అక్టోబర్ 14, 2014

ఆగడు- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:27 సా. by వసుంధర

agadu poster

http://www.idlebrain.com/download/aagadu/26aagadu800.html

1920లలో హాస్యానికి మారుపేరుగా సినీరంగంలో భాసిల్లాడు చార్లీ చాప్లిన్. ఒకసారి ఆయనను అనుకరించడంలో పోటీ జరిగిందిట. అందులో చార్లీ మారువేషంతో పాల్గొంటే- వేరెవరికో మొదటి బహుమతి వస్తే, ఆయనకు రెండవ బహుమతి వచ్చిందిట. ఢీ సినిమాతో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు శ్రీను వైట్ల. ఇటీవల అదే ఒరవడితో ఎందరో దర్శకులు సినిమాలు తీసి కొందరు ఘన విజయాన్నీ, కొందరు ఒక మాదిరి విజయాన్నీ చవి చూశారు. వారి సినిమాలముందు వెలవెల బోయింది ఈ సెప్టెంబర్ 19న విడుదలైన శ్రీను వైట్ల చిత్రం ఆగడు.

కథ షరా మామూలేగా పాత చింతకాయ పచ్చడి. రాజారావు (రాజేంద్రప్రసాద్) అనే ఓ పోలీస్ ఇనస్పెక్టర్ శంకర్ అనే అనాథ బాలుడికి ఆశ్రయం ఇచ్చాడు. రాజారావు కుమారుడు భరత్ ఆవేశంలో ఓ హత్య చేస్తే, ఆ నేరం తనమీద వేసుకుని జైలుకెళ్లాడు శంకర్. నిజం తెలియక రాజారావు శంకర్‍ని అసహ్యించుకుంటాడు. శంకర్ జైల్లోనే చదువుకుని పెద్దవాడై పోలీస్ ఇనస్పెక్టరై ఎన్‍కౌంటర్ స్పెషలిస్టుగా (మహేష్‍బాబు) పేరు తెచ్చుకుంటాడు. శంకర్- దామోదర్ (సోనూ సూద్) అనే ఓ పెద్ద దాదాతో తలపడి- అతడి అవినీతి కార్యకలాపాలన్నీ ఆపించి, పోలీసుల పరువు పెంచడం మిగతా కథ. ట్రయిలర్

మొదటి సగంలో హీరో విలన్ అనుచరులు ముగ్గుర్ని వరుసగా ట్రిక్ చెయ్యడం, మిఠాయి దుకాణం నడిపే హీరోయిన్ (తమన్నా)తో ప్రేమ నడపడం- కామెడీ ట్రాక్‍లా వేగంగా నడిచిపోతుంది. అంత ఆసక్తికరంగా అనిపించకపోయినా, మహేష్ బాబు సమక్షంవల్ల మరీ నిరాశ కలుగదు. రెండో సగంలో బ్రహ్మానందం ప్రవేశించి తన మార్కు కామెడీని ప్రదర్శిస్తాడు. మహేష్ బాబు అతణ్ణి ఉపయోగించుకుని విలన్‍కి ఉన్న రాజకీయ, పోలీసు బలంపై దెబ్బ తీస్తాడు. రెండో సగం ఎంత చప్పగా ఉన్నదంటే- జనం స్మృతిపథంలో వెనక్కి వెళ్లి మొదటి సగాన్ని కూడా ఏవగించుకుంటారు.

ఈ చిత్రంలో డైలాగులు చాలా బాగున్నాయి కానీ వాటిని వాడిన విధం బోరు కొడుతుంది. హీరో చేత ఒకటి రెండు నిముషాల పొడవుండే పిట్టకథల్ని డైలాగుల్లో చెప్పించారు. వింటూ వంట పట్టించుకోవడం చాలా కష్టం అనిపించేటంత వేగంగా చెప్పడంవల్ల ఆ డైలాగ్స్ వృథా అనుకోవచ్చు. కథనంలో నవ్వించాలన్న తాపత్రయం ఎక్కువ కనిపిస్తుంది. ఆ తాపత్రయం ఏ దశకు చేరిందంటే చివర్లో బ్రహ్మానందం చేత రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించారు. డ్యాన్స్ కి నవ్వు రాదు కానీ, అందుకు వాడిన పేలవమైన గ్రాఫిక్స్ నవ్వు తెప్పిస్తాయి.

నటీనటుల్లో మహేష్ బాబు చూడ ముచ్చటగా ఉన్నాడు. సినిమా అంతా తనే ఉన్నప్పటికీ- సినిమాలో భాగంగా కాక, విడిగా మాత్రమే బాగున్నాడు. యాక్షన్ సీన్సులో రాణించినా, డ్యాన్సుల్లో పేలవంగా అనిపించాడు. తమన్నా అందానికి సర్టిఫికెట్ అవసరం లేదు కానీ, ఈ చిత్రంలో అక్కడక్కడ అదోలా అనిపించింది. విలక్షణమైన హాస్యపాత్ర లభించినా, గ్లామరుకి అలవాటుపడ్డం వల్లనేమో, నటనకు బదులు అందాలనే ప్రదర్శించింది. సోనూ సూద్‍ని చూస్తుంటే ఏదో పాత చిత్రం చూస్తున్నట్లే మరీ రొటీనుగా అనిపించింది. బ్రహ్మానందం కామెడీలో పాత సినిమాల లోతు లేదు. ఏదో చూడాలి, చూశాం అంతే! గతంలో నటకిరీటిగా అలరించిన రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంలో సాధ్యమైనంత పేలవంగా నటించాడు. మిగతా పాత్రల్లో పోసాని, ఆసిష్ విద్యార్థి బాగా గుర్తుంటారు.

పాటలు సినిమానుంచి బయటకు వచ్చేలోగానే మర్చిపోయే అవకాశముంది. చిత్రీకరణ బాగుంది. ఐటమ్ సాంగ్‍లో కనిపించిన శృతిహాసన్ వస్త్రధారణలో అలనాటి సిల్కుస్మితని మరిపించింది. వేషాలు దొరక్కపోతే- ఐటమ్ డ్యాన్స్ గర్ల్ గా గుర్తింపు పొందడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తాపత్రయం ఆమెలో కనపడింది.

పేరుకి ఈ సినిమాకి విలన్ సోనూ సూద్. కానీ అసలు విలన్ దర్శకుడు. మహేష్ బాబు స్థాయి హీరోని కేవలం కథ, కథనంతో చిత్తు చేసిన ఘనత ఆయనది. ‘మహేష్ బాబు సినిమాకొచ్చి, కొత్త సినిమా చూదమంటే- దూకుడు, గబ్బరు సింగుల ఎంగిలంటున్నాయి బాబోయ్’ అని ప్రేక్షకుల్ని పరుగెట్టేలా చేశారు.

శ్రీను వైట్లవద్ద ఒకే కథ ఉన్నదనీ, ఆయన సరుకైపోయిందనీ ఈ చిత్రం చూసిన చాలామంది అంటున్నారు. అది నిజం కాదని ఆయన తన తదుపరి చిత్రంలో నిరూపించుకోగలరని ఆశిద్దాం.

Leave a Reply

%d bloggers like this: