జూలై 10, 2014

ఆటోనగర్ సూర్య- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:08 సా. by వసుంధర

autonagar surya

ఈ చిత్రం విడుదలకు ముందొకటి- చూసింతర్వాత ఒకటి విశేషాలు గుర్తొచ్చాయి.

ముందు అర్థరాత్రి సినిమా. ఆ చిత్రం ఎప్పుడో తయారైనా ఇదిగో అదిగో అంటూ జాప్యమై చివరికి 1969లో విడుదలైంది. సరిగ్గా ఆరోజునే విశాఖపట్నంలో భూమి కంపించడం జరిగితే- ఆందుకా సినిమా విడుదలే కారణమని జోక్ చేసుకునేవాళ్లం. ఆటోనగర్ సూర్య చిత్రం కూడా కొద్ది నెలలుగా ఇదిగో అదిగో అంటూ చివరికి ఈ జూన్ 27న విడుదలైంది.

చిత్రం చూసింతర్వాతి విశేషం- సమీక్ష చివర్లో చెప్పుకుందాం.

వెన్నెల, ప్రస్థానం సినిమాలు తీసి దర్శకత్వంలో తనకంటూ ఓ ఇమేజ్ నిర్మించుకున్న దేవ కట్టా చిత్రమిది.

కథేమిటంటే– ఒక రైలు ప్రయాణంలో సూర్య తలిదండ్రుల్ని చంపేశాడు ఓ దుర్మార్గుడు. తన మావయ్య (సాయికుమార్) కూడా తనను ఆదరించకపోవడంతో విజయవాడ ఆటోనగర్ లోని ఓ మెకానిక్ షెడ్లో పని కుదురుతాడు. తనకు ఆశ్రయమిచ్చిన వ్యక్తిని ఓ వడ్డీ వ్యాపారి చావబాదుతుంటే అతణ్ని చంపి జైలుకెళ్తాడు. ఐదేళ్ల జైల్లో ఉండి- ఇంజనీరింగ్ డిగ్రీ, ఓ డీసెల్ కారు డిజైన్‍తో బయటికొచ్చాడు. అప్పటికి ఏరియాను గుప్పిట్లో ఉంచుకున్న రౌడీలు, రాజకీయ శక్తులతో సూర్య జరిపిన పోరాటం ఈ కథాంశం. మధ్యలో మామయ్య కూతురు శిరీషతో (సమంత) ప్రేమ, ఆ విషయమై మామయ్యతో పోరాటం కూడా ఉంటుంది. ఈ రెండు పోరాటాల్లోనూ ఇరుపక్షాల ఎత్తులు, పై ఎత్తులు కథను నడిపిస్తాయి.

కథ బాగుంది. కథకోసం ఎన్నుకున్న సన్నివేశాలూ బాగున్నాయి. ఏ సన్నివేశానికా సన్నివేశం ఎంత బాగుందో- వాటిని కలిపి చూస్తే ఎక్కడో ఏదో లోపం ఉందనిపించింది. వంటకంలో ఉప్పో, కారమో, పులుపో- ఏదో తక్కువైనట్లు తోస్తుంది.

ఈ చిత్రానికి బలం డైలాగ్స్. వింటుంటే రసానుభూతి కలుగుతుంది. తల్చుకుంటే- ఎంత బాగున్నాయీ అనిపిస్తుంది. పాటలు సంగీతపరంగా లయబద్ధం. భాషపరంగా తెలుగు. కానీ నేటి యువత అభిరుచి పేరిట మనపై రుద్దబడి పూర్తిగా తెలుగుతనానికి దూరమైన బాణీలు. వినడానికి తాత్కాలికంగా బాగున్నాయి. చిత్రీకరణ చాలా బాగుంది.

నటీనటుల విషయానికొస్తే- ఇంచుమించు ప్రతిఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. జైలరుగా కొద్ది నిముషాలు కనిపించిన తనికెళ్ల భరణి కూడా- ఎంతో హుందాగా ఉండి గుర్తుండిపోతాడు. సగం విలనీ, సగం కామెడీతో- పాత్రలు పెద్దవైనా అంతగా గుర్తుండని అజయ్ కూడా ఈ చిత్రంలో తన పాత్రలో జీవించాడు. మెతక గుణంతో సాధారణ మధ్య్తతరగతి వ్యక్తిగా సాయికుమార్ పాత్రోచితంగా నటించి తన రేంజ్‍ ఋజువు చేసుకున్నాడు. బ్రహ్మానందం పాత్రోచితంగా నటించినా- అతడికున్న ఇమేజ్‍కి తగినంత అవకాశం లేక కొంత నిరుత్సాహం కలుగుతుంది. ఇతర చిన్న పాత్రలకు కూడా- జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, ఆషిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, వేణుమాధవ్ వంటి పేరున్న నటుల్ని ఎన్నుకున్న ఈ చిత్రంలో- ఒక్క వేణుమాధవ్ తప్ప తక్కిన నటులు తమ పాత్రలకు అన్యాయం చెయ్యలేదనే చెప్పాలి. ఈ చిత్రం చూస్తే వేణుమాధవ్‍కి భవిష్యత్తు ఉందనిపించదు.

హీరో హీరోయిన్ల విషయానికొస్తే- సమంత అందంగా కనిపించింది. సహజంగా, హుషారుగా తనదైన ప్రత్యేకతను నిరూపించుకుంది. సూర్యగా నాగచైతన్య నటన ఈ చిత్రానికి హైలైట్. డైలాగ్స్ చాలా బాగా చెప్పాడు. పాటల్లో కూడా ఎంతో హుందాగా ఉన్నాడు. తన పరిమితుల మేరకే స్టెప్స్ వేశాడు. అతడీ విధంగా ఈ చిత్రాన్ని పూర్తిగా తన భుజాలపై మోయగడని ఎవరూ ఊహించరు. ఈ చిత్రం నాగచైతన్య నట జీవితంలో చెప్పుకోతగ్గ మలుపు కాగలదని ఆశించొచ్చు.

ఇప్పుడు మాకు సంబంధించిన రెండో విశేషం ముచ్చటిద్దాం.

1990లో అప్పటి ప్రముఖ దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణ, ఆర్టిస్ట్ చంద్ర సహదర్శకుడిగా కుమార్ నిర్మాతగా ఒక కళాత్మక చిత్రాన్ని తలపెట్టారు. కథాచర్చకు మమ్మల్ని పిలుద్దామనుకుని, మేము రామని తెలిసి భువనేశ్వర్లో మా ఇంటికొచ్చి కొన్నాళ్లున్నారు. ఒక మధ్యతరగతి మనిషి తాగుడుకు బలై పతనం కావడమూ, అతడి భార్య పడిన అష్టకష్టాలూ పడడమూ కథాంశం. చివరికి భార్య భర్తని కత్తిపీటతో చంపెయ్యడం కథకి ముగింపు. ఈ అంశానికి మేము కల్పించిన దృశ్యాలు నచ్చడంతో- దర్శకుడు వేజెళ్ల మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తి- ఆ చిత్రానికి సంభాషణలు వ్రాయమని బలవంతపెట్టారు. అలా మొదలైన ఆ కళాత్మక చిత్రం- క్రమక్రమంగా మార్పులకూ, చేర్పులకూ గురై చివరకు చౌకబారు వ్యాపార చిత్రంగా మారింది. మేమా చిత్రానికి మాతృదేవోభవ అన్న పేరు సూచించాం (అప్పటికింకా ఆ పేరుతో ఏ చిత్రమూ రాలేదు). ‘ఈ తల్లికాశిక్ష’ అన్న పేరుతో మొదలై ‘మౌనదీపం’గా మారి చివరికి కలికాలం ఆడదిగా ఇలా విడుదలై (మేమా చిత్రం చూడలేదు) అలా వెళ్లిపోయింది ఆ చిత్రానికి మేము తొలుత కూర్చిన కథ, చాలావరకూ సంభాషణలు మావద్ద ఉన్నాయి. లక్ష్యశుద్ధిలేని దర్శకుల చేతిలో ఒక చిత్రకథ ఎలా రూపాంతరాలు చెందుతుందో తెలుసుకుందుకు తగిన సమాచారం మావద్ద ఉంది.

ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- ఆటోనగర్ సూర్య చిత్రం చూసినప్పుడు- ఇది చక్కని చిత్రంగా ఆరంభమై- పూర్తయ్యేసరికి ఇలా రూపాంతరం చెందిందా అనిపిస్తుంది. దర్శకుడు దేవ- సద్దుబాటు ధోరణికి లోబడక- మున్ముందు తన సత్తాకు న్యాయం చేసే మరిన్ని చిత్రాలు తియ్యగలడని ఆశిద్దాం.

2 వ్యాఖ్యలు »

  1. ఆకునూరి మురళీకృష్ణ said,

    చిత్ర సమీక్ష, మీ అనుభవం చాలా బాగున్నాయి. బహుశా తెలుగు రచయితలు దర్శకుల దగ్గరకీ, తెలుగు దర్శకులు రచయితల జోలికీ రాకుండా, ఇలా రచయితలని సినిమా విశ్లేషణ (పోస్ట్ మార్టమ్) కి మాత్రమే పరిమితం చేయడానికి ఇదే కారణం అనుకుంటా. మెన్ ఆర్ ప్ర్హమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ లాగా రచయితల, దర్శకుల ఆలోచనా ధోరణిలో వున్న ఈ వ్యత్యాసమే ఇద్దరికీ సాపత్యం కుదరకుండా చేస్తోందేమో. మీరిచ్చిన లింకు ప్రకరం కలికాలం ఆడది సినిమా చూడాలని ప్రయత్నించాను. నాలుగు సీన్లకి మించి చూడలేకపోయాను. మీరిచ్చిన స్క్రిప్టు గురించి తెలుసుకోవాలని వుంది.

    • సినీరంగంలో పలు సినీ ప్రముఖులతో మాకెన్నో విచిత్రమూ, ఆసక్తికరమూ ఐనా అనుభవాలున్నాయి. ఆ రంగం మన రాజకీయాలంత తమాషాగానూ ఉంటుంది. వీలునుబట్టి సందర్భానుసారంగా అక్షరజాలంలో పంచుకోగలం.


Leave a Reply

%d bloggers like this: