Site icon వసుంధర అక్షరజాలం

బూచమ్మ బూచోడు- చిత్రసమీక్ష

Boochamma Boochoddu Movie First Look 2

దెయ్యం కథని భయపెడుతూ, నవ్విస్తూ, సరదాగా, ఉత్కంఠభరితంగా, ఎంతోకొంత అర్థవంతమైన సినిమాగా తియ్యొచ్చునని గీతాంజలి చిత్రం ఋజువు చేసింది. ఇంకోలా కూడా తియ్యొచ్చని నిరూపించడానికన్నట్లు ఈ సెప్టెంబర్ 5న మన ముందుకొచ్చిన చిత్రం బూచమ్మ బూచోడు.

కార్తీక్‌ (శివాజీ) తన భార్య శ్రావణితో (కైనాజ్‌) కొత్తగా కొనుక్కున్న ఫామ్‌ హౌస్‌లో సరదాగా, ఏకాంతంగా గడపడానికి వెళ్లాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. కానీ రాత్రయ్యేసరికి ఉత్తపుణ్యాన గొడవలు పెట్టుకుని ఒకరినొకరు హింసించుకుంటారు. కొంత పరిశోధన తర్వాత- ఆ ఇంట్లోనే మరణించిన ప్రభాకర్, సానోరిటా అనే దంపతులు తమని ఆవహించి ఆ పని చేయిస్తున్నారని అర్థమౌతుంది. ఆ దెయ్యాల్ని వదిలించుకుందుకూ, అక్కణ్ణించి పారిపోవడానికీ కూడా వాళ్లు చేసిన ప్రతి ప్రయత్నమూ బెడిసి కొడుతుంది. వాళ్లు ఫలానా రోజున ఒకర్నొకరు చంపుకుంటామని సవాలు చేసుకుని- ఆ రోజు వచ్చేసరికి ఏమైపోతామోనని బెంగ పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఓ వాస్తు స్పెషలిస్టు (వెన్నెల కిషోర్), భూతవైద్యుడు (పోసాని కృష్ణమురళి), జనాభాలెక్కల ఉద్యోగి (శ్రీనివాసరెడ్డి), దెయ్యాల్ని నమ్మననుకునే బంధువు (బ్రహ్మానందం) ఒకరితర్వాత ఒకరొచ్చి అక్కడ భంగపడతారు. చివర్లో ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ గ్యాంగ్‍ (చంద్ర, ధనరాజ్, వేణు), తాగుబోతు రమేష్‍లతో సుమారు అరగంట ఎపిసోడ్ జరిగేక- కథ క్లైమాక్స్ చేరుకుంటుంది. చివర్లో నేటి యువ దంపతులకి చక్కని సందేశమిచ్చి కథ కంచికి వెడుతుంది. రివ్యూ

కథ నిజంగా బాగుంది. సందేశం నిజంగా చాలా గొప్పది. ఈ మధ్యలోని సన్నివేశాల్లో అతి చక్కనిది- జనాభాలెక్కల సన్నివేశం. అక్కడ సంభాషణలు ఉత్తమ స్థాయి హాస్యంతో నవ్వించాయి. శ్రీనివాసరెడ్డి హుందాగా నవ్వించాడు. మిగతా సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉండి ఉంటే ఈ చిత్రం మాహాద్భుతం అనిపించేది. కానీ వెన్నెల కిషోర్, పోసాని కనిపించిన సన్నివేశాలు చాలా సిల్లీగా ఉన్నాయి. బ్రహ్మానందం నటించిన సన్నివేశం పరమ రొటీన్‍గా ఉండి విసుగనిపిస్తుంది. బ్రహ్మానందం నటనలో జీవముంది కానీ, సన్నివేశం ఆ జీవాన్ని నింపుకునే స్థాయిలో లేదు. ఇక జబర్దస్త్ బృందం కోసం కల్పించిన సన్నివేశాలు పరమ మోటుగా, అసభ్యంగా, చౌకబారుగా- ఆ నటులంటే వెలపరం పుట్టించేలా ఉన్నాయి. ఈ దృశ్యాలప్పుడు ఈ సినిమాకి ఎందుకొచ్చామా అన్న చిరాకు కలుగుతుంది.

శివాజీ తన పాత్రలో నటించాడు అనడంకంటే కనిపించాడు అనడం సబబు. కైనాజ్ మోతేవాలా అందంగా ఉంది. మిగతావారు సన్నివేశాలకు అనుగుణంగా నటించారు.

సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు. పాటలు ఫరవాలేదు. ట్రయిలర్

దర్శకుడు శేఖర్‍చంద్రకు ఇది తొలిచిత్రం. ఆరంభంలో కథనం బాగుంది. దెయ్యాలకొంపలో ఆరంభ దృశ్యాలు హిందీ చిత్రం రాగిణి ఎంఎంఎస్ ని గుర్తు చేసినా అంతకంటే తక్కువ హాట్‍గా తియ్యడం అభినందనీయం. ముగింపులో సందేశంతోపాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా బాగుంది. అయినా చిత్రం బాగోలేదు. ముగింపు కూడా వినడానికి ఉన్నంత సమర్థనీయంగా చూడ్డానికి అనిపించదు. గీతాంజలి చిత్రంలా పకడ్బందీ స్క్రీన్ ప్లే తయారు చేసుకోగలిగితే ఈ దర్శకుడిలో సత్తా ఉంది. మరో అవకాశం వచ్చి అతడు తన సత్తా నిరూపించుకుంటాడని ఆశిద్దాం.

చివరగా ఒక మాట. భారీ వ్యయంతో పెద్ద హీరోలతో తీసిన- హీరోల సొంత డబ్బా సినిమాలకంటే- ఇలాంటి సినిమాలు మెరుగు అని మాకు అనిపించింది. చివర్లో హాస్యం పేరిట పాల్పడిన చౌకబారుతనాన్ని తొలగిస్తే ఈ చిత్రాన్ని మరోసారి కూడా చూడొచ్చు.

Exit mobile version