అక్టోబర్ 3, 2014

మంచిని పంచుకోండి- ఆంధ్రభూమి దినపత్రిక

Posted in సంగీత సమాచారం at 3:11 సా. by వసుంధర

మళ్లీమళ్లీ అదే… – నాకు నచ్చిన పాట/సినిమా

picture evergreen songs

తెలుగు చలన చిత్రాలలో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకులు చూసారు. అన్ని చిత్రాల్లో కొన్ని చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. హృదయాన్ని ఏ పిల్ల సమీర తీరాలకో తీసుకెళతాయి. కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా ఉంటే, మరికొన్ని నిత్య నూతనంగా భావించే ప్రేమలాలిత్యంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసులలో తొణికిసలాడుతాయి. ఏ సినిమా ఏ ప్రేక్షకుడికి ఎలా నచ్చుతుందో తెలియదు. ఒక్కసారి సినిమా చూశాక ఆ చిత్రం నిరంతరం ప్రేక్షకుణ్ణి వెంటాడింది అంటే అది ఉత్తమ చిత్రమే. అదేవిధంగా ఒక్కసారి మన అద్భుతమైన సంగీత దర్శకులు బాణీలు కట్టిన పాటలు వింటే, మళ్లీమళ్లీ అదే పాట చెవులలో మారుమ్రోగుతుంటే, అది ఉత్తమమైన బాణి. సాహిత్యపరంగా అద్భుతంగా తీర్చిదిద్దిన మాటలు. తమ గానంతో గాయనీ గాయకులు ఆ పాటకు అమరత్వాన్ని చేకూరుస్తారు. అటువంటి గొప్ప పాటలు సినిమాలు మనకు కొదవలేదు. అటువంటి పాటలకు లేక చిత్రాలకు వేదికే ఈ శీర్షిక. మీకు నచ్చిన పాట కానీ, చిత్రం కానీ ఈ శీర్షికలో మీరు పాఠకులతో మీ భావాలు పంచుకోవచ్చు. అయితే, మీకు ఆ పాట కాని, ఆ చిత్రం కాని ఎందుకు నచ్చింది అనే విషయాన్ని సవివరంగా రాయాల్సి వుంటుంది. మీకు నచ్చిన ఆ పాటను కానీ, చిత్రాన్ని కానీ తోటి పాఠకులతో పంచుకోవడానికి ఇది ఉత్తమమైన వేదిక. ఇక ఆలస్యమెందుకు మీకు నచ్చిన పాట లేక సినిమా గూర్చి సవివరంగా వ్రాసి పంపమని ఆహ్వానిస్తున్నాం.
మా చిరునామా
ఎడిటర్, వెన్నెల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03

మళ్లీ మళ్లీ ‘మల్లీశ్వరి’ (03/10/2014)
ఎన్టీఆర్, భానుమతి నటించిన అపూర్వ ప్రేమకాథా చిత్రం మల్లీశ్వరి అంటే వల్లమాలిన ఇష్టం. చిత్రంలోని ప్రతి పాటా ఓ అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా మల్లీశ్వరి అనగానే వెంటనే మదిలో మెదిలే మధుర తరంగం ‘మనసున మల్లెల మాలలూగెనె’. జవం జీవం కలిగిన సాహిత్యం గీతం జతగా సంగీతం వెరసి ఓ అద్భుతం! వాట్ ఎ వండర్ సాంగ్.. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి అది నిత్యనూతనమై వెలుగుతుందంటే అతిశయోక్తి కానేకాదు. భానుమతి పాటల్లో ఇది ఓ కలికితురాయి. ఈ పాటకు డ్రమ్స్ హోరు అస్సలు ఉండదు గాక ఉండదు. ఒకటి రెండు లాలిత్యమైన వాద్య పరికరాలు జత కలిసి పాట హొయలు పోతుంది. హాయిగా వీనులకు విందు చేకూరుస్తుంది. ప్రశాంత వాతావరణంలో తక్కువ శబ్దంలో పెట్టుకొని అలా కళ్లు మూసుకొని పడుకొంటే పాటలోని పరవశంతో పాటలోని భానుమతి గాత్రం శ్రోతను ఓలలాడిస్తుంది. జోకొడుతుంది. పరశింపజేస్తుంది. ఆర్ద్రతకు మనసు తడిసి ముద్దైపోతుంది. అదీ సంగీతం అంటే! అదీ సాహిత్యం అంటే!! అదీ గానం అంటే!! సంగీతపు రుచి తెలిసినవాడు సాహిత్యం విలువ తెలిసినవాడు గొంతులోని గానామృతానికి పరవశించిపోక ఏం చేయగలడు? ఆకర్షించడం అంటే అది పాటకు తగ్గ సన్నివేశం కూడా సినిమాలో పరాకాష్ఠగా ఉంటుంది. స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగు సంగీతంతో జత కలిసింది. దానికి గానం సై అంది. ఇంకేముంది, వింటున్న శ్రోత మనసు మూగబోయింది. అంచెలంచెలుగా మనిషి మదిని నిట్టనిలువుగా దోచేస్తాయి. ఫలితంగా వారెవ్వా అంటూ అప్రయత్నంగా పెదాలనుంచి పదాలు దూసుకువస్తాయి. అజరామరమైనది, అద్భుతమైన సోయగాలతో అలరారింది ఈ పాట. కీర్తిశేషురాలైన భానుమతి కీర్తిని ఈ పాట ఎల్లకాలం కాపాడుతుంది. ఆ మహామహులందరూ కళ్లముందు కదులుతుంటారు.
-కొంగర ఉమామహేశ్వరరావు, తెనాలి

 

 

Leave a Reply

%d bloggers like this: