వసుంధర అక్షరజాలం

విశ్వనాథ సినీ సమీక్ష పేరడీ- శ్రీరమణ

పారడీ అనేది ఆంగ్ల సాహిత్యం నుండి మనం దిగుమతి చేసుకున్న ఒక సాహితీ ప్రక్రియ. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక విధంగా అనుకరణను పారడీ అనవచ్చు. పారడీలు వ్రాయడం కష్టతరమైన పని. చాలామంది అనుకున్నట్లుగా మూలాన్ని వ్రాసిన కవిని ఎగతాళి చేయటం కాదు పారడీ అంటే! మూలాన్ని వ్రాసిన రచయితను దగ్గరగా చూసి, ఆయన రచనా శైలిని క్షుణ్ణంగా అనుక(స)రించి వ్రాయడమే పారడీ. కాకపొతే మూలంలో భావగర్భితంగా, గంభీరంగా ఉన్నదానికి కొద్దిగా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వ్రాస్తుంటారు పారడీలు వ్రాసే కవులు. శ్రీశ్రీ మొదలుకొని శ్రీరమణ గారిదాకా ఎందరో ఈ పారడీ ప్రక్రియతో పాఠకులను రంజింపచేసారు. ఈ పారడీకి వన్నె తెచ్చిన వాడు శ్రీ  జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు. వీరు శ్రీశ్రీకి అత్యంత ఆప్తులు. చలం గారు శ్రీశ్రీ గారి మహాప్రస్థానానికి ‘యోగ్యతాపత్రం’ ఇవ్వటానికి వీరే కారకులని అంటారు. ఈ రోజుల్లో చిత్ర విచిత్ర కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు పారడీలను చక్కగా వ్రాస్తున్నారు. శ్రీ రమణ గారు వారు వ్రాసిన పారడీలను ఒక గ్రంథ రూపంలో తెచ్చారు. ఈ పారడీలు చదువుతుంటే- ఆయా కవులు, వ్యక్తులు మన కళ్లముందు నిలబడి మనతో మాట్లాడుతున్నట్లనిపిస్తుంది. కవిసామ్రాట్ విశ్వనాథ  సత్యనారాయణ గారు ఒక సినిమాకు సమీక్ష వ్రాస్తే ఎలాగుంటుందో, శ్రీరమణ గారు పారడీ ప్రక్రియద్వారా శ్రీ విశ్వనాథ గారిని మనముందు సాక్షాత్కరింప చేసారు. అభిమానమున్న చోటే అనుకరణ ఉంటుందంటారు . విశ్వనాథ వారు మన స్మృతులలో ఉన్నారు కనుక, వారిని అమితంగా అభిమానించే శ్రీరమణ గారు ఇక్కడ విశ్వనాథ వారిని అనుకరించి కృతకృత్యులయ్యారు. కవిసామ్రాట్ విశ్వనాథ గారికి వారి జయంతి సందర్భంగా- స్మృత్యంజలితో,విలక్షణ రచయిత శ్రీరమణ గారికి కృతజ్ఞలతో, ఈ క్రింది పారడీని మీకు  సేకరించి  ఈ క్రింద అందిస్తున్నాను. అందుకొని ఆనందించటం  మీ వంతు!

భవదీయుడు 

టీవీయస్.శాస్త్రి

Exit mobile version