ఆగస్ట్ 8, 2014

అలనాటి చిత్రం చక్రపాణి

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:32 సా. by వసుంధర

ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ భరణి నుంచి విడుదలైన హాస్యభరిత చిత్రం చక్రపాణి ఎన్నో విధాల విశిష్టమైనది. మరో ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ విజయా నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని- ప్రముఖ నటి భానుమతి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నట్లు కొందరంటారు. అయితే ఈ చిత్రంలో హాస్యం అరోగ్యకరం. పాత్రచిత్రణ వాస్తవం. ఈ కథలో ఎలాంటి ఆకర్షణ ఉన్నదంటే- హిందీలో 1963లో వచ్చిన ఏక్ దిల్ ఔర్ సౌ అఫ్సానే (రాజకపూర్, వహీదా), 1972లో వచ్చిన జోరూకా గులామ్ (రాజేష్ ఖన్నా, నందా) చిత్రాల కథలు చాలావరకూ వీటినే పోలి ఉంటుంది. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో ఆ చిత్ర విశేషాలు మరికొన్ని….

చక్రపాణి — ఫ్లాష్‌బ్యాక్ @ 50

ఆంధ్రభూమి 08/08/2014

 – సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి

ప్రముఖ నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్ వారు నిర్మించిన హాస్యరస ప్రధాన, కుటుంబ కథాచిత్రం ‘‘చక్రపాణి’’. 19.03.1954న విడుదలయింది.
‘‘చక్రపాణి’’ చిత్రానికి రచన రావూరి వెంకట సత్యన్నారాయణ, సంగీతం- భానుమతి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్- అద్దేపల్లి అచ్యుతరామశాస్ర్తీ, మేకప్- వెంకటేశ్వరరావు, ఛాయగ్రహణం- సెల్వరాజ్, నిర్మాత, దర్శకుడు, కూర్పు- పి.రామకృష్ణ.
‘‘రఘువంశ సుధాంబుది చంద్రమా’’ కీర్తన బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుండగా, టైటిల్స్ ప్రారంభం అయిన చక్రపాణి చిత్రంలో, చక్రపాణి (సి.యస్.ఆర్) పరమ లోభి. ఆయన కుమారుడు మరణించటంతో, కోడలు విశాలాక్షి (వెంకుమాంబ) మనవడు జగన్నాథం (చంద్రశేఖర్) ముగ్గురు మనవరాళ్ళు శాంత (టి.జి.కమలాదేవి), మాలతి (్భనుమతి) రేవతి, వీరి బాధ్యత వహిస్తూ, డబ్బు ఖర్చుచేయటానికి ఇష్టపడక, వారిని ఇబ్బందులు పెడుతుంటాడు. తాతగారి ప్రవర్తనకు, విసిగిపోయిన జగన్నాథం ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆ బెంగతో విశాలాక్షి మరణిస్తుంది. కట్నానికి లోభించి శాంతను, ఆనందరావు(రమణారెడ్డి) రెండవ పెళ్ళివాడు, అతనికిచ్చి వివాహం జరిపిస్తాడు. అదే ముహూర్తానికి ఒక మూగవానితో మాలతి పెళ్ళి జరిపించబోగా, ఆమె పెళ్ళి తప్పించుకుని రైలులో కలిసిన డా.శివరామకృష్ణయ్య, ఛాయదేవిల ఇంట మద్రాస్‌లో, ఆశ్రయం పొందుతుంది. ఛాయదేవి తమ్ముడు వెంకటాచలం (ఎ.ఎన్.ఆర్)తో, మాలతికి వివాహం జరుగుతుంది. చక్రపాణి కూడబెట్టిన లక్ష రూపాయలు, తనకు ముందుగా ఎవరు మునిమనవడిని అందిస్తారో వాళ్ళకి రాసిస్తానంటాడు. శాంతకు ఆడపిల్ల పుడుతుంది. ఈ సంగతి తెలిసిన మాలతి, తన ఇంట్లో అద్దెకు దిగిన మనోరమ (సూర్యకాంతం) సలహాతో, తనకు మగ పిల్లవాడు పుట్టినట్టు జాబు వ్రాస్తుంది. మునిమనవడిని చూడాలని, ఆస్తినప్పగించాలని, వస్తాడు చక్రపాణి. చలం పనిమీద వూరు వెళ్ళటంతో, మనోరమ తమ్ముడు సారధి (అమర్‌నాథ్)ను తన భర్తగా తాతగారికి పరిచయం చేస్తుంది మాలతి. ఇంతలో వూరి నుంచి వచ్చిన భర్తను వంట వానిగా పరిచయం చేసి, ఆస్తికోసం, సర్దుకోమని భర్తను బ్రతిమలాడుతుంది. వీరిమధ్య జరిగిన గందరగోళం, వాగ్వివాదాలలో చక్రపాణికి మాలతి తనకు చూపిన బిడ్డ ఆమె కొడుకు కాదని, తన మనవడు జగన్నాథం కొడుకని, చలం మాలతి భర్త అనే నిజాలు తెలుస్తాయి. ఆస్తిని మనవడికి అప్పగించబోగా, జగన్నాథం తమ నలుగురికి సమానంగా పంచమనటం దానికి చక్రపాణి అంగీకరించటం. అక్కడకు వచ్చిన రేవతికి, సారధికి పెళ్ళి నిశ్చయమవ్వటంతో కథ సుఖాంతం అవుతుంది.
పెళ్ళిళ్ళ పేరయ్య కైలాసంగా అల్లు రామలింగయ్య, చక్రపాణి గుమాస్తా కోటయ్యగా వంగర, ఇంటి నౌకరు ఏడుకొండలుగా మహంకాళి వెంకయ్య నటించారు.
ఈ చిత్రంలో వెంకటాచలంగా ఎ.ఎన్.ఆర్., భార్య మాలతి పట్ల ఆరాధన, అనుకూలతలతోపాటు భర్తననే కొద్దిపాటి ఆధిపత్యం కన్పరుస్తూ, సన్నివేశానుసారంగా చక్కని హాస్యాన్ని ముఖ కవళికల ద్వారా ఎంతో సహజంగా నటనలో చూపి ప్రేక్షకులకు, ఓ మంచి అనుభూతిని అందచేయటం విశేషం.
మాలతిగా భానుమతి, తన సహజసిద్ధమైన డామినేషన్‌తో తాతగారిని పండక్కి బట్టలు అడిగే సన్నివేశంనుంచి, ఆడపిల్లల పెళ్ళి గూర్చి, పొరుగింటి వారితో దెప్పిపొడుపులు, భర్తతో అనురాగాన్ని, ఆధిపత్యాన్ని సమపాళ్ళలో చూపుతూ తాతగారిని బోల్తాకొట్టిస్తూ, భర్తను అనునయిస్తూ, ధైర్య, విషాద, హాస్య స్వభావాలను, సందర్భానుసారంగా నటనలో ప్రదర్శిస్తూ మెప్పించారు.
అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనంటూనే, తెలియకుండా వివరాలు అందిస్తూ, ఏదయినా, ‘‘సగం చాలు’’అనే తెలివైన టీచర్ మనోరమగా సూర్యాకాంతం, ఆపద్ధర్మ భర్తగా నటిస్తు, కొంత ఓవరాక్షన్ చేయబోయి భంగపడిన వానిగా అమర్‌నాథ్ ‘‘్భర్తను నా ఖర్మకొద్ది దొరికారండి’’ అంటూ ఛాయాదేవి ఎంతో సహజంగా నటించారు.
భానుమతి సంగీతంతో శ్రోతలనలరించిన ఈ చిత్రగీతాలు దేవుని పటం ముందు భానుమతి, చెల్లెలుతో పాడే పాట ‘‘పక్కలా నిలబడి కొలిచేవు’’ త్యాగరాజు కీర్తన. మద్రాసులో ఛాయదేవి ఇంట భానుమతి తోటలో పాడే పాట ఆమె స్థితిని తెలియచేస్తూ సాగుతుంది. ‘‘నన్ను చూసి ఇంత జాలి ఏలనమ్మ మాలతి’’, ‘‘నల్లనివాడు పద్మనయనంబులవాడు’’ (పద్యం) అని శాంత (టి.జి.కమలాదేవి) పాడగా దానికి పేరడిగా మాలతిపై (పద్యం) పుల్లనివాడు, పాడు నయనమ్ములవాడు అని తాతగారి గురించి పాడినట్టు చిత్రీకరణ, శాంత, మాలతి పెళ్ళికూతుళ్ళుగా గౌరీపూజలో గీతం ‘‘మీనాక్షి మేముదం దేహిమే చకాంగి, రాజమాతంగి’’(్భనుమతి) తాతగారివద్ద భానుమతి పాడిన పద్యం ‘‘్ధరసింహసనమై నగంబు గొడుగై’’ భానుమతి, ఎ.ఎన్.ఆర్.లపై చిత్రీకరించిన తొలి రేయి గీతం ‘‘మెల్ల మెల్లగా, చల్ల చల్లగా రావే నిదురా హాయిగా’’ (భానుమతి) మరో మధురమైన, చిరస్మరణీయమైన ఈ అరువది సంవత్సరాలుగా శ్రోతలను అలరిస్తున్న గీతం. ‘‘ఉయ్యాల జంపాల లూగరావయా తులలేని భోగాల తూగి’’ ఈ పాటలో ‘‘జాబులో పుట్టిన బాబునీవయ్యా’’, ‘‘ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి, నా వారసుడవని’’, ‘‘చిన్నినా తండ్రికి శ్రీరామరక్ష, తప్పక ఇచ్చురా తాతయ్యా లక్ష’’ రావూరి వారి రచనా చమత్కృతికి అద్దంపడుతుంది. మరొక కమనీయ గీతం, ఎ.ఎన్.ఆర్, భానుమతి ఫొటోచూస్తూ పాడే పాటగా చిత్రీకరణ ‘‘ఓ ప్రియురాలా, ఓ జవరాలా పలుకవేలనే నాతో’ (ఎ.ఎం.రాజా) ‘‘వెనె్నల సెలయేరునీ విరబూసిన కలువ’’, ‘‘మిన్నుల పూదోట విహరించే కినె్నర’’ ఈ పదాలకు తగ్గ ఎఎన్‌ఆర్ అభినయం, ‘‘పొన్నల నీడ నడయాడే నెమిలి’’అన్న పదంవద్ద పాదాలతో చక్కని నాట్యాభినయం, వెనకాల దానికి తగ్గ మ్యూజిక్ ఎంతో అందంగా చిత్రీకరించారు దర్శకులు రామకృష్ణ.
భరణీ సంస్థ రూపొందించిన చక్కని హాస్య చిత్రంగా ప్రేక్షకులనలరించిన చిత్రం చక్రపాణి. స్ర్తిలకు ఆస్తిలో సమాన భాగస్వామ్యం అందాలనే అభ్యుదయభావాన్ని, అమలులో చూపిన చిత్రంగానూ, నిర్మాతలు అభినందనీయులు.

1 వ్యాఖ్య »

  1. jvrao185 said,

    One of my favorite telugu movie. 1954 lo kaadu gaanee sagar talkies lo (abids daggara- GPO ninchi kothi velle daarilo ) morning show choosina gurthu,1969 lone anukunta. Appatlo telangana vudyamam vunna “andhrolla” meeda evarikee dwesham vundedi kadu.
    bahusa appatlo gundu madhusoooooodan loo, amambapathu manushulu vundevaru karu.
    kabatti thitloo dweshinchadaaloo vundevi kavu.


Leave a Reply

%d bloggers like this: