అక్టోబర్ 6, 2014

లౌక్యం- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:08 సా. by వసుంధర

loukyam

ఒక ఢీ. ఒక రెడీ. ఒక పరుగు. ఒక దూకుడు. అలాంటి మరికొన్ని. అన్నింటినీ అచ్చం అలాగే కానీ, కాస్త అటూ ఇటూగా కానీ మళ్ళీ చిత్రంగా తీసి- కొత్తది అనిపించుకుందుకు కొంత లౌక్యం కావాలి. అలాంటి లౌక్యం ఒకటి అదే పేరుతో ఈ సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వరంగల్‍లో పేరుమోసిన రౌడీ బాబ్జీ (సంపత్). అతడికి తన ఇద్దరు చెల్లెళ్లూ అంటే ప్రాణం. పెద్ద చెల్లెలు (శ్యామల) కి అన్న కుదిర్చిన సంబంధం ఇష్టం లేదు. ఆమెని ఇంట్లోంచి తప్పించి హైదరాబాదులోని ప్రియుడితో కలుపుతాడు వెంకీ (గోపీచంద్). వెంకీ కోసం బాబ్జీ మనుషుల వేట మొదలైంది. ఈలోగా హైదరాబాదులో ఓ పెద్ద రౌడీ సత్య (రాహుల్ దేవ్) చెల్లెలు చంద్రకళ (రాకుల్ ప్రీత్ సింగ్) ని ప్రేమిస్తాడు. చంద్రకళ కూడా అతడితో ప్రేమలో పడ్డాక- బాబ్జీ, సత్య అన్నదమ్ములని తెలిసింది. అదే సమయంలో బాబ్జీ బద్ధ శత్రువు కేశవరెడ్డి (ముఖేష్ రిషి) చంద్రకళపై హత్యాప్రయత్నం చేస్తే వెంకీ కాపాడి బాబ్జీ ఇంట్లో స్థానం సంపాదించాడు. తనపై పీకెలదాకా కోపంతో ఉన్న బాబ్జీకి తానెవరో తెలియనివ్వకుండా, సమస్యని శాంతియుతంగా వెంకీ పరిష్కరించడం మిగతా కథ. విడియో రివ్యూ

కథ పాత చింతకాయ పచ్చడి. ఐతే చకచకానూ, ఆసక్తికరంగానూ, వినోదభరితంగానూ నడిచిపోతూ ప్రేక్షకులకు చక్కని పథ్యంలా పనిచేస్తుంది. సంభాషణలు పదునుగానూ, పసందుగానూ, హాస్యభరితంగానూ, గొప్పగానూ ఉండి కథకు వన్నెలు దిద్దాయి.

ఈ కథను రక్తి కట్టించిన ముఖ్యనటుడు బ్రహ్మానందం. అతడికీ తరహా పాత్ర (డ్రైవర్ సిప్పీ) కొత్తది కాకపోయినా, కొత్తగానే అనిపింపజేసే టైమింగు, సన్నివేశాలు, నటనా ప్రతిభ ఆహా, ఓహో! ఇంచుమించు అతడికి సాటివచ్చిన మరో నటుడు పృథ్వీ (బయిలింగ్ స్టార్ బబ్లూ). ఆ తర్వాత చెప్పుకోతగ్గ నటి రాకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్‍ప్రెస్‍లో- ‘ప్రార్థన ఇక్కడ’ అని ఎంత ముద్దుగా అందో అంత ముద్దుగానూ ‘చంద్రకళ ఇక్కడ’ అంది. ఈ చిత్రానికి హీరోయిన్ ఓ పెద్ద ప్లస్సు. గోపీచంద్ ఒడ్డూ పొడుగూ వెంకీ పాత్రకు బాగా నప్పింది. అందంగా, లేతగా కనిపించాడు. డ్యాన్సులు, కామెడీ డైలాగ్ టైమింగు, అక్కడక్కడ నటన కాస్త తీసికట్టుగా అనిపించినా- అతడీ చిత్రానికి మైనస్ అనిపించడు. ఢీ చిత్రంలో శ్రీహరి స్థాయి పాత్రను విలన్ సంపత్ అతి సాధారణం అనిపించేలా చెయ్యడం అసంతృప్తిని కలిగించినా, అదీ మైనస్ కాదు.

మిగతా నటీనటులందరూ అవధుల మేరకు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు.

పాటలు ఫరవాలేదు. సావరియా, నిన్ను చూడగానే పాటలు మరోసారి వినబుద్ధేస్తాయి. తేరే బ్యూటిఫుల్ ఆంఖే పాట గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో టైటిల్ సాంగ్‍ని గుర్తు చేస్తుంది.

పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉన్నా చాలావరకూ హీరో, కొంతవరకూ హీరోయిన్ కూడా నృత్యాల్లో మైనస్.

ఈ చిత్రానికి అసలు హీరో దర్సకుడు శ్రీవాస్. ఆద్యంతం రక్తి కట్టిన ఈ చిత్రం మొదటి సగమే ప్రేక్షకుడికి చాలా బాగుందనిపిస్తే, రెండవ సగం చాలా చాలా బాగుందనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుణ్ణి ఆద్యంతం ఇంతలా నవ్వించి థియేటర్నించి సంతోషంగా పంపిన భారీ చిత్రం మరొకటి లేదనవచ్చేమో! కథ పాతదైతేనేం- గోలీ మార్! సినిమా చాలా బాగుంది. ఎందుకు బాగుందీ అంటే ఆ క్రెడిట్ దర్శకుడిదే!

ఐతే తదుపరి చిత్రాలలో కొత్త కథకీ, సృజనాత్మకతకీ ప్రయత్నించకపోతే మాత్రం- ఈ దర్శకుడు కూడా చాలామంది పేరున్నవారికిలాగే మరుగున పడిపోయే అవకాశముంది. అలా జరుగదని ఆశిస్తూ శ్రీవాస్‍కి శుభాకాంక్షలు అందిద్దాం.

Leave a Reply

%d bloggers like this: