జూన్ 26, 2014

హృదయోల్లాసానికి కవికులం ‘లో’కులం

Posted in కవితా చమత్కృతులు at 6:45 సా. by వసుంధర

ఆసక్తికరమైన ఈ క్రింది వ్యాసం పంపినవారు- ప్రముఖ తెలుగు పండితులు, రచయిత డా. జొన్నలగడ్డ మార్కండేయులు.

కవిత్వం హృదయోల్లాసానికి. కథలు వ్రాసేవారు కథకులం అని చెప్పుకున్నట్లే, కవితలు అల్లేవారు కవికులం అని చెప్పుకోవచ్చు. కానీ కొందరు కవికులం వంటి పదాల్లో ఉన్న కులాన్ని వెదుకుతూ తాము లోకులం అని చెప్పుకుంటారు. వారిది ఖచ్చితంగా ‘లో’(low) కులం.

ఇప్పుడు కవుల కులాల విషయానికొద్దాం. ఆదికవి వాల్మీకి గజదొంగగా గడిపి- కవిగా మారేడన్నది ప్రచారంలో ఉన్న కథ. కవికులమంతా ఆయనకు వారసులమని గర్వంగా చెప్పుకుంటారు. కాళిదాసు గొల్లవాడు. ఆయనని కవికులతిలకుడని అంతా అంగీకరించారు.  

ఇక జాషువా కవిది కోకిల స్వరం. జ్ఞానపీఠకవి వారసులకది ‘పంచమ’స్వరం. ఇక్కడ కుల ప్రస్తావనలో కవితాచమత్కృతి చోటు చేసుకున్నప్పటికీ- కులతత్వాన్ని నిరసించేవారికి అందులో ఎంతోకొంత అపస్వరం వినిపిస్తుంది. కల్పవృక్షం ఉన్నపుడు ఓ విషవృక్షమూ ఉంటుందని సరిపెట్టుకోవాలి. ఎందుకంటే దీపాల పిచ్చయ్యశాస్త్రి, గుఱ్ఱం జాషువా గార్లు జంటకవులు కావలసింది. కానీ వాళ్ల పేర్లు ఎలా కలిపినా జంటగా హాస్యాస్పదం ఔతాయి. ‘లో’కుల విషవృక్షభావన కూడా అలాంటిదే!

తెలుగులో నైషధము, మనుచరిత్ర, పారిజాతాపహరణము, వసుచరిత్ర, విజయవిలాసము పంచకావ్యాలుగా పేరుకెక్కాయి. వాటిలో విజయవిలాసములో ప్రతిపద్యంలోనూ చమత్కారం ఇమిడ్చి తన  ప్రత్యేకతను నిరూపించున్నారు కావ్యకర్త చేమకూర వేంకటకవి.

మళ్లీ ఇక్కడ కులాల అన్వేషణ.

చేమకూర కవిత్వము సర్వజనాదరణీయమని ప్రశంసించిన కందుకూరి వీరేశలింగముగారు- లక్ష్మణామాత్య తనయుడినని చెప్పుకున్నాడు కనుక చేమకూర నియోగి బ్రాహ్మణుడని తేల్చారు. ఆ కావ్యములోనిదే మరో పద్యాన్ని ఉదహరిస్తూ- చేమకూర వేంకటకవి శూద్రుడని తేల్చారు తాపీ ధర్మారావు గారు. ఆయన ఉదహరించిన పద్యం- చేమకూర వేంకటకవి కృతిభర్త రఘునాధరాయల నాశీర్వదిస్తూ చెప్పినది. ఇంతకీ రఘునాధరాయల క్షత్రియత్వముకూడ సందేహాస్పదము. ఆయన కూడా శూద్రకులజుడు అనే వాదన చేస్తున్నవారున్నారు. ధర్మారావు ఉదహరించిన ఆ మనోహర పద్యం ఇదిః

ప్రకట శ్రీహరి యంఘ్రి బుట్టి హరు మూర్థంబెక్కి, యాపాద మ

స్తకమున్ వర్ణనకెక్కు దేవి సహజోదంచత్కులోత్పన్న నా            

యకరత్నంబని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్

సకలైశ్వర్యములు న్నిజేశువలనన్ దా గల్గగా జేయుతన్

ఈ పద్యానికి శూద్రత్వాన్ని హృదయోల్లాసం చేసే వ్యాఖ్య చేశారు ధర్మారావు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల తరువాతది శూద్రకులము. వీరు విష్ణువు పాదాలనుంచి పుట్టారు. గంగాదేవి కూడా విష్ణుపాదాలనుండి పుట్టడంవల్ల- శూద్రులు గంగాదేవికి ఆత్మీయ బంధువులయ్యారు. శ్రీహరి పాదములనుండి పుట్టిన గంగ శివుని తలపై నిలిచింది. అందుచేత ఆపాదమస్తకము శివుడామె వశములో ఉన్నాడు. అందుచేత గంగాదేవి- తన భర్త అయిన శివుడిచేత- తనకు ఆత్మీయమైన శూద్రకులానికి చెందిన రఘునాధరాయలకు సంపద లిప్పిస్తుందని ఆశీర్వదించాడు వేంకటకవి.

ఈ కవికున్న మరోపేరు వేంకటరాజు. రాజ, అమాత్య పదాలతో సమానమైన గౌరవశబ్దంగా పుట్టినది నాయుడు అన్న పదం. ఆ నాయుడు కులపుబిడ్ద అని నిరూపించారు ధర్మారావుగారు.

కవి అంటే నీటికాకి అన్న అర్థము కూడా ఉంది. లోకులు కాకులు అన్న సామెతను బట్టి లోకులలో భాగమైన కవులు కూడా కాకులే ఔతారు. పక్షులలో కాకి గొప్పతనం కాకిది కాబట్టి- కాకులమని కవులు చిన్నబుచ్చుకోనవసరం లేదు. కానీ కవికులంలో కులం వెదికే వారందరిదీ మాత్రం ‘లో’కులమని ఖచ్చితంగా చెప్పవచ్చు.

1 వ్యాఖ్య »

  1. కులకలముగా ఉన్నదీ వ్యాసము. ముగింపు పలకటములో కృతకృత్యులైనారు.


Leave a Reply

%d bloggers like this: