వసుంధర అక్షరజాలం

సౌందర్యలహరి- ఈటివి

Balakrishna-Lodges-Case-On-K-Raghavendra-Rao-1994

తెలుగు చిత్రసీమ గర్వించతగ్గ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. ఆయన తొలి చిత్రం బాబు మేము చూడలేదు. మలి చిత్రం జ్యోతి– ఆయన దర్సకత్వ ప్రతిభకు నిదర్శనం. అప్పట్లో ఆయన చిత్రాలు చూడాలని ఎదురుచూసేవాళ్లం. ఆయన నాల్గవ చిత్రం ఆమె కథ నిజంగా ఒక అద్భుతం. ఈ చిన్న చిత్రాల అనంతరం ఆయన కృష్ణంరాజు హీరోగా నిర్మించిన అమరదీపం చిత్రానికి- మాతృక ఒక మలయాళ చిత్రం ఐనా- ఆ చిత్రం దర్శకుడిగా ఆయన పరిధికి నిదర్శనం. తదుపరి ఆయన అన్నపూర్ణా వారికి ప్రేమలేఖలు చిత్రం తీశారు. అందులో ఆయన విలన్‍గా అనంతనాగ్‍ని చూపిన తీరు విలక్షణం, అపూర్వం. ఆ వెంటనే ఆయన మురళీ మోహన్, జయచిత్రలతో తీసిన కల్పన– హిందీ చిత్రం అనామికకి అనుసరణ. హిందీ చిత్రంలో అస్రానీతో నడిచిన కామెడీ ట్రాక్‍ని, ఆయన పూర్తిగా మార్చిఅల్లు రామలింగయ్య, రావుగోపాలరావులతో పండించిన హాస్యం ఆయన కల్పనాచాతుర్యానికి హాస్యస్ఫూర్తికి మెచ్చుతునక. ఆ చిత్రం తర్వాత ఆయన అడవి రాముడు చిత్రం తీశారు. అప్పట్నించి సృజనాత్మక దర్శకుడు పూర్తిగా వ్యాపారాత్మక దర్శకుడై- అన్నీ ఇన్నీ అనలేని హిట్ చిత్రాలు తెలుగులోనే కాక, హిందీలోనూ తీశారు. అప్పట్లో వయసు మీరుతున్న నందమూరి తారకరామారావున బాక్సాఫీసు నటుడుగా వెలిగిపోవడానికి కారణభూతుల్లో ఈయన కూడా ఒకరు. వ్యాపార చిత్రాల్లోనూ, తనదైన సృజనాత్మకతను నిరూపించుకున్నా- అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి చిత్రాల్లోకూడా- వ్యాపారాత్మకతకి లభించిన ప్రాధాన్యం ఆయన అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించినా- స్వచ్ఛమైన వినోదానికి ఆయన చిత్రాలని మించినవి లేవన్నది నిర్వివాదాంశం. అందుకు ఒకతా రెండా లెక్కలేనన్ని ఉదాహరణలు.

దర్శకేంద్రుడిగా పేరుకెక్కిఫ రాఘవేంద్రుణ్ణి బుల్లితెరపై పరిచయం చేస్తున్న కార్యక్రమం సౌందర్యలహరి. ఈ కార్యక్రమం ఈటివిలో ప్రతి ఆదివారం రాత్రి 9.30కి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. సెట్‍పై నటీనటులనుంచీ, సాంకేతిక నిపుణులనుంచీ  అద్భుత ప్రదర్శనను రాబట్టే దర్శకేంద్రుడు బయట మౌనముని అట. అందుకని ఈ కార్యక్రమానికి మకుట గీతం- ‘మొదటిసారి మౌనం మాట్లాడుతోంది’. మాకు తెలిసి ప్రతిభావంతులైన సినీదర్శకులు చాలామంది మౌనమునులే. పేర్లు చెప్పనవసరం లేదనుకుంటాను. వాళ్లలో ఎవరు బుల్లితెరపై మాట్లాడినా ఇదే మకుట గీతం వర్తిస్తుంది. ఎక్కడ మాట్లాడాల్సిన వాళ్లు అక్కడ మాట్లాడితేనే అందం అని తెలిసినా- ఆయననుంచి ఈ కార్యక్రమంద్వారా దర్శకత్వపు చిట్కాలు, అలోచనలు, విశేషాలు తెలుసుకోవచ్చు. ఆ మేరకు మొదటి కార్యక్రమంలో- జ్యోతి చిత్రానికి సంబంధించిన విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా వివిధ చిత్రాల్లో ఆయన చిత్రీకరణకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు బయటికొచ్చాయి. ఐతే వీటిలో ఎక్కువగా- ఆయన తీసిన శృంగార దృశ్యాల ప్రస్తావన ఉంటోంది. యువతుల బొడ్డుపై పూలు, పళ్లు వెయ్యడం ఆయన సంతకంగా చెప్పబడుతోంది. ఆయన సృజనాత్మకతలోని వ్యాపారాత్మకతకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. కార్యక్రమం ఆయన నిర్వహణలోనే నడుస్తున్నది కాబట్టి అది ఆయనకు ఆమోదయోగ్యమే అనుకోవాలి. రాఘవేంద్రుని చిత్రాల్లో వ్యాపారాత్మకత అందరికీ తెలిసినదే. మిగతా విషయాల ప్రస్తావన ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరం, రసవత్తరం, ప్రయోజనాత్మకం చేసేది. మున్ముందు రాఘవేంద్రుని బహుముఖప్రజ్ఞకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని ఆశిద్దాం.

ఈ కార్యక్రమానికి మొదటి యాంకర్ లాస్య. ఆమె ముద్దుగా, కొత్తగా ఈ కార్యక్రమాన్ని నడిపించింది. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆమెను మార్చి అశ్విని అనే మరో యాంకర్ని రెండు ఎపిసోడ్స్‍కి యాంకర్‍గా తెచ్చారు. ఆమె ప్రదర్శన అంతంతమాత్రం. ఆ తర్వాతనుంచి యాంకర్సులో తనకు తనే సాటి అనిపించుకున్న సుమని తీసుకొచ్చారు. వివిధ కార్యక్రమాల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆమె ప్రదర్శన ఈ కార్యక్రమానికి సంబంధించిఇంతవరకూ చాలా పేలవంగా ఉంది. సౌమ్యని కొనసాగిస్తే బాగుంటుందని స్వాభిప్రాయం.

దర్శకులైనవారూ, దర్శకులు కావాలనుకుంటున్నవారూ, ప్రతిభ గల దర్శకుల గురించీ- దర్శకత్వపు ప్రతిభ గురించీ తెలుసుకోవాలనుకునేవారూ, హోల్ మొత్తంగా సినీ ప్రేమికులూ తప్పక చూడాల్సిన ఈ కార్యక్రమం మరింత కాలం కొనసాగుతుందని కోరుకుందాం.

Exit mobile version