సెప్టెంబర్ 5, 2014

నమో నమో బాపూ 4 ఎ

Posted in కళారంగం at 4:35 సా. by వసుంధర

గీతల పిసినారి .. భావ సంస్కారి!

  • 05/09/2014 ఆంధ్రభూమి దినపత్రిక
  • -ప్రవవి

geetala pisinari

స్వామీ.. మిమ్మల్ని పిల్లల్ని విడిచి వెళ్లాలని లేదు. కానీ, మా అమ్మ ఆకర్షణ శక్తి లాగేస్తోంది ప్రభూ!
***
లవకుశలను అప్పగించేసి -తల్లి భూదేవి ఒళ్లోకి వెళ్లిపోతూ రాముడితో సీత పలికిన చివరి మాటలివి. బాపూ రమణల ఏడో నెంబరు ఆల్బమ్‌లో.. 15వ పేజీలో కనిపించే కార్టూన్‌కు క్యాప్షన్ కూడా. నవ్వు తెప్పించేదే కార్టూన్ అనుకుంటే -కొంటె గీతల్తో కన్నీళ్లు పెట్టించే బాపు అరుదైన కార్టూన్ అది.
**
నిజమే.. బాపును కూడా ఏదో ఆకర్షణ శక్తి లాగేసింది. ఆ విషయానే్న మనకు చెబితే -రాముడు, లవకుశల్లాగే మనమూ భోరున ఏడుస్తామని చెప్పలేదంతే. బాపును లాగేసిన ఆకర్షణ శక్తి -బహుశ మూడేళ్ల క్రితం ఒంటరిగా వెళ్లిన రమణ స్నేహానిదై ఉండాలి. అందుకే -వెళ్లాలని లేకున్నా, వెళ్తున్నానని చెప్పకున్నా.. వెళ్లిపోయాడు బాపు.
***
బాపు రామభక్తుడు. అవునన్నా కాదన్నా రామభక్తుడే. అందుకే ఆయన కొంటె గీతల్లో ఎందరో దేవుళ్లు, దేవతలు కనిపించినా రాముడు మాత్రం ఒకటి రెండుచోట్లే కనిపిస్తాడు. -హనుమంతుడు, వినాయకుడు, కృష్ణుడు.. ఇలా చాలామంది దేవుళ్లు, దేవతలు బాపు సెటైర్లు చూసి పగలబడి నవ్వుకున్న వాళ్లే. రాముడి మీద బాపు కార్టూన్లు లేవంటారు చాలామంది. కానీ, ఆయన గీతల్లో అణువణువునా రాముడున్నాడంటారు ఆయన గురించి తెలిసిన ఇంకా చాలామంది.
***
పాస్ట్ -హిస్టరీ. ఫ్యూచర్ -మిస్టరీ. ప్రజెంట్ -ఓ గిఫ్ట్.
పెయింటర్‌గా, ఇలస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా, డిజైనర్‌గా, దర్శకుడిగా, విమర్శకుడిగా.. ఏ కోణంలో బాపును చూసినా మనకు కనిపించేది ఇదే. చివరి రోజు వరకూ ఆయన గీతల్లోనూ, ఆలోచనల్లోనూ కనిపించిందీ ఇదే. అందుకే -అక్షరానికీ బొమ్మకీ, భంగిమకీ దృశ్యానికీ.. దేనికైనా ‘బాపు’ మార్క్ పడింది. సముద్రంలో వశిష్ట గోదావరి కలిసే నడుమొంపు నరసాపురంలో 80 ఏళ్ల క్రితం (1933 డిసెంబర్ 15) పుట్టిన బాపు అసలుపేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. పల్లెలో పుట్టి పద్మశ్రీ స్థాయికి ఎదిగిన బాపు -తెలుగు సంస్కృతి శోభకు ఆయన పట్టిన పట్టు‘కుంచె’ గురించి ఎంతచెప్పినా తక్కువే. అయితే, చేయాల్సిన దాని గురించి బాపు ఏరోజూ ప్రణాళికలు గీసుకోలేదు. తన పని తను చేశాడు. అందుకే -పద్మశ్రీలు, జాతీయ అవార్డులు, నంది అవార్డులు, లైఫ్‌టైం అచీవ్‌మెంట్లు, లెక్కలేనన్ని రివార్డులు వెతుక్కుంటూనే వచ్చాయి. అందుకే -బాపు బొమ్మను సృష్టించి, నవరసాలకు రూపమిచ్చి, నృత్య భంగిమలకు సరికొత్త ఆహార్యాన్ని ఆపాదించిన గొప్పతనాన్ని 1996లోనే దూరదర్శన్ డాక్యుమెంటరీ చేసి తనను తాను గౌరవించుకుంది.
***
బాపు -గీతలో పిసినారి. భావంలో సంస్కారి. అందుకే -తేజో వర్ణ సమ్మిళిత చిత్రాల ఆవిష్కరణలో బాపుది ప్రత్యేక శైలి. ‘ఒక్కోసారి బాపు మాట కూడా వినం. మనసు తెలుసుకుని మసలుకుంటాం.. అంతే’ అన్నట్టు ఆయన వేళ్లమధ్య కుంచెలే వాలుజడల్ని, జఘన సౌందర్యాన్ని ఆవిష్కరించాయి. ప్రకృతి రమణీయతను ప్రసాదించాయి. తెలుగు సంప్రదాయాన్ని, సంస్కారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. అందుకే -దేవుడి బొమ్మ గీసినా, గయ్యాళి పెళ్లాన్ని చూపించినా ఆయన గీతలో ఎక్కడా వాలు తప్పదు. రామాయణ మహాభారత భాగవతాల్లోని పాత్రల దృక్పధాన్ని గీతల్లో చూపించిన ఘనత బహుశ బాపుదే. పరమశివుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు, భీముడు, దుర్యోధనుడు.. ఇలా పాత్రోచితమైన ఆహార్యాన్ని, గాంభీర్యాన్ని గీతల్లోనే ఆపాదించిపెట్టాడు. బాపు బొమ్మల వొంపులోని వాడి కొత్త అందాల్ని రుచి చూపించాయి కనుకే -ఎన్నో పుస్తకాలపై ఆ బొమ్మలే కవర్ పేజీలయ్యాయి. ఇక తెలుగు అక్షరానికి కొంగొత్త వొంపు తీసుకొచ్చిన గొప్పదనం బాపుకే దక్కుతుంది. ఆయన దస్తూరీకి ‘బాపు’ మార్క్ ఇవ్వడంతో, అదే ఇప్పుడు ఫాంట్‌గా ప్రాచుర్యం పొందింది.
కాన్వాసు మీద గీతల కావ్యం మాదిరిగానే సెల్యూలాయిడ్ స్క్రీన్ మీద బాపు ఎన్నో కావ్యాలు రచించారు. 1967లో ‘సాక్షి’ని మొదలుపెట్టి 50 సినిమాల వరకూ ఆయన దర్శకత్వం వహించారు. 1996 వరకూ ఏటా ఒకటీ, రెండూ సినిమాలు తీస్తూ వచ్చిన బాపు, తరువాత ఆధునిక సినిమా నడక మారడంతో వేగాన్ని పూర్తిగా తగ్గించారు. కొత్త ప్రవాహానికి దారినిస్తూ, సంస్కారవంతమైన సినిమాలను ఆదరించే అభిమానుల కోసమే అన్నట్టు సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించారు. రెండేళ్లకొక సినిమా చొప్పున తీస్తూ, చివరిలో దశాబ్దకాలంలో కేవలం మూడు సినిమాలకు మాత్రమే ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు సంప్రదాయానికి కట్టిన పట్టుపంచె చిరస్మరణీయం అన్నట్టు -చివరిలో తీసిన రాధాగోపాళం, శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు సైతం తెలుగు సంప్రదాయ ఔన్నత్యాన్ని, తెలుగు కథలోని గొప్పతనాన్ని చాటిచెప్పేవే.
****
బాపు బొమ్మ వేస్తే ముళ్లపూడి రమణ అక్షరాలద్దినట్టు ఉంటుంది. ముళ్ళపూడి రమణ ఏదైనా రాస్తే-అది అచ్చంగా బాపు బొమ్మ గీసినట్టు ఉంటుంది. అదీ -వాళ్ల స్నేహం. మద్రాస్‌లోని పిఎస్ హైస్కూల్లో బాపు, ముళ్లపూడి చదువుకుంటున్న రోజులు. ‘అమ్మ మాట వినకపోతే’ అంటూ ముళ్లపూడి రమణ పొట్టి కథరాస్తే, అది రేడియో అన్నయ్యగా ప్రాచుర్యం పొందిన న్యాయపతి రాఘవరావు సారథ్యంలో నడిచే పిల్లల మాసపత్రిక ‘బాల’లో ప్రచురితమైంది. ఆ పొట్టి కథకు కురచ బొమ్మ వేసింది బాపు. అలా బొమ్మా బొరుసుగా ప్రారంభమైన స్నేహం -దిగ్దిగంతాలకు విస్తరించింది. స్నేహానికి ‘బాపు రమణ’ల మార్క్ పడింది. ఇప్పుడు స్నేహం గురించి కొంటె కబుర్లు చెప్పడానికి రమణ లేరు. కొంటె బొమ్మలు గీయడానికి -బాపు కూడా లేరు. వాళ్ల ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన బుడుగు మాత్రమే మనకు మిగిలాడు. ఇక నుంచి బుడుగును చూసుకుంటూ రమణ అక్షర జ్ఞానాన్ని, బాపు బొమ్మల జ్ఞాపకాల్ని నెమరేసుకుందాం.

1 వ్యాఖ్య »

  1. బాధ ఒకటే ! భావాలు ఒకటే ! పలుకులలో తేడా ! స్పందించని గుండె ఉందని నేను అనుకోను. చెప్పే వాళ్ళు కొందరు, చెప్పలేని వాళ్ళు కొందరు, చెప్పని వాళ్ళు కొందరు. అందరిని ఇంతగా కదిలించడం అనన్యసామాన్యం. తెలుగుదనాన్ని నవరసాలలో పలికించగలిగిన ఆ శక్తి అజరామరము.


Leave a Reply

%d bloggers like this: