Site icon వసుంధర అక్షరజాలం

అల్లుడు శీను- చిత్రసమీక్ష

alludu seenu

ఒడ్డూ పొడుగూతో చూడముచ్చటగా ఉండే ఓ శ్రీనివాస్‍కి సినిమా హీరో కావాలన్న కల ఉంటే, అతడి తండ్రి భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ అయితే- ఆ కల సాకారం కావడం తథ్యం. ఆ సాకారానికి వి.వి. వినాయక్ వంటి దర్శకుడి హస్తం పూనుకుంటే ఏం జరుగుతుంది? సమాధానం- ఇటీవల జూలై 25న విడుదలైన అల్లుడు శీను చిత్రం.

కథః నరసింహా మంచివాడు. అతడి కూతురు అంజలి. అచ్చం నరసింహాలాగే ఉండే అతడి తమ్ముడు అన్నని మోసం చేసి కొన్ని కోట్లు కాజేసి, అన్నపై ఆ నేరం పడేలా చేసి అతణ్ణి అపవాదుకు గురి చేశాడు. అంజలిని తనే పెంచుతూ ఆమెకు తండ్రిపట్ల విషం నూరిపోశాడు. నరసింహా శీను అనే ఓ అనాథ కుర్రవాణ్ణి చేరదీసి అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు. నరసింహా తమ్ముడు భాయి పేరుతో పట్నంలో మాఫియా నాయకుడిగా స్థిరపడ్డాడు. అంజలికి షార్జాలో ఉండే భానూభాయి కొడుకుతో సంబంధం నిశ్చయించాడు.  ఈలోగా శీనూ, నరసింహాలు అప్పులవాళ్ల బాధలు పడలేక డబ్బు సంపాదించడానికి చెన్నైకి బయల్దేరి పొరపాటున హైదరాబాదు చేరి అదే చెన్నై అనుకుని కొందరు మోసగాళ్ల వలలో పడతారు. మోసం తెలిసేక ఆ మోసగాళ్లను అనుచరులుగా మార్చుకున్నాడు. నరసింహా భాయిని పోలి ఉన్నాడని తెలుసుకుని- నరసింహాని భాయిలా తయారు చేశాడు. భాయి కొట్లలోనే తప్ప లక్షల్లో వ్యవహారాలు చూడడని తెలుసుకుంటాడు. భాయి అనుచరుడు  డింపుల్‍ని వాడుకుని- ఆ వ్యవహారాలు భాయి పేరిట తనే సెటిల్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. అంజలి కూడా ఓ సందర్భంలో శీనూని భానూభాయి కొడుకు అని పొరబడుతుంది. అతడికి పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షల్లో నెగ్గేక అతడితో ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ ఎలా ఫలిస్తుందన్నది మిగతా కథ.

నటీనటులుః పెద్ద హీరోల చిత్రంలా రూపొందిన ఈ చిత్రాన్ని పెద్ద హీరోల్లాగే పూర్తిగా తన భుజస్కంధాలపై మోశాడు హీరో శ్రీనివాస్. అతడికిది తొలి చిత్రం అనిపించదు. నృత్యాలు అద్భుతంగా, అల్లు అర్జున్‍ని కూడా మరిపించేలా చెశాడు. మనిషి ఎత్తు, ఆకారం కూడా కమర్షియల్ హీరో పాత్రకి చక్కగా సరిపోయింది. నటనలో పరిణతి అవసరం అనిపించినా తొలి చిత్రానికి ఓకే.

హీరోయిన్ సమంత తన పాత్రను అవలీలగా పోషించింది. అన్ని కోణాల్లోనూ కాకపోయినా కొన్ని కోణాల్లో ముఖం చాలా అందంగా కనిపించింది. ఏ కోణంలోనైనా అందంగా కనిపించాలనేమో- ఆమె ఈ చిత్రంలో తన శరీరాన్ని మితిమీరి ప్రదర్శించింది. ఈ చిత్రానికి ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆమె కూడా ఓ కారణం అనుకోవచ్చు.  

విభిన్నమైన నరసింహా, భాయి పాత్రల్ని ఒకే విధంగానూ, అన్ని చిత్రాలలోలాగే రొటీన్‍గానూ పోషించిన ఘనత ప్రకాష్‍రాజ్‍ది. ఈ పాత్రకి జగపతిబాబుని తీసుకుంటే ఇంకా బాగుండేదనిపించింది.

భాయి అనుచరుడు డింపుల్‍గా బ్రహ్మానందం పాత్ర, సన్నివేశాలు రొటీన్. కానీ జనం మెచ్చేలా ఉన్నాయంటే బ్రహ్మానందం మామూలోడు కాకపోవడమే కారణం. అయితే భానూభాయి అనుచరుడు పేడా ప్రసాద్‍గా రవిబాబు బ్రహ్మానందానికి దీటుగా నటించడం విశేషం.

మిగతా నటీనటుల్లో చాలావరకూ బాగా పేరున్నవారే. ఆ పాత్రల నిడివి- సినీరంగంలో వారికి ఉన్న పేరుకంటే బాగా తక్కువే. ఆయా పాత్రలు సహజంగా అనిపించడానికి వారే కారణం. తనికెళ్ల భరణి వంటి చక్కని నటుణ్ణి ఏమాత్రం ఉపయోగించుకోలేకపోవడం దర్శకుడి ఊహాలోపమే.

దంచినమ్మకు దక్కిందే బొక్కుడు అన్న సామెతగా పేరున్న తారలు చాలామంది నేడు ఐటమ్ డ్యాన్సులకు ఓకే చెబుతున్నారు. అలా ఈ చిత్రంలో తమన్నా ఒక ఐటమ్ డ్యాన్స్ చేసింది. అంగాంగ ప్రదర్శనకు ప్రాముఖ్యమిచ్చే ఆ పాటలో ముఖం చూడాలనుకునేవారికి మాత్రమే తమన్నా ముఖం కనబడుతుంది.

ఈ చిత్రం ఆసక్తికరంగా అనిపిస్తే కనుక అందుకు కారణాల్లో ఒకటి సంభాషణలు. అవి చాలా బాగున్నాయి. రెండో కారణం- కనుల విందు చేసే ఫొటోగ్రఫీ. మూడు- అద్భుతమైన కొరియోగ్రఫీ. నాలుగు- భారీ సెట్టింగులు, విదేశీ ప్రాంతాలు.

ఎక్కువగా విదేశీ ప్రాంతాల్లో చిత్రీకరించబడిన చిత్రం కాబట్టి ఆ తరహా సంగీతమే ఉండాలనుకున్నారేమో- దేవిశ్రీప్రసాద్ పాటల్లో లయ తప్ప మెలొడీ ఎక్కడా వినిపించలేదు. లయ కూడా హాలునించి బయటకు వచ్చేక గుర్తుండదు. ఆ పాటలు హిట్ ఐతే ఆ ఘనత హీరో వేసిన స్టెప్సుదీ, వేయించిన కోరియోగ్రాఫర్‍దీ.

రాకేష్ రోహన్ తన కుమారుడు హృతిక్ రోషన్‍ని హీరోగా పరిచయం చెయ్యడానికి తీసిన కహోనా ప్యార్‍హై చిత్రానికి కథ, సన్నివేశాలు- హీరో నటనకీ, నృత్యాలకీ కూడా చక్కని అవకాశం ఇచ్చాయి. ఈ చిత్ర దర్శకుడు కథకి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. అసందర్భంగా ఉన్న కథతో ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు హాల్లో కూర్చోబెట్టగలగడం దర్శకుడి ఘనత అనుకోవడానికి లేదు. మనకున్న మెజారిటీ ప్రేక్షకులు ఇలాంటి చిత్రాల్ని కొన్నాళ్లు చూడగలరు. చాన్నాళ్లు చూడాలని దర్సకుడు కూడా అనుకున్నట్లు తోచదు.

మేము ఈ చిత్రంకంటే రెండు వారాలు ముందు విడుదలైన దృశ్యం చిత్రం చూడడానికి వెళ్లి టికెట్లు దొరక్క ఈ చిత్రం చూశాం. అంటే ప్రేక్షకుల దృష్టిలో ఈ చిత్రం స్థానం దృశ్యం తరువాతనే అనుకోవాలి. మెజారిటీ ప్రేక్షకుల దృష్టిలో కూడా కథకి ఉన్నప్రాధాన్యం అది. మానసికంగా దృశ్యం చిత్రానికి సిద్ధపడిన మాకు ఈ చిత్రం కాస్త బోరు కొట్టిందనే చెప్పాలి.

ఇంగ్లీషు మాట్లాడ్డం రాని ఓ పల్లెటూరి యువకుడు పట్నంవచ్చి- చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు చెయ్యగలగడం, షార్జా వెళ్లి ఏమేమో చెయ్యగలగడం- తర్కానికి అందకపోయినా- 1960-70లలో షమ్మీకపూర్, దేవానంద్, మనోజ్‍కుమార్ వగైరాలతో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. కానీ కథలో ఏమాత్రం కొత్తదనం లేకుండా తీస్తే- వినాయక్ వంటివారు కనుమరుగైపోవడానికి ఎంతోకాలం పట్టదు. ఈ చిత్రంలోని దర్శకత్వ ప్రతిభతో చక్కని కథా కమర్షియల్ చిత్రాన్ని ఆయన తీయగలరని ఆశిద్దాం.  

Exit mobile version