ఆగస్ట్ 19, 2014

గీతాంజలి- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:33 సా. by వసుంధర

geetanjali

భయపెడుతూ ఉత్కంఠ కలిగించే చిత్రాల్ని అర్థవంతంగా తియ్యడం చాలా కష్టం. దానికి హాస్యాన్ని జోడించి వినోదాత్మకంగా తియ్యడమంటే ఇక కత్తిమీద సామే. ఈమధ్య అలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని ఓ మాదిరి. కొన్ని బాగున్నాయి. కొన్ని బాగా హిట్టయ్యాయి. ఏదిఏమైనా అవి మూస చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులని అలరిస్తాయి. అలరింపుకి లోటు లేకుండా చాలా బాగుంది అనిపింపజేస్తుంది ఈ ఆగస్ట్ 8న విడుదలైన గీతాంజలి.

సినీ దర్శకుడు కావాలనుకునే శ్రీనివాసరెడ్డి (శ్రీనివాసరెడ్డి). నందీ అవార్డు కొట్టే సినీ నిర్మాత కావాలనుకునే ఓ రమేష్ రావు (రావు రమేష్). నిర్మాత దిల్‍రాజుకి (దిల్‍రాజు) దగ్గిరవాళ్లమని చెప్పుకునే అత్రేయ, ఆరుద్ర (రాజేష్, శంకర్). శ్రీనివాసరెడ్డి, ఆత్రేయ, ఆరుద్ర అద్దెకుంటున్న ఓ భవనపు గది. ఆ గదిలోకి తిండికోసం వచ్చే ఓ ఫుడ్ దెయ్యం. అర్థరాత్రి పూట వచ్చి అడిగి కాఫీ పెట్టించుకుని తాగి వెడుతుండే గీతాంజలి (అంజలి). ఆ గీతాంజలి ఎప్పుడో చనిపోయిందని తెలిసి హడిలిపోయిన శ్రీనివాసరెడ్డి మిత్రబృందం. ఎలాంటి దెయ్యాన్నయినా హడలెత్తించి తరిమేస్తాననే సైతాన్ రాజ్ (బ్రహ్మానందం). వీరి మధ్య ఆసక్తికరంగా, తార్కికంగా, రవంత మానవాతీతంగా, సరదాగా, వినోదాన్ని పంచుతూ సుఖాంతమౌతుంది కథ.

కథని కొంత- శ్రీనివాసరెడ్డి రావు రమేష్‍కి చెబుతాడు. కొంత కథ ఫ్లాష్‍బ్యాక్‍లో వస్తుంది. ముగింపులో బిమల్‍రాయ్ ప్రముఖ హిందీ చిత్రం మధుమతిని (1958) స్ఫురణకు తెచ్చినా కూడా కథ కొత్తదే అనిపిస్తుంది. ఎలా చెప్పినా ఎక్కడా గజిబిజి లేకుండా సమర్థవంతంగా, ఆసక్తికరంగా నడిచిన ఈ కథకి తగిన బలాన్నిచ్చింది స్క్రీన్‍ప్లే, దర్శకత్వం. అందాన్నీ, జీవాన్నీ ఇచ్చింది అంజలి సమక్షం, నటన. చిన్నపాత్రల్లో కనిపించిన రఘుబాబు, పృథ్వీరాజ్‍లతో సహా- నటీనటులందరూ తమ పాత్రల్ని హుందాగా పోషించారు. సప్తగిరి తన పద్ధతిలో నటించాడు. రావు రమేష్ చక్కగా నటించినా- ఆ పాత్రకి జగపతిబాబు ఐతే ఇంకా బాగుండేదనిపించింది. బ్రహ్మానందం పాత్రకి అతడి ఇమేజ్‍కి తగిన నిడివి, ప్రాముఖ్యం లేక కొంచెం నిరుత్సాహం కలిగిస్తుంది. అందుకనే కాబోలు సినిమా చివర్లో అతడికో డ్యాన్సు పాట పెట్టి ముగించారు. గతంలో ఆప్‍కీ ఖాతిర్ (1977) అన్న హిందీ సినిమాలో బొంబైసే ఆయా మేరే దోస్త్ అనే హిట్ పాటని ఎక్కడ పెట్టాలో తెలియక- సినిమా చివర్లో ఆ పాట పెట్టి ముగించారు. అదే ఇక్కడా చేశారు.

ఇలాంటి చిత్రానికి నేపథ్య సంగీతంలో శబ్దం ఎంత తక్కువుంటే అంత బాగుంటుంది (ఉదాహరణకి అవును చిత్రం). కానీ ఇందులో శబ్దాల హోరు కాస్త ఎక్కువే. పాటలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా కాఫీ మీద పాట చిత్రీకరణ చాలా బాగుంది.

సినిమా అన్నాక కొన్ని చిన్న చిన్న దర్శకత్వపు లోపాలు సద్దుకుపోవడం అవసరం. ఐతే- అంజలిని ఒకచోట- సంప్రదాయం పాటించే అచ్చతెలుగు అమ్మాయి అని పరిచయం చేసి- సంప్రదాయపు దుస్తుల్లో చూపించడం బాగానే ఉంది కానీ ఆమె వెనక్కి తిరిగితే మొత్తం వీపంతా కనిపించేలా జాకెట్ వెయ్యడం- సంప్రదాయం అనిపించుకోదు. అందులోనూ-ఆమెను అలాంటి దుస్తుల్లో చూపడానికి చిత్రం పొడుగునా అవకాశం ఉన్నప్పుడు. ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే- కుటుంబ సమేతంగా చూడ్డానికి వీలైనంత సభ్యంగా గీతాంజలిని ప్రేక్షకులకు అందించిన దర్శకుడు రాజ్ కిరణ్‍కి గొప్ప భవిష్యత్తు ఉంది. చక్కని కథకు కోన వెంకట్‍కీ, నిర్మాత ఎంవివి సత్యనారాయణకూ అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: