సెప్టెంబర్ 22, 2014
శ్రీశ్రీపై వివాదం
మహాకవి శ్రీశ్రీ ఈ శతాబ్దం నాది అని సగర్వంగా చెప్పుకుని ఆమోదం పొందినవాడు. బాధాసర్పదష్టులకోసం కలాన్నీ, గళాన్నీ సమన్వయం చేసినవాడు. ఆయనపై బాధాసర్పదష్టలు వివాదాస్పద చర్చల్లో పాల్గొని ఆయన్ను వేలెత్తి చూపడం అనుకోని విశేషం. ఆంధ్రభూమి దినపత్రికలో నేడు నళిని అనే సెక్స్ వర్కర్ వ్రాసిన వ్యాసంలో ఆయన గురించి ఆయన వ్రాసిన మాటలే ఉటంకించడం జరిగింది. గతానికి సంబంధించిన ఈ విషయాన్ని వర్తమానంలో ఎలా తీసుకోవాలో మార్గదర్శకంగా వివరించే మరో వ్యాసంకూడా నేడు ఆమ్ధ్రభూమి దినపత్రికలో వచ్చింది. కవితల ఆదర్శాన్నీ, కవి వ్యక్తిత్వాన్నీ ముడిపెట్టడం గురించి ఒకొక్కరు ఒకొక్కలా అభిప్రాయపడుతున్నారు. ఐతే కవి తన వ్యక్తిత్వం తన కవితాదర్శంతో విభేదించినట్లు ఋజువైతే మాత్రం- అందుకు సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత కవికి ఉన్నదని మేమూ అనుకుంటాం. నేటి ఈ రెండు ఉత్తరాలూ ఆలొచించతగ్గవే! ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవడమూ సమంజసమే! వ్యక్తి లేనప్పుడు వ్యక్తి ఆదర్శాలను మాత్రమే చర్చించడం సబబు!
jonnalagadda markandeyulu said,
సెప్టెంబర్ 23, 2014 at 1:51 సా.
స్త్రీ అరణ్యరోదన లైంగిక ఇతివృత్తము
ఆంధ్రభూమిలో 1-9-14 దాసోజు లలితగారి వ్యాసము అరణ్యరోదనగా మిగిలిపోకూడదు. స్త్రీని లైంగిక కోణములో చూపుతున్న ఇతివృత్తాలుకు స్వస్తి చెప్పాలి. ముఖ్యంగా రచయితలు ఒక విషయం మరిచిపోతున్నారు. కావ్యము కావచ్చు, మరేదేని ఇతివృత్తము కావచ్చు. నీతిని బోధించకపోయినా పరవాలేదు. అవినీతిని మాత్రం ప్రబోధించకూడదు. శ్రీశ్రీ, చలంరచనలలో విచ్చలవిడితనం పురుషుడికిసహజకవచంలా భాసిల్లింది. అలాంటిదే స్త్రీదికూడా అనే చెప్పేమనస్తత్వం మన సమాజ పరిస్థితికి సరిపడలేదు. శీలమేముఖ్యముగ స్త్రీకిశిక్షలేవేశారు. స్త్రీని ఘోరావమానాలు పాలు చేస్తూ ఇతివృత్తాలు శీలంపేరిట అమెను వేశ్యగా ముద్రవేస్తాయి.శీలంకోల్పోవడముపురుషుడికుండదా?. లైంగికానందము స్త్రీపురుషులిరువురికీ కావాలి. భర్త అనుమతిస్తే సంతానవతి కావడానికి పరపురుష సంగమము అభ్యంతరము లేదని మన పురాణాలు చెబుతాయి. కర్ణుడివంటి గొప్ప కుమారుడిని పాండురాజు బ్రతికుండగా భర్తకు పరిచయం చేయలేకపోవడం భర్త అనుమతిలేని కన్యకుమారుడంటే అభ్యంతరముండకూడదు. భీష్ముడివంటి కొడుకునుశంతనుడువదులుకోగలిగాడు. మనం గగ్గోలు పెట్టే శీలాన్ని పోగొట్టుకుని వ్యాసభగవానుని జన్మకు కారణమైన గొప్ప స్త్రీసత్యవతి. ఆసంతానవతిని అంగీకరించి గాంగేయుని తండ్రి వివాహమాడాడు. కాని పంచభూతాలచేత సాక్ష్యం పలికించి శకుంతల దుష్యంతుడికి శీలాన్ని నిరూపించడం మనకు నచ్చలేదు. అభిజ్ఞాన శాకుంతలము పేరిట కవికులతిలకుడు ఈ పురుషాహంకారినికి మరింత నీరాజనం పట్టాడు. ఈశీలం గొడవ శాపముగా స్త్రీని బాధించే పరిస్థితులు మారటంలేదు. స్త్రీని అడవులపాలుజేసే రామరాజ్యం మనకిష్టము. బాపుబొమ్మల రమణులు ఆయన దర్శకత్వంలో సినిమాలలో అగ్నిప్రవేశము చేయలేదుకాని సీతపాత్రవంటి కష్టాలు పడ్డారని ఆనందించాము.ఆంజనేయుడిని భూమికి రప్పించి స్త్రీపాత్రలకు సానుభూతి చూపిన బాపూ రమణీయము కూడ సీత రావణమారిగానే కాక దశకంఠ రావణుని సంహరించడానికే రాముడిలా కారణజన్మురాలన్నఇతివృత్తాలజోలికి వెళ్ళి స్త్రీశక్తికి పూర్తి న్యాయం చేయలేక పోయారు. లైంగిక ఇతివృత్తాల గురించి కుటుంబసభ్యులు సిగ్గుపడడం మానేసిన నేటి టి.వి సీరియల్సులోని ఇతివృత్తాలు గురించి లలితగారు ప్రస్తావించలేదు. సభ్యసమాజము సిగ్గుపడేలా స్త్రీని రామాయణ విలన్ శూర్పణఖలా ఆకారంఅందంగా హృదయము వికారంగా స్త్రీకి స్త్రీయేశత్రువన్న రీతిగా చిత్రీకరిస్తున్నారు .ప్రేమించినవాడినితనను పెళ్ళాడేలా చేసుకోవడానికి పడేపాట్లు,సంసారాలుకూల్చేయత్నాలు,శిశుహింస జుగుప్సాకరం .ఏఆచారాలు,అనాచారాలు స్త్రీలపాలిటశాపమని భావించి ఉద్యమాలు జరిగాయో వాటికేప్రాముఖ్యమిస్తూ కథానాయికకు సమాజము నిరసించిన ఒకప్పటికష్టాలను చిత్రీకరించడమే లక్ష్యముగా స్త్రీకి ఏడుపే అలంకారముగ పైకికనపడని పురుషాహంకారము స్త్రీసమాజాన్ని అనాగరికజీవితానికి మళ్ళించే ప్రయత్నము,కుట్ర త్రిప్పికొట్టగలిగే స్థితిలో స్త్రీలులేరు. వ్యక్తులుగాకాదు. రచయితలుగా శ్రీశ్రీ, చలాల్ని చదవడం మరిచిపోకూడదు. స్త్రీ సానుభూతి పురుషాహంకారములో కూడ స్త్రీభోగవస్తువు అనే అభిప్రాయము మారలేదు. స్త్రీ మాత్రమె శీలము ఎందుకు కలిగిఉండాలనే దృక్ఫధకోణ అరణ్యరోదన. ప్రతిస్పందనకు స్త్రీలుతిరగబడి బోల్తాపడిన రచనా వికాసమే శ్రీశ్రీ, చలాల కలాలను విమర్శిస్తూ స్త్రీజాతిని వెక్కిరిస్తూ రచనలు చేస్తున్నాయన్నది. కళ్ళుమూసుకున్నా కనపడే నిజం. అదృశ్యదృశ్యకావ్యం.
TVS SASTRY said,
సెప్టెంబర్ 23, 2014 at 7:22 ఉద.
శ్రీ శ్రీ పై ఒక సెక్స్ వర్కర్ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని,దానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించటం అత్యంత దురదృష్టం!చంద్రుడికో మచ్చ అందం,అంత మాత్రం చేత మచ్చలున్న ప్రతి వెధవని చంద్రుడని అనలేం!మహాకవికి స్మృత్యంజలి!
టీవీయస్. శాస్త్రి
వసుంధర said,
సెప్టెంబర్ 23, 2014 at 9:37 ఉద.
పతితలు,భ్రష్టులు, బాధాసర్పదష్టులను ఏడవకండేడవకండి అని ఓదార్చిన మహాకవి- వారి అభిప్రాయాన్ని వినకూడదని భావించడు. వారి అభిప్రాయం ఆయన కవిత్వపు విలువను ఏమాత్రం తగ్గించదన్నది ఎంత నిజమో, వారిని చిన్నబుచ్చడం ఆయన కవిత్వపు విలువను తగ్గిస్తుందన్నది అంత నిజం.