సెప్టెంబర్ 23, 2014

రభస- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 6:05 సా. by వసుంధర

rabhasa poster

ఐఐటిలో సీటు తెచ్చుకో, ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకో- అనే తల్లులతో బోర్ కొట్టిన యువతకు రిలీఫ్ కావాలిగా- అందుకని మన సినిమా తల్లులు కాస్త డిఫరెంటుగా ఉంటారు. మరదల్ని పెళ్లి చేసుకొచ్చి నన్ను సంతోషపెట్టరా అంటుంది ఓ సినిమా తల్లి. ఆ ఆశయ సాధనకోసం దీక్ష పూనిన ఆ పుత్రరత్నం మామయ్యింటికి బయల్దేరాడు. ఆ తర్వాతేం జరిగిందో తెలుసుకుందుకు ‘మామయ్యింటికి దారేది’ అనే టైటిల్‍కి సూటయ్యే రభస సినిమా చూడాలి. ఈ చిత్రం ఆగస్ట్ 29న విడుదలైంది.

ఈ సినిమాని హీరోకోసం చూసేవాళ్లకి- మొత్తమంతా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు. అతడి నటన రొటీన్. ఫైట్లు రొటీన్. డ్యాన్సుల్లో ఫ్లో లేదు. రెండో సగంలో దూకుడు సినిమా తరహా సన్నివేశాలొచ్చినా మహేష్‍బాబు తరహా టైమింగ్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం అతడి పేరుకే తప్ప ప్రతిభకు అద్దం పట్టదు. ఇంకో మాట చెప్పాలంటే ఈ చిత్రానికి ప్లస్సూ, మైనస్సూ కూడా ఎన్టీఆరే. ఇంత రొటీన్ సినిమాని చూడ్డానికి జనమొస్తున్నారంటే కారణం ఎన్టీఆర్. అది ప్లస్సు. ఎన్టీఆర్ సినిమా ఇలాగుందా అని జనం నిరుత్సాహపడడం మైనస్సు.

గ్లామర్ కోసం చూసేవాళ్లకి- ఆ మేరకు మాత్రమే కొంత తృప్తినిస్తారు సమంత, ప్రణీత. సమంత ఎప్పటిలాగే కొన్ని కోణాల్లో చాలా అందంగా, కొన్ని కోణాల్లో ఈమె హీరోయిన్ ఎలాగయిందా అనిపించేలా ఉంది. ప్రణీత ఎన్టీఆర్ పక్కన మరింత పొడుగ్గా కనిపించింది. అందంగానే ఉన్నా నటనకు అవకాశమున్న పాత్రలో కూడా-  తెరమీద కనిపించడమే నటన అనుకున్నట్లు అనిపించింది. ఆమె పాత్ర కూడా చిన్నది.

విలన్‍గా జయప్రకాష్ రెడ్డి, సిబిఐ ఆఫీసరుగా ఆలీ పాత్రలు సిల్లీగా ఉన్నాయి. జయసుధ హావభావాలు మేకప్ దాటి రాలేదు. చాలా చిన్న పాత్రకు డబ్బెక్కువై నాజర్‍ని పెట్టుకున్నారనిపిస్తుంది. డబ్బు తక్కువై నాజర్ నటించే ప్రయత్నం చెయ్యలేదనిపిస్తుంది. శాయాజీ సింధే, అజయ్, నాగినీడు, బ్రహ్మాజీ వగైరాలు అవధుల మేరకు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం గురించి. ఇటీవల చాలా చిత్రాల్లో రెండో సగంలో ఆయన రావడం రివాజయింది. అదే రివాజు, ఇంచుమించు అవే సన్నివేశాలు- అంతా రొటీన్ ఐనా కూడా- ఆయన మొత్తం రెండో సగాన్ని రక్తి కట్టించిన తీరు ప్రశంసనీయం. అదో అరుదైన ప్రతిభ.

ఫొటోగ్రఫీ కన్నుల పండువగా ఉంది. పాటల విషయానికొస్తే- ఆర్కెస్ట్రా ఉంటే కాస్త లయ జ్ఞానం ఉన్నవారెవరైనా ఈ వరసలు కట్టొచ్చు అనిపించేలా ఉన్నాయి. చిత్రీకరణ బాగున్నా, పాటల్లో ఎన్టీఆర్ పేలవంగా అనిపించాడు. రాకాసి రాకాసి అన్న పాట తనే పాడ్డంవల్ల అభిమానులకు ప్రత్యేకంగా అనిపించొచ్చు. అందరికీ కాస్త డిఫరెంట్‍గా అనిపించేది అటు ఇటు ఎటు చూసినా అన్న పాట.

ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కందిరీగ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అది కూడా శ్రీను వైట్ల ఫార్ములాని అనుసరించింది. ఇప్పుడు తన పేరుని నిలబెట్టుకుందుకు కందిరీగ చిత్రాన్నీ, మరికొన్ని హిట్ చిత్రాల్నీఅనుసరించాలనుకున్నట్లు తోస్తుంది. పాత వాటిని అనుసరించకుండా కొత్త కథల్ని, కొత్త సన్నివేశాలతో తియ్యడానికి ప్రయత్నిస్తే ఇతడికి సత్తా ఉన్నదనడానికి నిదర్శనంగా ఈ రభస పనికిరావచ్చు. ఇంత రొటీన్ కథని, కాసేపు థియేటర్లో కూర్చోబెట్టేలా తియ్యడం మెచ్చుకోతగ్గ విషయమే.

ఖరీదైన కొత్త సినిమాలని కాక, ఖరీదెంతున్నా కొత్తగా తియ్యాలని అనుకుంటే- ఈ చిత్రనిర్మాత దర్శకులు మంచి చిత్రాలు కూడా తియ్యగలరు. ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: