Site icon వసుంధర అక్షరజాలం

మహాకవి ‘చెట్టు’

ఈ క్రింది వ్యాసానికి లంకె అందించిన శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

వ్యాసకర్త:  డా.వై. కామేశ్వరి (9441778275)

ఆధునిక కవిత్వంలో పరిశోధన చేస్తున్న రోజుల్లో కీ.శే. మల్లవరపు విశ్వేశ్వరరావు గారిని, ఆయన భార్య కీ.శే. శ్రీమతి మల్లవరపు విజయలక్ష్మిగారిని  తరచు కలుస్తూ ఉండేదాన్ని. ప్రేమమయ కవిత్వం రాసే భావకవులంటే (వ్యక్తులుగా) శ్రీమతి విజయలక్ష్మిగారికి అంత మంచి అభిప్రాయం ఉండేదికాదు. కానీ ఆవిడ విప్లవ\కవి శ్రీశ్రీ గారి గురించి ఎంతో  ఉన్నతంగా, తన భార్యను ఆయన పువ్వుల్లో పెట్టి ప్రేమగా చూసుకొనేవారని ఎంతో అభిమానంగా చెప్పేవారు. శ్రీశ్రీ అనగానే విప్లవం, జ్వాలలు, ఎత్తిన పిడికిళ్ళు, మహోగ్ర నినాదాలే  గుర్తుకు వస్తాయి. అంత ప్రేమాస్పదుడయన వ్యక్తి   రచనల్లో  సామ్యవాద భావాలతో పాటుగా  ఏవైనా సౌమ్యభావాలు కూడా  కనిపిస్తాయా అని పరిశీలిస్తే  దొరికిన సుమసౌరభాలివి.  చెట్టంటే చెట్టుకవి ఇస్మాయిల్‌ కేకాదు  విప్లవకవి శ్రీశ్రీకి కూడా ఎంతో ఇష్టం.

ప్రయాణం

అందుకే చెట్టంటే ఎంతో నాకిష్టం.

ఎక్కడికీ చెట్టు ఎప్పుడూ వెళ్ళదుకాబట్టి.

ఇవాళ ఉదయ ట్రాముకోసం తపస్సుచేస్తూ చెట్టుకింద నిలబడ్డాను. …..

చెట్టులో నువ్వుచూసే నిశ్చలత్వం శిలదీకాదు, శవానిదీకాదు. 

అది కదలదనుకోవడం భ్రమ.   

క్షణం క్షణం చెట్టు కదుల్తూనే ఉంటుంది.

అయితే దాని ప్రయాణం ఔన్నత్యం  వేపు.

ఆకాశాన్ని అందుకోవాలని  ప్రతిచెట్టూ ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది.

ధ్వనికన్నా ఎక్కవ వేగంతో ప్రయాణం చేసే విమానం ధన్యమైనదే!

కాని శ్రావణ మంగళవారపు  నోమురోజున సెనగగింజలో నుండి

ఎదిగే మొక్క సాధించే వేగానికి నేను ఆశ్చర్యం పొందకమానలేను. 

చిన్నప్పుడు నేను పారేసిన చింతపిక్కల సంతానం

ఇప్పుడు సకల ప్రపంచంలో నిండిపోయిందన్న తలంపు

కేవలం నిరాధారమైనది కాదు. 

శ్మశానాలమీద వాన కురిసినప్పుడు 

ఎంత వేగంగా పచ్చగడ్డి ఎదుగుతుందో ,

ఎందుకు నేను వేరే చెప్పడం!

నీ నీ ఒక్కొక్క ఉదాహరణకి ఒక్కొక్క చెట్టుని చూడగలవు.

కోరికలెల్ల ధూళిబడ  గోల్పడి

దిక్కుల శూన్య దృక్కులం జీరి

యెటో వృథా శిశిర జీవనభారము

బుచ్చుచున్న  భూమిరుహ మేను…

అన్నాడొక కవి

శ్రీ మంతంబుగ స్వాంతముల్ వికసిలన్‌

సేమంతి సీమంతినుల్‌

హేమంతుడను కాంతురాక కొరకెంతేవింత మీరన్‌

వనీభూమిన్‌ మేననలంకరించుకొను కెంపుల్‌ ,నీలముల్‌,వజ్రముల్‌

గోమేధంబులు నాచెలంగె పలు రంగుల్‌  గల్గు పుష్పావళుల్‌. 

అన్నాడు ఇంకో కవి.

ఇక్కడ నా ఉద్దేశంలో కొమ్మా, రెమ్మా, మొగ్గా, ముల్లూ, ఆకూ అన్నీ చెట్టే.

అందుకే చెట్టంటే ఎంతో నాకిష్టం.

ఎక్కడికి చెట్టు ఎప్పుడూ వెళ్ళకపోతేనేం?

ఏరోప్లేనులో ఎక్కినా ఎక్కడికి వెళ్ళగలం మనం?

ఎక్కడికి వెళ్ళినా చెట్టు ఎప్పుడూ మనతో, మనలోనే ఉంది.

ఇందుకే నాకు నాకంటే  చెట్టెంతో  ఇష్టం.

తెలుగు స్వతంత్ర,వారపత్రిక,29-10-48.

Exit mobile version