జూన్ 29, 2014

ఊహలు గుసగుసలాడె- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:50 సా. by వసుంధర

oohalu gusagusalade

ఒకప్పుడు మంచి చిత్రాలంటే- వేరే నిర్వచనాలుండేవి. వి. శాంతారాం, బిమల్ రాయ్, బి.ఆర్. చోప్రా, హృషీకేశ్ ముఖర్జీ, బాసు ఛటర్జీ, బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి, ఆదుర్తి, విశ్వనాథ్, రాఘవేంద్రరావు, బాపు వగైరాలు అలాంటివి తీసేవారు. వాటిలో సభ్యతకూ, సంస్కారానికీ, భావుకతకీ, కళాత్మకతకీ, సామాజికస్పృహకీ, సందేశానికీ ప్రాధాన్యముండేది.

 హీరోని సూపర్ మాన్‍గా చూపిస్తూ, హీరోయిన్ల చేత అందాలు ఆరబోయిస్తూ, హాస్యాన్ని బలవంతంగా ఇరికిస్తూ, పేరుపడ్డ అమ్మాయిలతో ఐటమ్ సాంగ్స్ చేయిస్తూ, అసభ్యతకూ అశ్లీలతకూ తావిస్తూ, రక్తాలు కారే కొట్లాటలతో నింపుతూ, విదేశాల్లో చిత్రీకరిస్తూ, భారీగా డబ్బు ఖర్చుపెట్టి అదంతా జనంనుంచి వసూలు చెయ్యాలని ప్రేక్షకులముందుకొచ్చేవి వ్యాపార చిత్రాలు. వీటిలో బాగా ఆడినవాటిని సూపర్ హిట్ చిత్రాలంటారు. ఆడనివాటిని సూపర్ ఫ్లాప్ చిత్రాలంటారు. మంచి చిత్రాలని మాత్రం అనరు.

కానీ ఇప్పుడు పైన వివరించిన వ్యాపార చిత్రాలకి భిన్నంగా ఉండి, రెండున్నర గంటల పాటు థియేటర్లో హాయినిస్తే చాలు- మంచి చిత్రం అని సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అలాంటి ఓ మంచి తెలుగు చిత్రం ఈ నెల 20న ఊహలు గుసగుసలాడె పేరిట విడుదలైంది.

కథ చాలా సాధారణం. వెంకీ (నాగశౌర్య) ప్రభావతిని (రాశి ఖన్నా) ప్రేమించాడు. ఆమె స్నేహానికే తప్ప ప్రేమకి సిద్ధంగా లేకపోవడంతో ఇద్దరూ గొడవపడి విడిపోయారు. వెంకీ పని చేసే యుబి టివి అధిపతి ఉదయ్‍కి (అవసరాల) వయసైపోతున్నా పెళ్లి కావడం లేదు. అమ్మాయిలని ఆకర్షించడంలో వెంకీ ప్రతిభని చూసి కొంత ఆశ్చర్యం. కొంత అసూయ పడుతూంటాడు. ఉదయ్‍కి శిరీష అనే అమ్మాయి నచ్చి- ఆ అమ్మాయిని మెప్పించడానికి వెంకీని టిప్స్ అడుగుతాడు. శిరీషే ప్రభావతి కావడంతో- వెంకీ ఇబ్బంది పడతాడు. ఈ ముగ్గురిమధ్యా జరిగిన హాస్యభరిత సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. విడియో రివ్యూ

వెంకీగా నాగశౌర్య ముద్దుగా ఉన్నాడు. మాటల్లో, ఆటల్లో, భావప్రకటనలో చూపిన సౌలభ్యం- ఇతడికి మంచి భవిష్యత్తుని సూచిస్తుంది. ఉదయ్‍గా అవసరాల నటన అద్భుతం. రాశి ఖన్నా ముద్దుగా, బొద్దుగా, అత్యంత సహజంగా ఉంది. ఈ ముగ్గురూ తమ తమ పాత్రలకు అతికినట్లు సరిపోయారు.  వెంకీ మేనత్త భర్తగా రావు రమేష్, పెళ్లిళ్ల బ్రోకరుగా పృథ్వి, ఎన్నారై పెళ్లికొడుకుగా హరీష్ ఈ చిత్రానికి మంచి ఊపునిచ్చారు. పోసాని తన సహజ ధోరణిలో రాణించాడు. రివ్యూ 1

ఈ చిత్రంలో పాటలు సాఫీగా, హాయిగా, అక్షరం అక్షరం అర్థమయ్యేలా ఉన్నాయి. వాటిలో ఏమిటీ హడావుడీ, ఇంతకంటే వేరే పాటలు పాత హిందీ సినీ గీతాల్లా అలరించాయి. ఇంతకంటే వేరే- రెండు తరహాల్లో రెండుసార్లు వస్తుంది. కారుణ్య పాడిన హుషారైన పాట అతడికి చాలా పేరు తేవచ్చు. స్వరమాధుర్య ప్రధానమైన పాటకి హేమచంద్ర తనదైన శైలిలో న్యాయం చేకూర్చాడు. ఏం సందేహం లేదు పాట ఇళయరాజాని గుర్తు చేసింది. మొత్తంమీద ఈ తరహా పాటలు మరిన్ని చిత్రాల్లో రావాలనిపించేలా ఉంది- కల్యాణి కోడూరి సంగీతం. ఇక చిత్రీకరణలో పాటలన్నీ అద్భుతం. కొంత కెమెరా పనితనమైతే, కొంత కోరియోగ్రాఫర్ గొప్పతనం. ముఖ్యంగా ఇంతకంటే వేరే పాటలో శౌర్య అభినయం, కదలికలు- సహజానికి దగ్గిరగా, ఇతరులు కూడా అనుకరించాలిసుమా అనిపించేలా ఉన్నాయి. రివ్యూ 2

ఈ చిత్రానికి  కథ, మాటలు, దర్శకత్వం  అవసరాల.  ఒక పాత ఫ్రెంచ్ నాటకం ప్రేరణ ఐనా- కథలో తెలుగుతనం నింపడంలో కృతకృత్యులయ్యారు రచయిత. ఐతే ఈ కథలో ఓ ముగ్గురి స్వంత గొడవతప్ప పెద్దగా సందేశం ఏమీ లేదు. తెలుగులో ఇంతకంటే మంచి కథలు ఎన్నో ఉన్నాయి. మన యువ దర్శకులు తెలుగు రచనల్ని చదవకపోవడం దురదృష్టం. ఆమేరకు కథ నిరుత్సాహపర్చిందనే చెప్పాలి.

మాటల విషయానికొస్తే- ఈ చిత్రానికి విలువ పెంచిన అంశాల్లో మాటలు కూడా ఉన్నాయి. వాటిలో బలముంది, లోతుంది, అర్థముంది, హాస్యముంది. అవసరాలకు మాటల రచయితగా గొప్ప భవిష్యత్తుంది. మచ్చుకి- ‘నీ మొహానికి అందం అంటుకుంది. అందం తుడుచుకుంటే పోదు కదూ’. 

దర్శకత్వపరంగా చూస్తే- అవసరాల ప్రతిభకు ఈ చిత్రం మచ్చుతునక ఔతుంది. ఒక మామూలు కథని ఇంత చక్కగా చెప్పడం అభినందనీయం. విలన్ పాత్రని హుందాగా తీర్చి దిద్ది దానికి నటుడిగా తనే ప్రాణం పొయ్యడం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఐతే- చివర్లో విలన్ హీరోని బంధించడం- విలన్ పాత్రకూ, ఈ చిత్ర కథనానికీ కూడా- మచ్చ తెచ్చింది. మిగతా కథలోలాగే ఇక్కడా కొత్తదనంతో కూడిన ఉపాయమొకటి ఆలోచించాల్సింది. ఐతే చిత్రం ముగింపు మళ్లీ బాగుంది.

కొన్ని సన్నివేశాలు- ఆధునిక సాధనాలతో పాత పడోశన్ చిత్రాన్ని గుర్తు చేస్తాయి

ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది- శౌర్య, రాశిల ప్రేమ కథ. ఆధునిక యువతీ యువకుల ప్రేమ సన్నివేశాల్ని- అత్యంత సహజంగా, మధురంగా, సున్నితంగా, మనోహరంగా, సభ్యంగా, సంస్కారయుతంగా రూపొందించి ప్రేక్షక జన మనోరంజకంగా ప్రదర్శించవచ్చునని అవసరాల నిరూపించారు ఈ చిత్రంలో. అందుకు దర్శకత్వ ప్రతిభతో పాటు- కెమెరా పనితనం, నటీనటుల ప్రతిభ కూడా కలిసొచ్చాయి.

ఈ తరహా చిత్రాలకు గతంలో హృషీకేశ్ ముఖర్జీ, బాసు ఛటర్జీ ఒరవడి పెట్టారు. అవసరాల ఈ చిత్రంలో ఎక్కువగా బాసునీ, తక్కువగా హృషీకేశ్‍నీ స్ఫురింపజేశాడు. ఇద్దర్నీ 50-50గా స్ఫురింపజేస్తూ ఇలాగే తనదైన ముద్రను కొనసాగించాలని మా కోరిక.

ఈ చిత్రం చూస్తున్నంతసేపూ హాల్లో సమయం తెలియలేదు. మా అభిప్రాయంలో ఈ చిత్రం మనం చిత్రం కంటే ఎక్కువ బాగుంది. కానీ సగటున ప్రేక్షకులకిది ఎంతలా నచ్చిందీ అన్నదాన్నిబట్టి తెలుగునాట ఈ తరహా చిత్రాల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.

నిస్సందేహంగా- అవసరాల మంచి భవిష్యత్తున్న గొప్ప దర్శకుడు. ఒక తెలుగు కథని చదివి- చలనచిత్రంగా మలిచే స్థాయికి ఆ గొప్పతనం ఎదగాలని ఆశిద్దాం.   

Leave a Reply

%d bloggers like this: