ఆగస్ట్ 28, 2014

రన్ రాజా రన్- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:27 సా. by వసుంధర

run raja run poster

ఓ పాత కథ. దానికి కొంత ఆధునికత. టార్గెట్ యువత. ఆపైన దర్శకుడి సమర్థత.

ఇటీవల ఈ కాంబినేషన్ చాలామంది సినీ నిర్మాతలను ఆకర్షిస్తోంది. నిర్మాతల ఆసక్తిని కలకాలం నిలుపుకోగల దీటైన దర్శకులు కూడా మనకిప్పుడు తయారౌతున్నారు. ఫలితంగా ఈ ఆగస్ట్ 1న విడుదలైన రన్ రాజా రన్ లాంటి సినిమాలు వస్తున్నాయి.

పెద్దలకు మాత్రమే అని తీసే సినిమాలు పిన్నలు కూడా చూసి వారికంటే ఎక్కువగా ఆనందిస్తున్నారన్నది అందరికీ తెలిసిన రహస్యం. అలాగే యువతకోసం తీసే సినిమాలు కూడా పాతతరం వారిని బాగానే ఆకర్షించగలవు అనడానికి నిదర్శనంగా కూడా రన్ రాజా రన్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.

కథ వినడానికి అసంబద్ధంగా ఉంటుంది. కూరగాయలు అమ్ముకునే వాడి కొడుకు రాజా (శర్వానంద్). పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్ రాజ్) కుమార్తె ప్రియని (సీరత్ కపూర్) ప్రేమిస్తాడు. దిలీప్ రాజాని కిడ్నాప్ కేసులో ఇరికించడానికి పథకం వేస్తాడు. రాజా ఏకంగా ప్రియనే కిడ్నాప్ చేసి దిలీప్‍కి షాకిస్తాడు. ఇవన్నీ ఎంత అసంబద్ధంగా అనిపిస్తాయో అంత లాజికల్‍గా అనిపించేలా ముగుస్తుంది కథ. దీనిలో పుష్కలంగా కామెడీ, సస్పెన్స్, సెంటిమెంట్ కలిశాయి. కథనిండా బోలెడు మలుపులున్నా ఎక్కడా గజిబిజి ఉండదు. కానీ కమర్షియల్ సినిమాలు చూసి చూసి ఆలోచించే అలవాటు పోయినవారికి కథ కాస్త గజిబిజిగా అనిపించవచ్చు.

రాజాగా శర్వానంద్ ఆ పాత్రలో పూర్తిగా ఇమిడిపోయాడు. గతంలో అతడిని హీరోగా చూసినవారు ఆ వ్యక్తి ఇతడేనా అని ఆశ్చర్యపోయేటంత మార్పు తన నటనలో చూపించాదు. చలాకీతనంలో, కామెడీ టైమింగులో, నృత్యాల్లో చాలా గొప్పగా అనిపించాడు. హిందీలో ఇలాంటి పాత్రలు ఎక్కువగా గోవిందా వేసేవాడు. శర్వానంద్ గోవిందాని అనుకరించలేదు కానీ, గొవిందా అంత గొప్పగానూ అనిపించాడు. నటనకు అవకాశమున్న ప్రియ పాత్రకు సీరత్ కపూర్ న్యాయం చేకూర్చింది. ఆమె ఇష్టసఖిగా విద్యుల్లేఖ రామన్- ఆ పాత్రకు తను తప్ప ఇంకెవరూ సరిపోరు అనిపించేటంత గొప్పగా ఒప్పించింది. సంపత్ రాజ్ విలన్‍గా మూసకు భిన్నంగా బాగా నటించాడు. అతడి కింద పనిచేసే పోలీస్ ఆఫీసర్‍గా అడివి శేషు ఆ పాత్రకు వన్నె తెచ్చాడు. మిగతా పాత్రధారులందరూ కూడా అవధుల మేరకు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఈ చిత్రంలో పాటలు యువతకు నచ్చేలా ఉన్నప్పటికీ, లయను మెచ్చేవారందరినీ అలరిస్తాయి. పాటల చిత్రీకరణ ఇంకా బాగుంది.

చూసినంతసేపూ బాగుండి, చూసేక మరోసారి చూడాలనిపించేలా రూపొందిన ఈ చిత్రానికి కథనంలో, పాత్రల ఎన్నికలో, యువ దర్శకుడు సుజీత్ చూపిన ప్రతిభ మెచ్చుకోతగ్గది. తక్కువ నిడివి చిత్రాల్లో తనదంటూ ఒక ముద్ర వేసి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంది. ఐతే చాలామంది నవయువ దర్శకులు తమకున్న అసంపూర్ణ జ్ఞానంతో ఓ మంచి సినిమా తీసి- ఆ తర్వాత- ఒకే మంచి చిత్రం తీసినవారిగా మిగిలిపోవడం చూస్తున్నాం. సుజీత్ విషయంలో అలా జరక్కూడదని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: