మే 28, 2014

రాజకీయాల బురదలో అరవిందం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:12 సా. by వసుంధర

ఒక వ్యాపారి కల్తీ నెయ్యి అమ్ముతూ పట్టుబడ్డాడు. న్యాయాధికారి విచారణ జరిపి, ‘నాలుగు కప్పుల కల్తీ నెయ్యయినా తాగాలి, పాతిక కొరడా దెబ్బలైనా తినాలి, వెయ్యి రూపాయలు జరిమానా అయినా కట్టాలి. ఈ మూడింటిలో నీకు సులభం అనిపించిన శిక్షని ఎన్నిక చేసుకునే అవకాశం నీకిస్తున్నాను’ అన్నాడు. డబ్బు వదులుకోలేక, దెబ్బలు తినలేక- కల్తీ నెయ్యి తాగుతానన్నాడు వ్యాపారి. కానీ అరకప్పు తాగేసరికే వాంతి చేసుకుని- పోనీ కొరడా దెబ్బలు తింటానన్నాడు. నలుగైదు దెబ్బలు తగిలేసరికి భరించలేక- చివరికి వెయ్యి రూపాయల జరిమానా కట్టేశాడు. ‘ఈ నిర్ణయం ముందే తీసుకోలేకపోవడంవల్ల, నీవు మొత్తం మూడు శిక్షలూ అనుభవించావు’ అన్నాడు న్యాయాధికారి.

మన రాజకీయాలు కల్మషభరితమై- కంపు నెయ్యికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. సచ్చరిత్రుడైన అరవింద్ కేజ్రీవాల్ – అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటంలో- ఆయనకు కుడి భుజంలా ఉండేవాడు. శ్రేయోభిలాషులు వద్దన్నా వినకుండా రాజకీయాల్లో ప్రవేశించాడు. సామాన్యులకోసం ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి- అచిరకాలంలో దేశ రాజధానిలో ప్రజల మెప్పు పొంది-  ఉన్న70 సీట్లలో 28 ఎంఎల్‍ఎలని గెలిపించుకుని అందర్నీ ఆశ్చర్యపర్చాడు. అక్కణ్ణించి ఆయనకి రాజకీయాల కంపు అంటుకుంది. 31మంది ఎంఎల్‍ఎలున్న భాజపాని అదేపనిగా నిరసిస్తూ- 8మంది ఎంఎల్‍ఎలున్న కాంగ్రెస్ పార్టీతో జత కట్టాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి- 49 రోజుల్లోనే పదవికి రాజీనామా చేశాడు. దేశమంతా ఏవగించుకుంటున్న కాంగ్రెస్ పార్టీని విస్మరించి- దేశమంతా ఆశాదూతగా భావిస్తున్న మోదీని ఓడించడమే ధ్యేయం చేసుకుని అప్రతిష్ఠ పాలయ్యాడు. గడ్‍కారీ వేసిన పరువు నష్టం దావాలో కోర్టు ధిక్కారం చేసి- ప్దివేల రూపాయలకు బెయిల్ బాండ్  ఇవ్వడానికి నిరాకరించి- జైలుకెళ్ళాడు. చివరకు బెయిల్ బాండ్ ఇచ్చి జైలునుంచి బయటకొచ్చాడు. ఇవన్నీ చదువుతుంటే కల్తీ నేతి వ్యాపరి కథ గుర్తు రావడం లేదూ!

ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లో తప్పటడుగులు, తప్పుటడుగులు వేస్తున్నాడు. త్వరలో ఆయన నడకలో స్థిరత్వం రాగలదన్న ఆశ ఎందరికో ఉంది. ఆదే జరిగితే- ఆయన మోదీకి ప్రత్యామ్నాయం కాగలడని మా నమ్మకం. అందుకే ఆయన ప్రతి చర్యనీ ఆసక్తిగా గమనిస్తున్నాం.

అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ బాండ్ వార్తనీ, ఇంచుమించు అదే పోలికలతో నడుస్తున్న వామపక్షాలపై కార్టూన్‍నీ ( నేడు సాక్షి దినపత్రికలో వచ్చాయి) ఇక్కడ మీతో పంచుకుంటున్నాం.

cartoon sakshi   

1 వ్యాఖ్య »

  1. ” chastity is an opportunity denied “. వసంత కాలము వస్తే కాకి పిల్లేదొ కోకిన పిల్లేదో తెలుస్తుంది. రాజకీయము సత్య పీఠము. లోగుట్లు బయటకు తెస్తుంది.


Leave a Reply

%d bloggers like this: