ఆగస్ట్ 15, 2014
దృశ్యం- చిత్రసమీక్ష
‘ఈ సినిమా కథ కొత్తది. ఇందులో పాత్రలు విశిష్టమైనవి. ఇలాంటి చిత్రం తియ్యాలని నా కల. ఇలాంటి పాత్ర వెయ్యాలని నా ఆశ. నిర్మాణం పూర్తయ్యేక ఏ చిత్రమూ నాకింత తృప్తినివ్వలేదు. వ్యాపారదృష్టి లేకుండా, విలువలకు ప్రాధాన్యమిచ్చే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. తెలుగు సినీరంగంలో అరుదైన కళాఖండంగా కలకాలం గుర్తుండిపోయే ఈ చిత్రం మా అభిరుచికి గర్వకారణం ఔతుంది. …’
ప్రతి రొటీన్ సినిమా విడుదలకూ ముందు- ప్రమోషన్ కోసం హీరో, దర్శకుడు, నిర్మాత, నిర్మాణసంస్థలో ఇతర సభ్యులు- రొటీన్‌గా చెప్పే పడికట్టు మాటలివి. విని విని విసిగిపోయిన ప్రేక్షకులు వీటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కానీ పట్టించుకోవాల్సిన అవసరం ఉందేమో ఆనిపిస్తుంది- ఈ ఏడు జూలై 11న విడుదలైన దృశ్యం చిత్రం చూసేక.
కథ విషయానికొస్తే
అందమైన అరకు లోయ దగ్గిర రాజవరం అనే అందమైన గ్రామం. ఆ ఊళ్లో సుఖసంతోషాలతో సంతృప్తిగా జీవిస్తున్న ఓ రాంబాబు (వెంకటేశ్). అతడికి అనుకూలవతి ఐన అందమైన భార్య జ్యోతి (మీనా). ఆ దంపతులకు ముచ్చటైన ఇద్దరు కూతుళ్లు- అంజూ (కృతిక), అనూ (బేబీ ఎస్తర్). ఎవరికైనా మధ్యతరగతికి మారిపోయి అలాగే జీవించాలి అనిపించేటంత ఆందమైనది ఆ కుటుంబం. హిందీ చిత్రం ఏక్ హీ రాస్తా ఆధారంగా 1960లో తెలుగులో వచ్చిన కుంకుమరేఖ చిత్రంలో బాలయ్య, సావిత్రి, డైసీ ఇరానీలను ఒక ఆదర్శకుటుంబంగా చూపించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు- దర్శకులు తాపీ చాణక్య. మళ్లీ అంత అద్భుతంగా కనిపిస్తుంది ఈ చిత్రంలోని మధ్యతరగతి కుటుంబం.
రాంబాబు మంచివాడు. ఊరంతా అతడి మంచితనాన్ని ప్రేమిస్తారు- అందర్నీ పోలీసు జులుంతో బాధించే కానిస్టేబుల్ వీరభద్రం (రవి కాలె) తప్ప. తన జులుంకి అడపాతడపా అడ్డు తగిలే రాంబాబుని ఎప్పుడో ఏదో కేసులో ఇరికించి హింసించాలని వీరభద్రం తాపత్రయం.
ఈ పరిస్థితుల్లో ఐజి గీత (నాదియా) ఏకైక కుమారుడు వరుణ్ (రోషన్ బషీర్) ఉన్నట్లుండి మాయమయ్యాడు. అతడి జులాయితనానికి భార్యే కారణమని బాధ పడుతుంటాడు గీత భర్త ప్రభాకర్ (నరేష్). వరుణ్ మాయమవడాన్ని రాంబాబు కుటుంబంతో ముడి పెడతాడు వీరభద్రం. కొడుకుమీద మమకారంతో గీత రాంబాబు కుటుంబాన్ని వేటాడ్డం మొదలెదుతుంది. ఆ వేటను పసికట్టిన రాంబాబు ‘పోలీసు తల్చుకుంటే చావుదెబ్బలకు కొదవా?’ అనుకుని తననీ, తన కుటుంబాన్నీ రక్షించడానికి తన తెలివంతా ఉపయోగిస్తాడు. పోలీసుల వేట, రాంబాబు ఆట- ఉత్కంఠభరితంగా కొనసాగడమే ఈ చిత్రం. విడియో రివ్యూ
ఇందులో సమకాలీన జీవితం ఉంది. సెల్ఫోన్లతో ఆడపిల్లల్ని వేధించే యువకులు, అధికారాన్ని దుర్వినియోగం చేసే పోలీసులు, అసహాయతతో ప్రాణాలు తీయగల అమాయకులూ, తమను తాము రక్షించుకుందుకు ఆలోచనని అద్భుతంగా ఉపయోగించగల సామాన్యులూ, అధికారుల జులుంని భరిస్తూనే మంచితనానికి మద్దతునిచ్చే మామూలు మనుషులూ ఉన్నారు.
కుటుంబంతో చూడ్డానికి ఇదో మంచి కుటుంబచిత్రం. ఆ కుటుంబంతో మనని మమేకం చేసి ఆ కుటుంబం నవ్వితే నవ్వి ఏడిస్తే ఏడ్చి అడుగడుగునా ఉత్కంఠకు గురయ్యేలా అద్భుతంగా రూపొందిన చిత్రమిది. ఇందులో అనవసరం అనిపించే పాత్ర కానీ, సన్నివేశం కానీ ఒక్కటి కూడా లేదు. అందుకు కథ, చిత్రానువాదం, సంభాషణలు ముఖ్యపాత్ర వహించాయనడంలో సందేహం లేదు. కానీ అన్నింటా దర్శకురాలు శ్రీప్రియకే అగ్రతాంబూలం.
వెంకటేశ్ తన పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయి చిత్రానికి ప్రాణం పోశాడు. మీనా అత్యంత సహజంగా ఉంది. మిగతా నటీనటులందరూ (చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పరుచూరి వెంకటేశ్వరరావు వంటి వారితో సహా) తమ తమ పాత్రల్లో జీవించారు. ఆ ఘనతలో కూడా కొంతయినా శ్రీప్రియకు దక్కాలి.
పాటలు బాగున్నాయి- ఎప్పటిలాగే తక్కువ తెలుగుతనంతో. పాటల చిత్రీకరణ అద్భుతం. ఇక్కడా శ్రీప్రియకు మార్కులు పడతాయి. ఇక కెమేరా పనితనం చిత్రం పొడుగునా కనిపించి- చిత్రాన్ని కనుల పండువ చేసింది.
ఈ చిత్రంలో తార్కికంగా చిరు లోపాలుంటే ఉండవచ్చు. కానీ వాటిని పట్టించుకోనవసరం లేదు.
ఇది మళయాళంలో అదే పేరిట వచ్చిన చిత్రానికి అనుసరణ అన్నారు. కాబట్టి ముందుగా ఆ మలయాళ చిత్రానికి జోహారులు. ఎక్కడా మళయాళ పోకడలు కనిపించకుండా అచ్చ తెలుగు చిత్రంలా తీర్చిదిద్దిన చిత్రనిర్మాణ సభ్యులందరికీ అభినందనలు.
ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తరహా ఉత్కంఠతో అద్భుతమైన అసలుసిసలు కుటుంబ చిత్రాన్ని చూసిన అనుభూతినిచ్చిన అపూర్వ దృశ్యం ఈ చిత్రం. ఐతే దృశ్యంలాంటి కథలు తెలుగులో కూడా చాలా ఉన్నాయి. ఎటొచ్చీ మన దర్శకులకు- ఎవరో చలనచిత్రంగా మలచేదాకా మంచి కథని గుర్తించే సామర్ధ్యం ఉన్నదనిపించదు. తెలుగు కథలు చదివి చిత్రంగా మలచే స్థాయికి తెలుగు నిర్మాతలు , దర్శకులు ఎదుగుతారని ఆశిద్దాం.
Chinni said,
ఆగస్ట్ 23, 2014 at 5:35 సా.
Telugu jaathi garvinchadagina enno goppa paatalanu swaraparachina maama (kv mahadevan garu) malayaali-thene kanna theeyanidi telugu bhaasha antoo marenne adbhuthamaina geethaalanu manakandinchina ilaya rajaa garu tamilan kadaa-pedave palikina maatallone theeyani maate amma anna geethaanni manaku kaanukagaa ichhina ar rahaman garu….tamailiane kada -sangethaaniki bhaasha bedhaalu levu daanidi vishwa bhaasha ani cheppadame naa uddeshyam
వసుంధర said,
ఆగస్ట్ 23, 2014 at 9:19 సా.
వరస ఎవరు కట్టారూ అని కాదు- ఉచ్చారణ తెలుగులా ఉన్నదా లేదా అని. మాకు అన్ని భాషల పాటలూ, వరసలూ ఇష్టమే. విని ఆనందిస్తాం. తెలుగుతనం లేకపోతే లేదంటాం తప్ప వరస బాగోలేదని అంటాం. తెలుగు పాటకు రెహమాన్ ట్యూన్ కట్టినా, తెలుగు పాటని ఉదిత్ నారాయణ్ పాడినా విని ఆనందిస్తాం. కానీ అచ్చమైన గ్రామీణ వాతావరణంలో వచ్చిన తెలుగు సినిమాల్లో తెలుగు జానపదాల వరసలు వినిపించాలని కోరుకుంటాం. తెనాలి రామకృష్ణలో వినిపించిన ‘చందన చర్చిత’ పాటకు వరస కట్టింది తమిళులైన విశ్వనాథన్ రామ్మూర్తి కావచ్చు. కానీ అది అచ్చ తెనుగు పాటలా ఉంటుంది. దృశ్యం సినిమాలో ఆ పాటలో తెలుగుతనం లేదనిపించింది. అది దురభిమానం కాదు. అనుభూతి. మా అభిప్రాయమే సరైనదని అనలేము. మీకు ఆ పాటలో తెలుగుతనం అనిపిస్తే- మీ అనుభూతి వేరేగా ఉన్నదనుకోండి. కె.వి. మహదేవన్, ఇళయరాజాల వరుసల్లో తమిళదనం కనిపించే పాటలు చాలానే ఉన్నాయని మా అభిప్రాయం. ఐతే మేము అత్యధికంగా అభిమానించే అచ్చతెలుగు పాటలూ వారినుంచి వచ్చాయి. అలా లేని వారి పాటలూ మాకిష్టమే. మీకు మా అభిప్రాయం సరిగ్గా అర్థమైనట్లు తోచదు.