జూన్ 29, 2014

మనం- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:05 సా. by వసుంధర

manam

తెలుగువారికి పురాణ పురుషులకంటె, జాతికి దిశానిర్దేశం కావించిన మహనీయులకంటె, వివిధ రంగాల ప్రతిభాశాలురకంటె- మానసికోల్లాసాన్నీ, వినోదాన్నీ ఇచ్చిన, ఇస్తున్న కొందరు   సినీ హీరోలంటే వీరాభిమానం. ఆ సినీనటులు తాము అందించిన వినోదానికి అర్హతకు మించిన ప్రతిఫలం పొంది, సినీరంగంలోనూ బయటా కూడా తమ సామ్రాజ్యాలను నిర్మించుకుని వాటిని తమ వారసులకు అప్పగించి- కళాసేవకులుగా కీర్తించబడతారు.

అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు, బాటసారి, పూజాఫలము, సీతారామయ్యగారి మనవరాలు వంటి చిత్రాలలో నభూతో నభవిష్యతి అనిపించేలా నటించారు. పలు చిత్రాలలో- కథానాయకుడంటే ఇలా ఉండాలి అనిపించేలా నటించారు.  పాటలకు స్టెప్సు సృజించి- అందులో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. నటుడిగా ఆయనకున్న కోట్లాది అభిమానుల్లో మేమూ ఉన్నాం.

అయితే ఆంగికంలో, వాచకంలో, నటనలో తన వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన పెద్దగా కృషి చేసినట్లు కనబడదు. ఆయన శిక్షణ కేంద్రాలు నడపలేదు సరికదా- తన పిల్లలకే శిక్షణ ఇవ్వలేదు. అమెరికాలో చదువుతున్న నాగార్జునని ఇండియాకి నటుడిగా రప్పించినప్పుడు- అతడికి తెలుగు భాష వ్రాయడం చదవడం రాదు. ఉచ్చారణలో కూడా బాగా దోషాలున్నాయి. నాగేశ్వరరావుకి వారసత్వంగా కాకపోయినా, వారసుడిగా నాగార్జునని ప్రేక్షకులు అభిమానించారు. ఆ అభిమానాన్ని ఆసరాగా చేసుకున్న నాగార్జున క్రమంగా- శివ, గీతాంజలి, హలో బ్రదర్, మన్మధుడు, అన్నమయ్య వంటి చిత్రాల్లో అనుపమాన నటన ప్రదర్శించి- నటుడిగా అభిమానులు కానివారిని కూడా ఆకట్టుకున్నారు.

నాగార్జున తనయుడు, అక్కినేని మనుమడు అన్న ఒకే ఒక్క కారణంగా తెరకెక్కిన నాగచైతన్య- భావప్రకటనలో, వాచకంలో ఏమాత్రం వారసత్వపు ఛాయలు కానీ ప్రతిభను కానీ సంతరించుకోలేదు. ఏ మాయ చేశావే, 100% లవ్ చిత్రాలు అనూహ్య విజయాన్ని సాధించినా- అభిమానులు తప్ప తక్కినవారు అతణ్ణి నటుడిగా గుర్తించలేదు.

ఈ మూడు తరాల నటుల్నీ కలిపి ఒక సినిమా చెయ్యాలనుకున్నప్పుడు- అది ఆయా నటుల అభిమానులకు పండగ కావచ్చు కానీ- తెలుగువారికి పండుగ ఎలా ఔతుంది? అదేదో దిలీప్-అమితాబ్-షారూక్ ఖాన్ కలయికగా సినీ అభిమానుల్ని అనుకోమంటే అనుకోలేరు కదా! కానీ మహానటుడు అక్కినేనికి అది చివరి చిత్రం అయితే మాత్రం- సినీరంగాన్ని అభిమానించేవారందరూ ఆ చిత్రాన్ని ఆయనకు నివాళిగా భావించడం తథ్యం.

అలాంటి నివాళిగా ఈ ఏడు మే 23న విడుదలయింది- అన్నపూర్ణా స్టుడియోస్ నిర్మించిన మనం చిత్రం.

కథ విషయానికొస్తే- రాధామోహన్ (నాగచైతన్య), కృష్ణవేణి (సమంత) పెద్దల దీవెనలతో దంపతులై- ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వారి తనయుడు బిట్టూ అనే ముద్దుపేరు గల నాగేశ్వరరావు (నాగార్జున) ఆరేళ్లవాడు అయ్యేసరికి ఆ దంపతులు అపార్థాలతో కలహించుకుని బిట్టూకి విచారం కలిగిస్తుండేవారు. వారి గొడవ చివికి చివికి గాలివానయింది. విడాకులు తీసుకుందామనుకునేదాకా వచ్చేక- కారు ప్రమాదంలో ఇద్దరూ చనిపోయి కొడుకుని ఒంటరిని చేశారు. బిట్టూ (నాగార్జున) పెద్దవాడై గొప్ప పారిశ్రామికవేత్త అయ్యాడు.  అప్పుడతడికి అనుకోకుండా నాగార్జున (నాగచైతన్య), ప్రియ (సమంత) అనే పేర్లతో పునర్జన్మనెత్తిన తన తలిదండ్రులు కనిపించారు.  వాళ్లతో పరిచయం పెంచుకుని ఈ జన్మలోనూ వాళ్లని దంపతుల్ని చెయ్యాలన్న బిట్టూ ప్రయత్నాలు మొదటి సగం కథ. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో చావుబ్రతుకుల్లో ఉన్న చైతన్య (అక్కినేని నాగేశ్వరరావు) అనే 90 ఏళ్ల వృద్ధుణ్ణి రక్షించిన అంజలి (స్రియా శ్రణ్) అనే డాక్టరు బిట్టూ (నాగార్జున)కి పరిచయమౌతుంది. చైతన్యకి స్పృహ వచ్చేక- బిట్టూ, అంజలిలని పూర్వజన్మలో సీతారాముడు (నాగార్జున), రామలక్ష్మి (స్రియా శరణ్) అనబడే తన తలిదండ్రులుగా గుర్తించడంతో విశ్రాంతి.

సినిమా రెండవ భాగం సీతారాముడు (నాగార్జున), రామలక్ష్మి (స్రియాశరణ్) ల ప్రేమకథతో మొదలై- నాగార్జున (నాగచైతన్య), ప్రియ (సమంత)ల మధ్య ప్రేమాంకురానికి దారి తీసి- చివర్లో మొత్తం అంతా చనిపోయే పరిస్థితి ఏర్పడితే చైతన్య (అక్కినేని నాగేశ్వరరావు) వారందర్నీ రక్షించడంతో ముగుస్తుంది. అంతా చైతన్యని పొగుడుతుంటే- తనకి సహకరించిన ఓ యువకుడికి ఆ పొగడ్తలు చెందాలని చైతన్య అంటాడు. ఆ యువకుడు అక్కినేని నట కుటుంబానికి మరో వారసుడు అఖిల్ కావడం ఈ కథకి ముగింపు. విడియో రివ్యూ

నిజానికిది కథగా కూడా గొప్పగా రాణించగల అద్భుతమైన కథ. దీన్ని సినీకరించడంలో చాలా పేలవంగా తయారయింది. ఇందులో కథానాయకులకి అనువైన సన్నివేశాలే తప్ప భావోద్వేగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. ఉదాహరణకి నాగార్జున- సమంతని తన తల్లిగా భావించి సేవలు చేసే దృశ్యం. మేము వ్రాసిన అమ్మ అనే నవలలో ఒక యువకుడు తనకంటే చిన్నదైన ఓ యువతిని తల్లిగా భావించి వెంటబడతాడు. ఆమె కూడా అతణ్ణి కొడుకులా లాలిస్తుంది. కానీ సమాజంలో అది అపోహలకి దారి తీసే సందర్భాలు ఏర్పడతాయి. ఈ కథలో సమంత, నాగార్జునలకు అటువంటి ఇబ్బందులేమీ రావు. అంతా కూడా అది సహజంగానే తీసుకుంటారు. అలాగే ఈ కథలో నాగార్జున- నాగచైతన్య, సమంతలని కలపడానికి చేసే ప్రయత్నాలలో, వాటి ఫలితాలలో- హాస్యానికే తప్ప మనస్తత్వానికి ప్రాధాన్యం లభించలేదు. ఉదాహరణకి- ఈ కథకి ప్రేరణ అనిపించే back to future  చిత్రంలో తలిదండ్రుల్ని కలపాలని కొడుకు ప్రయత్నిస్తుంటే- తల్లి భర్తకంటే చలాకీగా ఉన్న కొడుకునే ఎక్కువ ఇష్టపడుతూంటుంది. మన సంప్రదాయంలో- పునర్జన్మలో కూడా అలాంటివి ఇబ్బంది అనుకుంటే- ఆమె మరొకర్ని ఇష్టపడుతుంటే- బాసూ చటర్జీ తీసిన చోటీసీబాత్ తరహాలో నాగార్జున నాగచైతన్యకి శిక్షణ ఇచ్చినట్లు ఏదైనా కొత్త ప్లాటు చూపితే బాగుండేది. కథ, కథనంలో ఇమడకపోవడంవల్లనేమో- రెండవ భాగం చాలా పేలవంగా ఇంకా చెప్పాలంటే విసుగ్గా అనిపించింది. రివ్యూ 1    రివ్యూ 2

నటీనటుల విషయానికొస్తే- ఇది పూర్తిగా నాగార్జున చిత్రం. ఒక యువ పారిశ్రామికవేత్తగా అతడు చాలా హుందాగా ఉన్నాడు. తలిదండ్రుల్ని పిచ్చిగా అభిమా నించే పాత్రలో సహజంగా అమాయకంగా అనిపించాడు. ఒక ప్రేమికుడి పాత్రలో ఉదాత్తంగా ఉన్నాడు. నాగార్జున నటజీవితంలో ఒక మైలురాయి అనలేము కానీ- ఈ చిత్రానికి అతడు కొంత ప్రాణం పోశాడని చెప్పవచ్చు. నాగచైతన్య (నటన గురించి చెప్పలేం కానీ) ఆరేళ్ల బిడ్డకి తండ్రిగానూ, బాధ్యతారహితుడైన విద్యార్థిగానూ కూడా సహజంగా అనిపించాడు. ఒక తల్లిగా, ప్రియురాలిగా- సమంత తన పాత్రలో ఇమిడిపోయింది. స్రియా- అటు పల్లెటూరి అమ్మాయి పాత్రలోనూ, ఇటు డాక్టరుగానూ కూడా అక్కడక్కడ మాత్రమే చూడ్డానికి బాగుంది.  బాగున్నప్పుడు చాలా బాగుంది. బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణలవి- వారి ప్రతిభను ‘వాడుకునేటంత’ స్థాయి పాత్రలు కావు. వారి పరిస్థితే అలా ఉన్నప్పుడు- సప్తగిరివంటి కొత్తవారు- పోసాని వంటి పాతవారు కూడా- ఉన్నామనిపించారంతే. అమితాబ్ బచన్ పాత్ర చప్పట్లు కొట్టేటంతలో అయిపోతుంది. ఇక అమల, రాశి ఖన్నా, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి వగైరాల పాత్రలు ఆ మాత్రం కూడా ఉండవు.

ఇది అక్కినేనికి నటుడిగా చివరి చిత్రం. పాత్ర మాత్రం నటుడిగా చిరస్మరణీయం కాదు. ఆ మహానటుడి అనారోగ్యం ముఖంలో ప్రతిఫలించి కళ కాస్త తప్పించిన విషయం- ఆయనపై అభిమానాన్ని పక్కన పెడితే కానీ తెలియదు. నటన విషయమెలా ఉన్నా- ఆయన్ని చూస్తున్నంతసేపూ పాత చిత్రాలు గుర్తొచ్చి- ఒక ధ్రువతార రాలిపోయిందే అన్న విషయం స్ఫురించి- కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

ఈ చిత్రంలో దృశ్యాలు కనుల పండువగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ అద్భుతం. వినోద్‍కి అభినందనలు.

ఈ చిత్రానికి ప్రాణం మాటలు. హర్షవర్ధన్‍కి ప్రత్యేకంగా అభినందనలు.

ఈ చిత్ర సంగీతం విషయానికి వస్తే- అనూప్ రూబెన్స్ ప్రతిభకి అద్దం పట్టే పాటలున్నాయిందులో. చిత్ర విజయంలో వాటి పాత్ర చెప్పుకోతగ్గది. నేపథ్య సంగీతం కూడా గొప్పగా ఉంది. ఐతే ఈ చిత్రంలో పాటల గురించి ఒక చిన్న అభ్యంతరముంది. అది దర్శకుడిపరంగా విశ్లేషిద్దాం.

ఈ చిత్రానికి  కథ, దర్శకత్వం  విక్రమ్ కుమార్.  ఒక పాత ఆంగ్ల చిత్రం ప్రేరణ ఐనా- తెలుగునాట, తెలుగుదనంతో నిండిన కొత్త  కథ ఇది. మూడు తరాల నటులతో చిత్రం తీయాలనుకున్నప్పుడు- ఇంతకంటే సందర్భోచితమైన కొత్త కథ ఉండదనిపిస్తుంది. విక్రమ్‍కి అభినందనలు.

ఒక సామాన్యమైన ప్రేమకథను తెరపై ఎంత గొప్పగా చెప్పొచ్చునన్నది- విక్రమ్‍కి ఎంత బాగా తెలుసో- ఇష్క్ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ అసామాన్య ప్రేమకథ తెరపై అంత గొప్పగా అనిపించలేదంటే- పెద్ద నటులు, పెద్ద బ్యానర్లతో ఉండే ఇబ్బంది తెలిసినవారు విక్రమ్‍ని తప్పు పట్టరు. చిత్రం అఖండ విజయాన్ని సాధిస్తోంది కాబట్టి- ఆయా నటుల్నీ, బ్యానర్నీ కూడా తప్పు పట్టలేం. అయితే- ఇది అక్కినేనివంటి అసామాన్య నటుడి చివరి చిత్రం కాబట్టి దీన్ని ఓ కళాఖండంగా తీసి ఉండాల్సిందని అక్కినేని అసలైన అభిమానులు కోరుకోవడం సహజం. ఆ దృష్ట్యా చూస్తే-

ఇందులో నాగార్జునగా నటించిన నాగచైతన్య పాత్ర యువతకి ఏ విధంగానూ ఆదర్శం కాదు. అబద్ధాలు, క్లాసులు ఎగ్గొట్టడాలు, తాగడాలు, తాగి డ్రైవింగ్ చెయ్యడాలు, పట్టుబడితే పోలీసుల్ని తిట్టుకోవడం తప్ప తన తప్పుందని గ్రహించక పోవడాలు. ఈ లక్షణాల్ని హాస్యంగా చూపారే తప్ప- ఎక్కడా నిరసించడం జరుగలేదు. ఈ పాత్ర ఇచ్చే సందేశం ఏమిటి?

ఒక తాగుబోతు (నాగచైతన్య) కోసం హోం మినిస్టర్ని బెదిరించి, పోలీసు అధికారిని చిన్నబుచ్చిన పారిశ్రామికవేత్త (నాగార్జున) ఎవరికి ఆదర్శం? అతడికి ఉత్తమ పారిశ్రామికవేత్తగా రాష్ట్రపతినుంచి అవార్డు కూడా వచ్చింది. అతడు గత జన్మలో తన తల్లి అయిన సమంతకి హాస్టల్లో సదుపాయాలు సరిగా లేవని- ఆ హాస్టల్ని ఫైవ్ స్టార్ హొటలు స్థాయికి పెంచిన సీనొకటి ఉంది ఈ చిత్రంలో. ఒక పారిశ్రామికవేత్తగా హాస్టల్సుని అన్నింటినీ ఆ స్థాయికి తీసుకురావాలన్న స్పందన కూడా ఒక్క డైలాగులో ఇమడ్చకపోతే- అది పూర్తిగా స్వార్థపూరిత పాత్రే ఔతుంది.

ఇక పాటల విషయానికి వస్తే- కథ పరంగా ఇది మూడు తరాల చిత్రం. 1920, 1980, 2014. ఈ మూడు తరాలకూ- ఆయా తరాలకు అనుగుణంగా పాటలు పెడితే ఎంత బాగుండేది? ముఖ్యంగా 1920లకు చెందిన చిన్ని చిన్ని ఆశలు పాట ఎంత గొప్పగా ఉన్నా- అక్కడ ఒక అచ్చ తెలుగు జానపదగేయం ఉంటే ఎంత బాగుండేది? ఆదిత్య-369లో జాణవులే పాటని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, ఆదరిస్తున్నారో- అందరికీ తెలిసినదే!

ఇంకా- ఈ చిత్రంలో గోడ గడియారం క్రింద పడడం, థెర్మామీటర్ పగలడం వంటి కొన్ని అపశకునాలు- ప్రాణప్రమాదానికి దారితీసే సన్నివేశాలు ఉన్నాయి. అవి అంత grippingగా రాలేదు. పూర్వజన్మలో నాగచైతన్యని అపార్థం చేసుకోవడంలో సమంత మూర్ఖత్వమే కారణం అనిపించగా- ప్రస్తుత జన్మలో నాగచైతన్య సమంతకు సారీ చెప్పడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఈ విషయాలు పక్కన పెడితే- ఈ చిత్రాన్ని ఒక సభ్య, మనోహర కావ్యంలా ప్రేక్షకుల ముందుంచడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడని చెప్పొచ్చు. ‘లేడీస్ ఫస్ట్’ అన్న శృంగారపు జోక్ కూడా- ముసిముసిగా నవ్వుకునేలా ఉంది. ఐలవ్యూ, ఇలాఇవ్వు- పర్యాయపదాలుగా వాడడం చాలా బాగుంది. పియో పియో రే అనే పాటలో అక్కినేని ప్రేమ్ నగర్ డోంట్ కేర్ పాట చూపినప్పుడు- ఈల వెయ్యడం వచ్చిన ప్రతివారికీ ఈల వెయ్యాలనే అనిపిస్తుంది. దర్శకుడికి అభినందనలు.

మేమీ చిత్రాన్ని ఇటీవలే చూశాం. మాకైతే మొదటి సగం చాలావరకూ సరదాగా, రెండో సగం చాలావరకూ విసుగ్గా అనిపించింది కానీ- చిత్రాన్ని జనం విరగబడి చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఇష్క్ నేపథ్యంలో చూస్తే ఈ దర్సకుడికి ఉజ్వల భవిష్యత్తు ఉందనిపిస్తుంది.

ఇది అన్నపూర్ణా స్టుడియోస్ కోసం- అక్కినేని కుటుంబం- అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులతో- నిర్మించిన చిత్రం. దీనికి మనం కంటే మేము అనే పేరు ఎక్కువ బాగుంటుందన్న- ఓ ఇంజనీరింగు కాలేజి విద్యార్థి అభిప్రాయంతో మేమూ ఏకీభవిస్తున్నాం.

2 వ్యాఖ్యలు »

  1. ఈ చిత్రసమీక్ష ఆ సినిమా చూసినంత ఓపికతో చదివి, చివరి రెండు వాక్యాలతోనే ఏకీభవిస్తున్నాను. శేషకీర్తి నాగేశ్వర రావు గారు ఈ సినిమా చూచివుంటే ఒక మంచి చిత్రములో నటించటానికి బ్రతికి ఉండేవారేమో!

  2. ఆకునూరి మురళీకృష్ణ said,

    ఈ చిత్రం చూసినప్పుడు నాక్కూడా ఏదో లోపం వుందని కొద్దిగా అసంతృప్తిగా అనిపించింది. అది లోపం కాదనీ, ఇంకా బాగా తీయగలిగే అవకాశాన్ని దర్శకుడు మిస్ చేసుకున్నాడన్న అసంతృప్తితో అలా అనిపించిందన్న విషయం మీ లోతైన విశ్లేషణ చదివాక అర్ధమైంది. ఒక సినిమా సినిమా వచ్చినప్పుడు- దాని మీద మీ స్పందన కోసం ఎదురు చూసేలా వుంటున్నాయి మీ సమీక్షలు. అభినందనలు ‘వసుంధర’ కి!!


Leave a Reply

%d bloggers like this: