వసుంధర అక్షరజాలం

పద్యాలు వాన కురిపిస్తాయి

ప్రముఖ తెలుగు పండితులు, రచయిత- డా. జొన్నలగడ్డ మార్కండేయులు అందిస్తున్న ఆసక్తికరమైన ఈ సమాచారం మీతో పంచుకోవాలని…..

వానలింకా కురియకపోవడముతో ప్రజల ఆందోళనచూసి ప్రభుత్వము చలిస్తోంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? శాస్త్రీయయుగములో దేవుణ్నెంతవరకు నమ్మవచ్చు?వీటి ఆలోచనలు అధికార,ప్రతిపక్ష వాదోపవాదనలులా ప్రజలతీర్పుకు జయాపజయాలున్నాయి. ఒకరాయి విసిరితేపోలా?దేవుడిరూపంలో శిలయై మౌనముగా ఉనికిని చాటుతున్న దేవాలయాలు సాక్షిగా వరుణయాగము సవాలును శిలామూర్తి అధికారికంగా స్వీకరించకతప్పలేదు.  ఫలితము దైవాధీనము.

యజ్ఞయాగాదులగురించి, వేదపండితులు ఋత్విజులు ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మంత్రశబ్దసంగతి నిష్ఠాగరిష్టత కాదనలేనిది. కాని ప్రాధాన్యత వహించేది మంత్రశబ్ద గత వశ్యవాక్కుదిమాత్రమె! పద్యానిది కూడ అంతే శక్తిఅని బొబ్బిలి నగర సంస్థానప్రభువు నిరూపించాడు.వశ్యవాక్కు ఛందోగణ బద్దపద్యాలకుంది. ధాత నామసంవత్సర కఱవు చారిత్రిక నిజము.అప్పటి బొబ్బిలిసంస్థానాధిపతి వేంకట శ్వేతాచలపతి రంగారావు బహద్దరు వానకురిపించే మంచిపద్యాలను రాయండని కవులను కోరాడట! అప్పుడు మండపాక పార్వతీశ్వరశాస్త్రి అమృతబీజాక్షరఘటిత నవరత్నములవంటి ఐదు పద్యాలను పంచరత్నాలుగ ప్రభువునకు సమర్పించి చదువగా వానకురిసింది. అది అతివృష్టిగ  తగ్గకపోయేసరికి హరిహరాష్టకముగ దైవాన్ని ప్రార్థించి వర్షాన్ని ఆపుచేశాడు. ఈవిషయాన్ని ఆంధ్రరచయితకర్త మధునాపంతులవారు తెలిపారు. ఈ కవినిగురించి ఆధునికకవులలో వీరేశలింగముగారు పేర్కొన్నారు. కవి మహిమను గురించి పంతులుగారు రాయలేదు. మదునాపంతులవారు మండపాక పార్వతీశ్వరశాస్త్రి ఆత్మచర్యగ సీసపద్యముగ కవి ఉదహరించిన పద్యముగ ఇచ్చారు. ఆత్మపర్యాయ చర్యాసపర్య యనెడు హరిహరేశ్వర శతకముగ(1897) లొ ముద్రితమైంది.  పద్యము రచించి వానలు కురిపించ మని కాదు. వశ్యవాక్కుల సదాశయానికి ప్రబోధము కావాలన్న ఆశతో పార్వతీశ్వశాస్త్రినిగుర్తు తెస్తున్నాను. అమృ త బీజాక్షర గణ పద్యరచన కొందరికే సాధ్యమయింది.  

          మఱియునద్ధాతలోవఱపు పట్టగజూచి—గుఱుతుతప్పక వానకుఱియునట్లు

          మంచిపద్యములు గావించి తెండని రంగ–రాయవిభుండాదరమున బల్క

          నీమీదభారంబు నేనుంచి యమృతబీ—జాక్షరఘటితపద్యంబులైదు

          పంచరత్నములబచరించి నవరత్న—పద్యయుక్తముగదత్ప్రభునకొసగ

          గాకతాళీయనయమునగాలివాన—కురియజేసితివదిమాన్పగోరి మాన్పి

          తౌర!!యతివృష్టికష్టహరాష్టకమున—హరిహరేశ్వరదేవ! మహానుభావ!

Exit mobile version