హీరోలు ఈ విషయం గుర్తుంచుకుని- తమ పాత్రల్ని ఎన్నుకోవడం మంచిది. అదీ అమితాబ్ బచ్చన్ అంతటి ప్రతిభ ఉన్నదనుకుంటే! అలా చూస్తే ఈ చిత్రంలో శిరీష్  ఎన్నుకున్నపాత్ర సరైనదే!

హీరోయిన్‍గా రెజీనా చలాకీగా, ఉత్సాహంగా, పాత్రలో లీనమై- ఇప్పటికే ఎన్నో చిత్రాల అనుభవమున్న నటిలా అనిపించింది. కొన్ని చోట్ల అతిగా అనిపించినా, అవి త్రిష పోకడలకు అనుకరణలా ఉండడంవల్ల అలవాటైనదే అని సరిపెట్టుకోవచ్చు. ఏది ఏమైనా రెజీనా ఈ చిత్రానికి హైలైట్.

కమేడియన్‍గా సప్తగిరి తన ప్రతిభను చక్కగా ప్రదర్శించాడు. కానీ హాస్యం అంటే- కమేడియన్ని హింసించడంలోంచి పుడుతుంది- అనే సంప్రదాయానికి ప్రాధాన్యం ఎక్కువై పన్నీరు లాంటి అతడి నటనని ఎక్కడో పోసింది.

ఇటీవల నటనలో చక్కని ప్రతిభను చూపుతున్న పోసాని ఈ చిత్రంలో వెకిలిగా ఎబ్బెట్టుగా ఉన్నాడు. అతడిలోని రచయిత- తన పాత్రను దిద్దడంలో దర్శకుడికి కొంతైనా సహకరిస్తే బాగుండేది. రావు రమేష్ పాత్ర అర్థవంతం కాకపోయినా- అతడి నటన హుందాగా ఉంది.

ఈ చిత్రంలో పాటలు వినడానికి బాగున్నాయి. చిత్రీకరణ విభిన్నంగా బాగుంది. పాటల విడియోకి ఇక్కడ క్లిక్ చెయ్యండి- వీటిలో ఓసి ప్రేమ రాక్షసీ పాటని ప్రత్యేకంగా గమనించండి.

దర్శకుడిగా సత్తా ఉన్న మారుతి- కథల ఎంపికలో, సన్నివేశాల కల్పనలో ఇంకా బాగా ఎదగాల్సి ఉందనిపిస్తుంది. కొత్త జంట చిత్రాన్ని మీడియా ఫ్లాపుల్లో జమ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు చూసి విసుగెత్తినవారు- రిలీఫ్ కోసం ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చునని మాకు అనిపించింది.

అల్లు అరవింద్ తన కుమారుడితో లోబడ్జెట్ చిత్రం తియ్యడం అబినందనీయం. ఇకమీదట ఇదో కొత్త ట్రెండ్ కాగలదని ఆశిద్దాం.  

Leave a Reply

%d bloggers like this: