ఆగస్ట్ 11, 2014

పాల్కురికి సోమన

Posted in సాహితీ సమాచారం at 7:44 సా. by వసుంధర

తెలుగునాట అగ్రస్థానం పొందిన ప్రాచీన కవులలో పాల్కురికి సోమనాథుడు ఉన్నాడు. ఆయన గురించిన చక్కని వివరాలతో నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఒక వ్యాసాన్ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ వ్యాసారంభంలో రచయిత ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చెయ్యబడిన తెలంగాణ కవిగా పాల్కురికి సోమనను పేర్కొనడం ఒక్కటే- ఈ వ్యాసంలో అపశ్రుతి. ఎందుకంటే- పాల్కురికి సోమన గురించీ- ఆయన వ్రాసిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర గురించీ 1954-58 మధ్యలో హైస్కూల్లో చదువుకున్నాం. 1962లో ఆంధ్రా యూనివెర్సిటీలో చేరినప్పుడు- సోమనపై పిహెచ్‍డి చేస్తున్న ఒక రీసెర్చి స్కాలరుతో పరిచయం అయింది. అదలాగుంచితే తెలంగాణలో జన్మించిన దాశరథి- 1953 లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. ఆయన కృషి చాలావరకూ ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగింది. పాల్కురికి సోమనాథుణ్డి నిర్లక్ష్యం చెయ్యడం జరిగితే అదులో ఆయన పాలూ ఉంది. ఆపైన తెలంగాణలో పుట్టిన మరో మహాకవి సినారె ఉమ్మడి రాష్ట్రంలో అందుకున్నపురస్కారాలు- 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, 2.కేంద్ర సాహిత్య అకాడెమీ, 3. భారతీయా భాషా పరిషత్, 4. రాజలక్ష్మీ పురస్కారం, 5. సోవియట్-నెహ్రూ పురస్కారం, 6. అసాన్ పురస్కారం. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఆయన విద్యాత్మకంగా,పాలనా పరంగా నిర్వహించిన పదవులు- 1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981), 2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985), 3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989), 4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992), 5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు. భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు , ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు. పాల్కురికి సోమనకి ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగితే కనుక- అందుకు గురుతర బాధ్యత ఆయనది కూడా. వ్యాసకర్త కారణంగా అలనాటి పోతన, ఈనాటి దాశరథి, సినారెలను- తెలంగాణ వారుగా అనుకోవలసి వస్తే అంతకంటే బాధాకరమైన విషయం ఉండదు. తెలుగు కవులను ప్రాంతం పేరిట విడదీసే సంప్రదాయం మనకొద్దని మనవి. 

ఇక్కడ మేము చెప్పేది ఏమిటంటే- త్యాగరాజుకి వచ్చిన గుర్తింపు అన్నమయ్యకు రావడానికి చాలా ఎక్కువ కాలం పట్టింది. త్యాగరాజుకి గుర్తింపు రావడానికి తెలుగువారికంటే తమిళులే ఎక్కువ కారణం. సాహిత్యంతో సహా సమస్త కళలకూ ప్రాంతీయత ఉండదనడానికి ఇదే నిదర్శనం. పాల్కురికి విషయంలో నిజంగా అలక్ష్యం జరిగితే ఆ పొరపాటుని అందరం కలిసి దిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. దానికి ప్రాంతీయతను ఆపాదించడం రాజకీయవాదులకు చెల్లునేమో కానీ- సాహితీపరులకు తగదు. ఏ ప్రాంతం వారైనా తెలుగు సాహితీపరుల్ని తెలుగువారిగా అభిమానిద్దాం.

పై విషయాలు దృష్టిలో ఉంచుకుంటే- ఈ క్రింది వ్యాసం అభినందనీయం (తొలి పేరాలోని తొలి వాక్యాలు కొన్ని మినహాయించి). ప్రాంతీయతకు అతీతంగా ఇలాంటిదే మరో వ్యాసం నేడు ఆంధ్రభూమిలో వచ్చింది. వ్యాసకర్తను అభినందిస్తూ ఆ వ్యాసాన్ని కూడా క్రింద ఇస్తున్నాం.

palkuriki

                                            ఆంధ్రజ్యోతి

regional poets

                                         ఆంధ్రభూమి

 

1 వ్యాఖ్య »

  1. hari.S.babu said,

    “జాతుల్ సెప్పుట, అన్యాయ విఖ్యాతిం బొందుట, మృషల్ సంధించుట, కొండె కాడవుట” అని ఒక పెద్ద జాబితా ఇచ్చి “అన్నియు పరద్రవ్యంబు నాశించి” చేస్తారని చెప్పి “ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో” అని నిట్టూర్చాడు పాతకాలం నీతిసూత్రాల శతక కర్త!

    మంచి వాదనా పటిమతో అందమయిన భాషలో సిధ్ధాంతములు చెప్పగలిగిన ఆధునికులు ఆ మిత్రవాక్యమును పాటించ కున్నారు, యేమి చేద్దాం?


Leave a Reply

%d bloggers like this: