ఆగస్ట్ 12, 2014

సీతామాలక్ష్మీ- ఒక విభిన్న సీరియల్

Posted in టీవీ సీరియల్స్ at 9:05 సా. by వసుంధర

జగన్నాథం ప్రేమించినప్పుడు జానకికి పదహారేళ్లు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు డబ్బు కావాలని విదేశాలకు వెళ్లి కోటానుకోట్లు ఆర్జించి తిరిగి వచ్చేసరికి ఆమెకు పెళ్లయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలున్నారు. అతడు ఆమె భర్తకూ, పిల్లలకూ కోటి రూపాయలిచ్చి ఆమెను భార్యగా కొనుక్కోవాలనుకుంటాడు. అందుకు వివిధ వ్యక్తుల స్పందనల వివరణతో మేము వ్రాసిన మనోవిశ్లేషణాత్మక నవల హం ది దిల్ దేచుకే సనమ్. అది మనసు తోటలో పేరిట స్వాతి వారపత్రికలో (జనవరి 16-మే 4 2001) 16 వారాల సీరియల్‍గా వచ్చింది.

రామారావు, లత అన్యోన్య దంపతులు. రామారావు మిత్రుడు మోహన్ లతను కోరాడు. అది అతడి ఇష్టానికి వదిలాడు రామారావు. ఆ సమస్యను పరిష్కరించుకునే బాధ్యతను లతకే అప్పజెప్పాడు. లత ఏ నిర్ణయం తీసుకున్నా తను అపార్థం చేసుకోనన్నాడు. పవిత్రతను నమ్మిన లత, భార్యను ఆరాధించే రామారావు, మొండిమనిషి మోహన్- ఈ మూడు పాత్రలతో మేము వ్రాసిన మనోవిశ్లేషణాత్మక నవల వరమివ్వని దేవత విజయ మాసపత్రికలో (డిసెంబర్ 1980) నవలానుబంధంగా వచ్చింది. ఈ నవలని అంతర్జాలంలో చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు.

ఒక పురుషుడు పరాయి స్త్రీని అదీ వివాహితని కోరడం పై నవలల్లో ముఖ్యాంశం. అలాంటి మరో కథాంశం సరికొత్త, విభిన్న సన్నివేశాలతో డెయిలీ సీరియల్‍గా వస్తే!

ఈ ఏడాది ఫిబ్రవరి 3న మా టివిలో సీతామాలక్ష్మీ అనే డెయిలీ సీరియల్ మొదలైంది. ఇందులో రాజశేఖర్ అనే కోటీశ్వరుడికి వాంఛే తప్ప ప్రేమ తెలియదు. డబ్బిస్తే ఏ ఆడదైనా తన పక్కలోకి వస్తుందని అతడి నమ్మకం. అందుకు తగినట్లే ఉన్నాయి అతడి అనుభవాలు కూడా. కానీ గోపాల్ భార్య సీతామహాలక్ష్మి అతడికి లొంగదు. అమెని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని అతడి తాపత్రయం. అక్కణ్ణించి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. విశేషమేమిటంటే ఈ కథలో ప్రతి పాత్రా విశిష్టమైనది, సహజమైనది.  సంభాషణలు, సన్నివేశకల్పన, పాత్రచిత్రణ, నటన పరంగా ఉత్తమ విలువలు సాధించిన ఈ సీరియల్ ఇప్పుడు వస్తున్న వాటిలో విలక్షణమైనది. పట్టమ్మాళ్, ముత్తు, సన్యాసి, గోపాల్ కుటుంబ సభ్యులు- అన్నీ మెచ్చుకోతగ్గ అపురూప పాత్రలు. ఈ సీరియల్ చూడ్డం గొప్ప అనుభవం. మన టివిలకు ఇది అరుదైన విశేషం. ఈ సీరియల్లో నాగబాబు నటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  మా టివికి, ఈ సీరియల్ బృందానికి అభినందనలు. మొదటి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

Leave a Reply

%d bloggers like this: