జూన్ 2, 2014
వీధుల్లోంచి విధుల్లోకి
1956లో నవంబర్ 1న ఆంధ్రరాష్ట్రం తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఆనాటినుండీ తెలంగాణ ప్రాంతంలో ఎంతోకొంత అసంతృప్తి ఉంది. అది క్రమంగా బలపడి- వేరుపడాలని ఉద్యమాలు చేసేవరకూ వచ్చింది. మేధావులు, రచయితలు, ఉద్యోగులు, విద్యార్థులలో ప్రత్యేక తెలంగాణ కోసం ఆరాటం పెరిగి పెద్దదై- చివరకు మూడున్నర కోట్ల తెలంగాణ పౌరుల్లో అధిక సంఖ్యాకులకు- ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షగా, ఒక కలగా మారింది. ఆ కల ఫలించి, ఆకాంక్ష నెరవేరిన మహత్తర ఘడియలు ఈరోజు వచ్చాయి. నేడు తెలంగాణ- భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ విషయమై అక్షరజాలం విశ్లేషణ మున్ముందు టపాలలో చూడగలరు.
తెలంగాణ పౌరుల 60 ఏళ్ల కల నేడు వీధుల్లోంచి విధుల్లోకి వచ్చింది. ఆ ఘనత- ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కెసిఆర్‌ది. ఆయన నేడు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ కెసిఆర్‌కి హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు ఆంధ్రజ్యోతి దినపత్రిక వెబ్సైట్లో వచ్చిన ఆ వివరాలు మీతో పంచుకోవాలని….
హైదరాబాద్, జూన్ 2: కోట్లాది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్రసమితి రథసారథి కే.చంద్ర శేఖర రావు సోమవారం ఉదయం పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన నవ రాష్ట్రమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
కల్వకుంట్ల చంద్రశేఖర రావు అను నేను అంటూ కేసీఆర్ తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన కేసీఆర్ కలిసి సోమవారం ఉదయం సరిగ్గా 8.13 గంటలకు రాజ్‌భవన్‌లోకి ప్రవేశించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యాంగం ప్రకారం గవర్నర్ సమక్షంలో సంతకం చేశారు.
గన్ పార్క్ నుంచి కేసీఆర్ రాజ్‌భవన్ చేరుకోవడంతోనే అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకార మహోత్సవానికి రాజ్‌భవన్‌ను అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన అతిధులకు మంగళవాద్యాల నడుమ స్వాగతం పలికారు.
అంతకుముందు ఆయన తమ స్వగృహంనుంచి నేరుగా గన్‌పార్క్‌కు చేరుకుని ముకుళిత హస్తాలతో వినమ్రంగా నమస్కరిస్తూ అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన నేరుగా రాజ్‌భవన్ చేరుకున్నారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ మహమూద్ అలీ కేబినెట్ మంత్రిగా అల్లా సాక్షిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు, పద్మారావు గౌడ్, పట్నం మహేందర్ రెడ్డి, కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, జోగు రామన్న, జగదీశ్వర్ రెడ్డి వరుసగా ప్రమాణం చేశారు. తారక రామారావు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిన్నగా వెళ్లి తండ్రి కేసీఆర్ పాదాలకు వినమ్రంగా నమస్కారం చేశారు.
ఈ కేబినెట్లో మొదట అసలు ఆరుగురే ఉంటారని భావించారు. అయితే ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు సోమవారం ఉదయం వరకూ జరుగుతూనే ఉన్నాయని తెలిసింది. సోమవారం నాడు 11 మంది మాత్రమే ప్రమాణం చేసినా మరో ఆరుగురికి రెండవ విడత కేబినెట్ విస్తరణలో అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణల ప్రకారమే కేసీఆర్ కేబినెట్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. వీరిలో మొత్తం నలుగురు రెడ్డి సామాజిక వర్గీయులు, బీసీలు ముగ్గురు, ఇద్దరు వెలమ, ఒక ఎస్సీ, ఒక మైనారిటీలకు చెందినవారు. కాగా, ఈ కేబినెట్లో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు కూడా ప్రాతినిధ్యం అందని ద్రాక్షే అయ్యింది.
మాల సామాజిక సంఘానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు ఈ కేబినెట్లో చోటు లభిస్తుందని ఆశించారు. దాంతో ఆయన అసంతృప్తి చెందినట్టు తెలుస్తున్నది. అయితే ఆయన స్పీకర్‌గా వెళ్లవచ్చునని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంఘాలనుంచి స్వామి గౌడ్ లేదా శ్రీనివాస్ గౌడ్‌కు కేబినెట్ విస్తరణలో చోటు లభించవచ్చు. అలాగే వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖకు కూడా కేబినెట్లో మంత్రిగా చోటు లభిస్తుందని భావించారు. ఆమెకు కూడా కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Leave a Reply