అక్టోబర్ 10, 2014

ఎక్స్‍ట్రా జబర్దస్త్

Posted in టీవీ సీరియల్స్ at 3:32 సా. by వసుంధర

ఒక పక్క పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో తన అభిరుచిని నిరూపించుకుంటున్న ఈటీవీ- సంసారపక్షం సినిమాలో ఐటమ్ సాంగ్ చూపించినట్లు- టిఆర్‍పిలకోసం ఆరంభించిన కొత్త కార్యక్రమం జబర్దస్త్. దీన్ని నిర్వహించేది మర్యాదకు మారుపేరులా హుందాగా కనిపించే నాగబాబు, ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోనూ రాణిస్తున్న నటి రోజా.  ఈ కార్యక్రమం ఉద్దేశ్యం నవ్వించడమే ఐనా అందుకు ఆదర్శంగా మునిమాణిక్యం, మొక్కపాటి, చిలకమర్తి ప్రభృతుల్ని ఎన్నుకుంటే బాగుందేది. లేదా నేటి జంధ్యాల శ్రీవారికి ప్రేమలేఖ, అహ నా పెళ్లంట చిత్రాల్ని తీసుకున్నా బాగుండేది. మగవాళ్లు ఆడవేషం వెయ్యడం, అసభ్యంగా మాట్లాడ్దం, చెంపదెబ్బలు కొట్టడం, కాళ్లతో తన్నడం, అక్రమ సంబంధాల్ని చతురోక్తులుగా వాడడం- ఇదీ ఇందులో ఎక్కువ భాగం హాస్యం. నటీనటుల ప్రతిభ అసమానంగా అనిపించినా- అసభ్యత పెచ్చు మీరి వారిపట్ల జుగుప్స కూడా కలుగుతోంది. ప్రజాస్వామ్యం మనుగడకు వైను షాపులు అవసరపడ్డట్లు టీవీ చానెల్సు మనుగడకి ఇలాంటి కార్యక్రమాలు అవసరమేమో తెలియదు. వైను షాపుల్ని తప్పు పట్టలేం కాబట్టి, వీటినీ తప్పించుకోవడమే తప్ప తప్పు పట్టలేం. ఆపైన జనం విరగబడి చూస్తుంటే ఇంకేమనగలం? యాంకరుగా తన అభిరుచిని నిరూపించుకున్న ఉదయభాను కూడా ఇలాంటిదే తడాఖా అనే కార్యక్రమం ప్రారంభించి అసభ్యతలో జబర్దస్త్‍కి పోటీ పడడమే ఆశయంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలు నిర్వాహకులకీ, చానెల్‍కీ, నటీనటులకీ  కూడా మచ్చగానే మిగిలిపోతాయన్న విషయం విస్మరించలకూడదు. ఏది ఏమైనా దీనికి లభించిన జనాదరణ కారణంగా ఒక జబర్దస్త్ చాలదని ఈ రోజునుంచి  ఎక్స్‍ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని అదనంగా మొదలెడుతున్నారు ఈటీవీ వారు.  ఈ కార్యక్రమంలో 10-20 శాతం అంశాలు ఆరోగ్యకరమైన హాస్యంతో అలరిస్తూండడంవల్ల క్రమంగా- ఆ శాతం పెరుగుతుందన్న ఆశకు అర్థముంది. ఎటొచ్చీ ఎక్స్‍ట్రా కబర్దస్త్‍లో ఆ ఎక్స్‍ట్రా అసభ్యతకో, ఉత్తమ హాస్యానికో మరి! ఈ విషయమై ప్రేక్షకుల స్పందన కోరుతున్నాం. ఎక్ఫ్‍ట్రా జబర్దస్త్ గురించిన ప్రకటన ఈ క్రింద ఇస్తున్నాం.

jabardast

                  ఈనాడు

 

1 వ్యాఖ్య »

  1. మానవతా విలువలకు విలువిచ్చే రామోజీ గారి ప్రసార మధ్యమములో జుగుప్స కలిగించే కార్యక్రమము రావటం దానిని గూర్చి తమ పత్ర్కలో ప్రచారము చేయటం విచారకరం.
    చదువులమ్మ ఒడిలో ఉండవలసిన బాలలు వికృతముగా, కౄరముగా కనిపించే నృత్యాలు చేయటం అవి రామోజీగారి దృశ్యమాధ్యములో ప్రసారము చేయటం విడ్డూరం. వాణిజ్యానికి విలువలకు తిలోదకాలు ఇవ్వక్కరలేదేమో ! ఒకసారి వెనుకకు తిరిగి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగుతల్లీ !


Leave a Reply

%d bloggers like this: