మే 23, 2014

రేసు గుర్రం- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:47 ఉద. by వసుంధర

racegurram-movie-latest-poster-shruti-hassan-allu-arjun

మన జనాలకి ఎన్నో సమస్యలు. వాటి పరిష్కారానికి నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచనలతో అలసిపోయిన మనసుకి విశ్రాంతికోసం- ఆలోచనలకు కాసేపైనా దూరంగా ఉండడంకోసం వారెంచుకున్న అనేక మార్గాలలో సినిమా ఒకటి. చూస్తున్నంతసేపూ చిరాకు తెప్పించకుండా వినోదాన్ని పంచే చిత్రాలు వారికి కావాలి.

ఇదీ మన ప్రేక్షకులపై సినీదర్శకుల అభిప్రాయం. ఈ అభిప్రాయంతో వారి వారి సామర్ధ్యాన్నిబట్టి కథలల్లి సినిమాలు తీస్తారు. అప్పుడప్పుడు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు. తర్కానికి అందకపోయినా, చూస్తున్నంతసేపూ చిరాకు తెప్పించకుండా, వినోదాన్నిపంచే అలాంటి చిత్రమే ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం చిత్రం.

కథని తీసుకుంటే- ఒక తండ్రికి ఇద్దరబ్బాయిలు. రామ్ (కిక్ శ్యామ్), లక్కీ అనబడే లక్ష్మణ్ (అల్లు అర్జున్). రాముడు మంచి బాలుడు. లక్కీ మంచి అల్లరిచిల్లర బాలుడు. చిన్నప్పట్నించీ అన్నదమ్ములిద్దరికీ పడదు. ఒకరినొకరు ర్యాగ్ చేసుకుంటూ తలిదండ్రులకు మనస్తాపం కలిగిస్తూంటారు. రామ్ పోలీసు ఆఫీసరు ఔతాడు. లక్కీ అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. తలిదండ్రులకు అన్నదమ్ములు సఖ్యంగా లేరనే తప్ప- లక్కీ అల్లరిచిల్లరగా ఉన్నాడన్న బాధ లేదు. ఆ తర్వాత లక్కీ అల్లరిచిల్లరగానే ఉంటూ స్పందన (శృతి హాసన్) అనే అమ్మాయిని ప్రేమించి- ఆమె ప్రేమను పొందుతాడు. స్పందన తండ్రిని (ప్రకాష్ రాజ్) కూడా అల్లరిచిల్లరగానే ఒప్పిస్తాడు. ఇదిలా ఉండగా మద్దాలి శివారెడ్డి (రవికిషన్) అనే ఓ రౌడీకి రాజకీయాల్లో ప్రవేశించాలని ఆశ. అతణ్ణి ఆపడానికి చేసే ప్రయత్నంలో రామ్ విఫలుడై అప్రతిష్ఠ పాలై ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. వాళ్ల కుటుంబం వీధి పాలౌతుంది. లక్కీ తన అల్లరిచిల్లర వ్యవహారంతోనే- శివారెడ్డికి దీటుగా నిలుస్తాడు. ఒక మంత్రిని (పోసాని కృష్ణమురళి) మెప్పించి ఒక రోజుకి పోలీసు అధికారాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. కిల్ బిల్ పాండే (బ్రహ్మానందం) అనే పోలీసు ఆఫీసరుకి ప్రత్యేక అధికారాన్నిచ్చి- అతడి వెనుక తానుంటూ ఒకేఒక్క రోజులో అల్లరిచిల్లరగానే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడు. 

ఈ రొటీన్ కథలో లాజిక్‍ని పక్కన పెడితే- కొన్ని మంచి పాయింట్లున్నాయి. ఒకటి- చిత్తశుద్ధి ఉన్న వారికి అవకాశం ఇస్తే, దేశాన్ని బాగు చెయ్యడానికి ఒక్క రోజు చాలునన్న పచ్చి నిజం. రెండు- అన్నదమ్ములెంత కొట్టుకున్నా, దానివెనుక ప్రేమానుబంధం ఉంటుందన్న ఆర్ద్రత. 

ఈ కథలో ప్రమాదకరమైన సూచన ఏమిటంటే- క్రమశిక్షణ పాటిస్తూ, విద్యావంతుడై జీవితంలో పైకొచ్చిన మనిషికంటే- అల్లరిచిల్లరగా తిరుగుతూ,  చదువుకోని మనిషే జీవితంలో హీరో ఔతాడన్న అంతర్లీన సందేశం.

అల్లు అర్జున్ లక్కీ పాత్రకి ప్రాణం పోశాడు. హావభావాల్లో నటనా ప్రతిభనీ, కదలికల్లో స్తైలిష్ స్టార్‍నీ, నృత్యాల్లో తనకు తనే సాటి అనిపించే కౌశల్యాన్నీ- సహజంగా ప్రదర్శించాడు. ఈ చిత్రం పూర్తిగా అల్లు అర్జున్‍ది. ప్రేక్షకుల్లో ఎక్కడా విసుగన్నది పుట్టనివ్వకుండా- అతడీ చిత్రాన్ని నడిపించాడు. శృతిహాసన్ పాత్రకి పేరు స్పందన ఐనా శృతిహాసన్‍గానే గుర్తుండిపోతుంది. ఆరంభంలో కాసేపు ఎమోషన్స్ లేని పాత్రలో ఆమె అద్భుతంగా జీవించింది. బహుశా ముఖంలో భావప్రకటన అవసరం లేకపోవడం అందుకు కారణం కావచ్చు. అలాంటి అవసరం వచ్చిన మిగతా సన్నివేశాలు చూసేక- ఆమె గ్లామర్ స్టార్‍గా మాత్రమే రాణించగలదా అనిపిస్తుంది. అలా ఇందులో ఆమె రాణించింది. 

బ్రహ్మానందంకి కిల్ బిల్ పాండే వంటి పాత్రలు కొట్టిన పిండి. ఇందులోనూ అదరగొట్టేశాడు. హీరోకి బాబాయి కాని బాబాయిగా- ఎమ్మెస్ నారాయణ ఆ పాత్రకి అందాన్నిచ్చి ప్రాణం పోశాడు. హీరోయిన్ తండ్రిగా ప్రకాష్ రాజ్ పూర్తి స్థాయి కామెడీ నటనని ప్రదర్శించాడు. అసహజం అనిపించే పాత్రలో మెప్పించిన ఆయన ఘనతకు జోహార్లు. రామ్ ప్రియురాలిగా సలోనీ పాత్ర చిత్రం చూసేక మర్చిపోతే- అందుకు కారణం పాత్ర చిన్నదవడమే కాదు- ఆమె నటన కూడా. కిక్ శ్యామ్ తన పాత్రకి తగ్గట్లు హుందాగా ఉన్నాడు. నటనలో చమక్కులు లేక- ఆ పాత్ర ప్రత్యేకంగా అనిపించదు. విలన్ పాత్రలో రవికిషన్ తెలుగు ప్రేక్షకులకి గుర్తుండిపోవాలనేమో- అవసరమైనకంటే ఎక్కువే నటించాడు. ఐతే అక్కడక్కడ పాత హిందీ చిత్రాల విలన్ ప్రేమ్ చోప్రాని గుర్తు చేశాడు. అతడి తండ్రి పాత్రలో ముఖేష్ ఋషి ముఖేష్ ఋషిగానే నటించాడు. ఆలీని చూడ్డమే ఒక తృప్తి అనుకునే అభిమానులకి- చూడ్డం మేరకే పరిమితమైన చిన్న పాత్ర ఆలీది. మిగతా నటీనటులు అన్ని సినిమాల్లోలాగే కనిపించారు. వారి పేర్లూ, వారూ కూడా గుర్తుండరు.

ఈ చిత్రంలో పాటలు వినడానికి నేటి తరానికి అనుగుణంగా బాగున్నాయి. చిత్రీకరణ అద్భుతంగా ఉంది. కెమేరా పనితనం కూడా ఈ చిత్రానికి ఓ పెద్ద అసెట్.

లాజిక్ లేని, కొత్తదనం కనిపించని ఓ కథని 2 గంటల నలబై నిముషాల సేపు ప్రేక్షకులకు పూర్తి వినోదం అందించేలా తియ్యడం సామాన్యమైన విశేషం కాదు. అందుకు కథా రచనకీ, స్క్రీన్‍ప్లేకీ, సంభాషణలకీ కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఎక్కువ క్రెడిట్ దర్శకుడు సురేందర్ రెడ్డికే దక్కుతుంది. రేసు గుర్రం పేరు పెట్టినందుకు ఎనర్జీకి పేరుపడ్డ అల్లు అర్జున్ ఎంపిక, భయానికీ సంతోషానికీ స్పందించని హీరోయిన్‍కి స్పందన అన్న పేరు, స్పందన లేని హీరోయిన్ ద్వారా సృష్టించిన కొత్త వినోదం, హీరో-ఎమ్మెస్‍ల అనుబంధం- ఈ చిత్రానికి ఆయన మార్కు విశిష్టత. అన్నకీ తనకీ మధ్య కనిపించే ద్వేషం- నిజానికి ద్వేషం కాదనీ, అది అపురూపమైన రాగానుబంధ ఫలితమనీ- హీరో పలికిన భావం, సన్నివేశం- ఈ చిత్రానికే హైలైట్. ఐతే బొత్తిగా లాజిక్ లేకపోవడం వల్ల ఈ చిత్రంలో అతడు, పోకిరి టైపు ఉదాత్తత కనపడదు. అందుకు దర్శకుడు ప్రయత్నించినట్లూ అనిపించదు.

లాజిక్ వద్దనుకున్నా కనపడే లోపాలుః 1. ప్రకాష్ రాజ్ తన ఇంట్లో అంతా మనసులో స్పందించాలే తప్ప- బయటకు ఎమోషన్స్ చూపకూడదని శాసించినా- ఆ శాసనాన్ని శృతిహాసన్ మాత్రమే సిన్సియర్‍గా ఫాలో అయిందా అనిపిస్తుంది. 2. హీరో తన ప్రియురాలి తండ్రిని ట్రీట్ చేసిన పద్ధతి చూస్తే, ఆడపిల్లల తండ్రిని అపహాస్యం చెయ్యడంలోనే వినోదమున్నదా అనిపిస్తుంది. 3. నిజానికి బయట ఎవరినడిగినా- తమకు రామ్ వంటి కొడుకే కావాలనీ, లక్కీ వంటి కొడుకు వద్దుకాక వద్దనీ- ఖచ్చితంగా చెబుతారు. కానీ ఈ చిత్రంలో హీరో రామ్ కాదు- లక్కీ. హీరో పాత్రలు తప్పుడు సందేశాన్ని పంపకుండా మన దర్శకులు శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం.

ఏది ఏమైనా రేసు గుర్రం కాలక్షేపానికి పనికొచ్చే ఒక వినోదాత్మక చిత్రం.  

ఈ చిత్రంపై వచ్చిన సమీక్షల్లో రెండు చదవడానికీ (ఒకటి, రెండు), ఒకటి వినడానికీ లంకె ఇస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: