ఆగస్ట్ 31, 2014

భువినుంచి దివికి

Posted in కళారంగం at 7:18 సా. by వసుంధర

bapu image

విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ ప్రతిభతో గ్రహాంతర యానాలు చేయిస్తారు. మహా కళాకారులు అవలీలగా లోకాంతర యానాలు చేస్తారు. అదీ ఒక లోకంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాక. ప్రముఖ చిత్రకారుడు, రచయిత, సినీ దర్శకుడు బాపుని మహా కళాకారుడు అనడం- హిమాలయాల్ని గుట్ట అనడంతో సమానం. ఆయన తన అసాధారణ ప్రతిభతో చిత్రకల్పన చేస్తూ మనమధ్య ఎనబై ఏళ్లు గడపడం మన అడృష్టం. మాన్యులు ముళ్లపూడి వెంకటరమణతో వారి స్నేహబంధం, చిత్రకల్పనానుబంధం విడదీయరానిదని అందరికీ తెలిసినదే. రమణ 2011లో ఏ కారణంవల్లనో భువినుంచి దివికి లోకాంతరయానం చేయాల్సి వస్తుంది. ప్రాణమిత్రుణ్ణి వదిలి ఉండడం అసాధ్యమని తెలిసినా- తనకు శ్రీరామరాజ్యం బాధ్యత ఉండడంతో కాస్త ఆగారు. అదపాతడపా అనారోగ్యం చేస్తున్నా- దౌ టూ బాపూ- అని విషాద వదనాలతో కలవరపడుతున్న అసంఖ్యాక అభిమానులకోసం ఈ భువిని తరింపజేయడానికి గత కొద్ది మాసాలుగా మానవప్రయత్నం చేస్తూనే ఉన్నారు. రమణేయమైన మూడు కోతికొమ్మచ్చిలకు ఎలాగో అలా ఓ కొసరికొమ్మచ్చినిచ్చి ఇక ఆగలేనన్నట్లు చివరకు రమణాకర్షణకు లోబడి మిత్ర రుణానందలహరిలో ఈరోజు సాయంత్రం దివి దిశగా ప్రయాణమయ్యారు. వారికిది పరమపదం. వారిక మనమధ్య లేరని బాధగా ఉన్నా- వారి జీవితాన్ని తల్చుకుంటే ముత్యాల ముగ్గులా, అందాల రాముడులా ఆహ్లాదాన్ని కలిగిస్తుందనడానికి సాక్షి అవసరం లేదు.

భువికి వారిచ్చిన విలువకు కృతజ్ఞతలు. దివిలో వారికి శుభాకాంక్షలు.

Leave a Reply

%d bloggers like this: