Site icon వసుంధర అక్షరజాలం

బాపూ రమణీయం- భరణిలో

తెలుగు తెరపై తారలా మెరిసే తనికెళ్ల భరణిలో నటుడు, దర్శకుడు, కవి కలగలిసిన ఓ మహోన్నత వ్యక్తిత్వముంది. స్నేహం అనగానే తెలుగునాట బాపు, రమణలను మించి వేరెవరైనా గుర్తొస్తారా? ఆ గుర్తు చేసుకోవడంలో హాస్యం, ఆర్ద్రత కలిసిన అపురూప స్పందనను తనలో ఇముడ్చుకున్న భరణి మూత నేడు ఈనాడు దినపత్రికలో తెరచుకుంది. సంస్మరణకు దినాలను ప్రత్యేకించే సంప్రదాయానికి వ్యతిరేకులమే ఐనా- ఇతువంటి స్పందనలు మన ముందుకు వస్తాయంటే- ఆ సంప్రదాయానికీ వందనం. అంతర్జాలంలో లంకెకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. నేరుగా  ఈ క్రింద చదవండి.

స్వర్గం నుంచి…రాస్తున్నానోయ్‌!

సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్‌ అంటే మేం తీశాం.. ‘స్నేహం’ అనే సినిమా తీశాం.. అని ఛమకారు బాపు – రమణలు. స్నేహం ఓ దీపమైతే ఒకాయన ప్రమిద, మరొకరు తైలం. కలసి స్నేహ దీపం వెలిగించారు. చెలిమి గురించి చెప్పడానికి బాపు, రమణలకు మించిన వాళ్లెవరున్నారు. బాపు బొమ్మ గీస్తారు. రాత రమణకే సాధ్యం. ఆయనిప్పుడు లేరు మరి. అందుకే స్వర్గం నుంచి నేరుగా తన ఆప్తమిత్రుడు బాపుని ఉద్దేశించి ఓ ఉత్తరం రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకి తనికెళ్ల భరణి ఇలా అక్షర రూపం ఇచ్చారు.

బాపూ… నేనోయ్‌ వెంకటావ్రుని…దిక్కుమాలిన స్వర్గం నించి రాస్తున్నా… భూలోకంలో వాళ్లంతా

‘స్వర్గం… స్వర్గం’ అని వో గింజుకు పోతారేంటో నాకర్థం కాదు.

నా ధవళేశ్వరం కన్నా… నీ నరసాపురం కన్నా… మన మెడాస్రు కన్నా…

స్వొర్గం గొప్పేం ఉంది చెప్పూ… అందుకే మన రాముడన్నాడు

”జననీ… జన్మభూమిశ్చ అనీ…

కల్పవృక్షం, కామధేనువు, రంభా గింభా… అమృతం ఇవే గదా…

అమృతం అంటే గుర్తొచ్చింది…

మొన్న స్వర్గంలో పేద్ధ గొడవైంది. అమృతం అని జెప్పి అందరికీ తలో పురిషిడూ పోసారు. ఆవదంలా ఉంది వెధవది… సోడా లేదూ పాడూ లేదు! మాచింగ్‌కి ‘అమరమరాలు’… ‘స్వర్గం నరకం చిప్స్‌’ అని పెట్టారు, డోకొచ్చింది.

సూరేకాంతంగారు కూడా ఇంద్రుణ్ణి చెవి మెలేసీ… ‘భోయనం ఏర్పాట్లు ఏడ్చినట్టున్నాయ్‌, విశ్వామిత సృష్టి అన్జెప్పి కొన్ని ఐటమ్స్‌ ఎగ్గొట్టారు, వంకాయ కూర నీ పిండాకూళ్లా ఉందీ… మజ్జిగ పులుసు వైతరిణీ నదిలో నీళ్లలా ఉందీ’ అని కడిగి పారేసీ… కొంగు దోపి అద్భుతమైన పులిహోరా… చక్కర పొంగలీ చేసీ ఎవరూ చూడకుండా నాకు పొంగణాలూ… ఆవకాయ అన్నం ముద్దలూ కలిపి పెట్టింది.

యస్వీ రంగారావుగారు గూడా! ఘటోత్కచుడిలా గర్జించీ… పుచ్చుకోవడం మానేసీ… చిన్నబుచ్చుకునీ ‘ఠఠ్‌! ఈ స్వర్గం నరకంలా ఉందీ… మళ్లీ వెళ్లి మెడస్రులో పుడతా… సిజర్స్‌ తాగుతా… వాట్‌ 69 కొడతా… ఏనుగు చచ్చినా బతికినా లక్షే!’… అన్నారు.

సరే అక్కడి సంగతులేంటీ… ఆఁ అన్నట్లు నీకు పద్మశ్రీ ఇచ్చారని తెలిసీ… చాలా… చింతించా. ధర్మంగా నీకు భారత… ఇక్కడ తథాస్తు దేవతలుండాలి ఏరీ! వీళ్లూ ఈ మధ్య పైరవీలు మరిగారా ఏంటి!…

అయినా బాపూ… మనకి మోయలేనంత ప్రజాభిమానం ఉంది. అది చాల్లే.

ఏంటో.. ఈ మధ్య బాగా గుర్తొచ్చేస్తున్నావ్‌. హాయిగా పంటు విూద పాపికొండల ‘సాక్షి’గా పయ్రాణం చేస్తూ… ఎన్ని స్క్రిప్ట్‌లు రాసుకున్నామో! చితం చూశావూఁ నేను చాలా ‘స్లోమరిని’ నువ్వు ‘వీరతాడు స్పీడూ’. ఇద్దర్నీ కలిపాడు దొంగముండావాడు.

ముళ్లపూడి లక్ష్మీనారాయణా… సత్తిరాజు వెంకటవ్రణ

నువ్వెప్పుడూ అనేవాడివి మన కంపెనీలో సినిమాకన్నా ఆతిధ్యానికి ఎక్కువ ఖర్చు అవుతుందీ అని… పోన్లెద్దూ! మన సినిమాలు కొన్ని ఆడాయ్‌…. కొన్ని ఏడ్చాయ్‌… కానీ ‘చితక్రల్పన’లో భోజనం చేసిన వాళ్లెవరూ… జన్మలో మర్చిపోరు.. ఆ ఆశీస్సులు చాలవూ మనకి…

ఇదిగో రావుగోపాలరావుగారు… ‘అయ్యా నా నమస్కారాలు గూడా బాపూగారికి చెప్పండి’ అన్జెప్పారు. అలాగే అల్లువారు స్వొర్గంలో గూడా ‘ఆమ్యామ్యా’ తప్పట్లేదూ… అని ఫీలౌతున్నారు, ముక్కుపొడుం పీలుస్తూ… హచ్చీ! అని తుమ్మారు… బుద్ధిమంతులు అక్కినేనివారు…

‘చిరంజీవ… చిరంజీవ’ అన్నారు అన్నగారు నందమూరివారు… ఇవన్నీ దిక్కుమాలిన దేవరహస్యాలు…

చెప్పకూడదు. రాయొచ్చు!

కానీ అసలు రహస్యం తెలుగువాళ్లకి చెప్పనా?…. నువ్వు బొమ్మల మనిషివే కాదు!… రీడర్స్‌ డైజస్ట్‌ లోని జోక్స్‌ నువ్వు తెలుగులోకి అనువదిస్తే… నేనేవన్నాను?

‘నన్ను రచయితని చెయ్యడానికే… నువ్వు రాత మానేశావ్‌’.. నువ్వు నిజంగా రాయడం మొదలెట్టి ఉంటే చాలామంది తేలిపోయి ఉండేవారు… ఎందుకో కింది జన్మలో నువ్వు కలవడం… అంత కిత్రం జన్మలో నీ గురించి నేనెప్పుడు రాసినా ‘ఆత్మకథ’ రాసినట్టే ఉంటుంది.

నేను ముందు వచ్చేశానని నువ్వు బెంగెట్టుకున్నావని ఏవీఎస్‌, ధర్మవరం చెప్పారు!…

శ్రీరామరాజ్యం మధ్యలోనే నే వెళ్లిపోతే, ఆ రోజు లగాయత్తు రోజూ నన్ను తలచుకొని ఎవ్వరూ చూడకుండా కన్నీళ్లు పెట్టుకొంటున్నావ్‌. నే చూళ్లేదనుకొంటున్నావా ఏంటీ? నీ కన్నీళ్లన్నీ దోసెట్లో పట్టుకొని నా గుండెల్లో దాచుకొంటున్నా బాపూ…

నేను మాతం… స్వర్గంలో ఒక్కణ్ణీ బిక్కుబిక్కు మంటూ లేనా?

నువ్వేం కంగారుపడకు…

నేనే ఓ’బుడుగు’ గానో… సీగాన పెసూనాంబగానో… మళ్లీ పుట్టేస్తా!…

ఉణ్ణా!

నీ వెంకట్రావ్

(వెంకటరమణ)

బాపూరవణల వీరాభిమాని… తనికెళ్ల భరణి

Exit mobile version