అక్టోబర్ 25, 2014

గోవిందుడు అందరివాడేలే- చిత్రసమీక్ష

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:58 సా. by వసుంధర

poster govindudu

ఒక పెద్ద కుటుంబం. గ్రామీణ వాతావరణం. అభిమానాలు, ఆపేక్షలు, అపార్థాలు, మధ్యతరగతి విలువలు, పట్టుదలలు. ఉత్తరాదివాళ్లలా వేడుకలకు నాట్యాలు చేస్తూ పాటలు పాడే దక్షిణాది గృహిణులు, పెద్దమనుషులు. ఇది కృష్ణవంశీ దర్శక ముద్ర. దానికి నిర్మాత బండ్ల గణేష్ భారీతనాన్ని జత చేసుకుని ఈ అక్టోబర్ 1న మన ముందుకొచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడేలే.

ఈ చిత్ర కథలో ఓ పల్లెటూరు. ఆ ఊరే తన ఇల్లనుకునే ఒక ఆదర్శ గంభీరమూర్తి బాలరాజు. గ్రామానికి ఓ ఆస్పత్రి కట్టించడం ఆయన కల. అందుకని తన పెద్ద కొడుకు చంద్రశేఖర్‍ని డాక్టర్ కోర్సులో జేర్పించాడు. తీరా అస్పత్రి భవనం సిద్ధమయ్యేసరికి ఆ కొడుకు చదువు పూర్తి చేసుకుని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని విదేశాలకు ప్రయాణమయ్యాడు. బాలరాజుకి కోపమొచ్చి కొడుకుతో తెగతెంపులు చేసుకున్నాడు. ఆయన క్రమశిక్షణకు తట్టుకోలేని రెండో కొడుకు బంగారి- ఊళ్లోనే ఉంటూ తండ్రికి శత్రువులా మసలుతున్నాడు. బాలరాజు రెండో కొడుకుతోనూ తెగతెంపులు చేసుకున్నాడు. చంద్రశేఖర్ లండన్‍లో స్థిరపడ్డాడు. భార్య పోయింది. ఓ కొడుకూ, కూతురూ పెరిగి పెద్దవాళ్లయ్యారు. జాతి వివక్ష కారణంగా తనకి రావాల్సిన ప్రమోషన్ ఆగిపోయినప్పుడు- తను తండ్రికి కలిగించిన మనస్తాపానికి పశ్చాత్తాపపడ్డాడు. కొడుకు అభిరామ్ జరిగింది తెలుసుకుని తాతతో కలుపుతానని తండ్రికి మాటిచ్చి- ఇండియాలో తనవాళ్లుండే గ్రామానికి వెళ్ళాడు. తానెవరో చెప్పకుండా అక్కడే ఉండి- తాతయ్య మనసుని గెల్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు మిగతా కథ. ట్రయిలర్

ఎంతో మనసుపడి తయారు చేసుకున్న ఈ కథను అపూర్వంగా తయారు చెయ్యడానికి కృష్ణవంశీ ఎంతో నిబద్ధతతో ప్రయత్నించారు. ప్రముఖ పత్రికా సంపాదకులు, రచయిత, సినీ ప్రముఖులు వేమూరి సత్యనారాయణను (ప్రముఖ దర్శకుడు వంశీని మంచుపల్లకి చిత్రం ద్వారా పరిచయం చేసింది వీరే) రచనా సహకారానికి కోరారు. వేమూరి, వసుంధర, మానస (సీతారామయ్య గారి మనవరాలు చిత్రకథకు మూలకథ ‘నవ్వినా కన్నీళ్లే’ నవలా రచయిత) ఒక బృందంగా సుమారు 3 నెలల పాటు- పరుచూరి వెంకటేశ్వరరావు, కృష్ణవంశీలతో కథాచర్చల్లో పాల్గొన్నారు. ఆ చర్చలు- ముందు బియ్యంలో బెడ్డలేరడానికి ఉపయోగించాయి. ఈ కథకి పాత చిత్రాల వాసన తగిలే ప్రమాదమున్నదని సూచించాయి. కొత్తదనాన్ని ఆపాదించడానికి ప్రయత్నించాయి (ఉదాహరణకు సింహాద్రి చిత్రంలో క్లైమాక్స్ సీన్‍లో ఒక దైలాగ్ ఈ కథకు మూలమా అనిపిస్తుంది). ఈ మధ్యలో అత్తారింటికి దారేది చిత్రం విడుదలైంది. ఈ కథకూ ఆ కథకూ చాలా పోలికలు కనిపించాయి. ఈ చర్చలు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాయి.

ఈ చర్చల్లోంచీ బాలరాజు- ఒక గంభీరమైన ఆదర్శవాదిగా (శంకరాభరణంలో శంకరశాస్త్రిలా); అభి- యువత దృష్టిని గ్రామాలవైపు మళ్లించే ఆదర్స యువకుడిగా; బంగారి- మానసిక సంఘర్షణతో తిరుగుబాటుకు సిద్ధమైన విప్లవాత్మక పాత్రగా; చిత్ర- ప్రేమకూ, సంప్రదాయానికీ నలిగిపోయే త్యాగమూర్తిగా; బామ్మ- మాతృప్రేమకూ, పాతివ్రత్యానికీ మధ్య నలిగిన ప్రేమమూర్ర్తిగా- రూపొందారు. కొన్ని అదనపు పాత్రలు పుట్టుకొచ్చి కథకు కొత్తదనాన్నీ, పుష్టినీ ఇచ్చాయి. బంగారి పాత్ర రూపకల్పన జరుగుతుండగానే ఆ పాత్రకు అనుకున్న వెంకటేష్ తప్పుకోవడంతో- ఆ పాత్రకు కథలో కొంత ప్రాధాన్యం తగ్గింది. కథ మొత్తం అభి చుట్టూ తిరిగేలా రూపొందింది.

షూటింగ్ ప్రారంభమయ్యేక మా ముగ్గురి బృందం మార్చి 30న రషెస్ చూడ్డం జరిగింది. అందులో రామ్‍చరణ్ తన పాత్రలో చక్కగా ఇమిడిపోయినట్లు అనిపించింది. కానీ బాలరాజు పాత్రలో అప్పటికి ఎంపికైన రాజ్‍కిరణ్- ఆ పాత్రకు ఏమాత్రం నప్పలేదనిపించింది. అచ్చతెలుగు పాత్రలో పూర్తి తమిళ పోకడలు ఉన్నాయనిపించింది. ఆ విషయం నిష్కర్షగా దర్శకుడికి చెప్పాం. మా వ్యాఖ్యకు ఆయన కాస్త నిరుత్సాహపడినట్లు కనిపించినా, ఆ తర్వాత ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపికైనట్లు తెలిసి చాలా సంతోషించాం.

ఈ వివరాలు చెప్పేక ఇక నేరుగా విశ్లేషణలోకి వెళ్లిపోదాం.

ఈ చిత్రానికి ప్రాణం పోసింది బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్. ఐతే ఆయనది తొలుత అనుకున్నట్లు గంభీరమైన పాత్ర కాదు. కూతుళ్లు, అల్లుళ్లముందు భార్యతో సరసాలాడుతూ పాటలు పాడే సరదా పాత్ర. అలాంటి మనిషి ఇంట్లో అంతటి క్రమశిక్షణ విధిస్తాడా అని ప్రేక్షకులకి సందేహం రావడం తథ్యం. కానీ ఈ చిత్రంలోని ‘నీలిరంగు చీర కట్టి’ అన్న పాట ఒక అద్భుత దృశ్యంగా రూపొందింది. ఆ పాటలో ప్రకాష్‍ రాజ్, జయసుధల నటన అద్భుతం. పాట చిత్రీకరణ అద్భుతం. జనాలకి బాగుంటే లాజిక్ అవసరమా, అని ముళ్లపూడి వెంకటరమణ అంతటి వారన్నారు.

చాలాకాలం తర్వాత వృద్ధపాత్రలో జయసుధ జీవించింది. ఈ చిత్రానికి ఆమె నటన కూడా ఒక అసెట్.

ఈ చిత్రంలో మరో విశేషం- నటీనటుల్లో ప్రతిఒక్కరూ తమ పాత్రల్లో గొప్పగా జీవించారు. ప్రాధాన్యం తగ్గిన పాత్రల్లో కూడా శ్రీకాంత్, కమలిని ఓహో అనిపించారు. ప్ర త్యేకమైన కామెడీ పాత్ర లేని లోటుని శ్రీకాంత్ చాలా హుందాగా పూరించాడు. కమలిని చాలా అందంగా ఉంది. అన్నింటికీ దర్శకుణ్ణి కూడా అభినందించాలి.

రామ్ చరణ్ ఫైట్లలో అవలీలగా నటించాడు. డ్యాన్సులు చాలా బాగా చేసినా- సహజంగా కాక కష్టపడినట్లు కనిపిస్తుంది. అనుబంధాలకోసం తపించిపోతూ, అవి దొరికినప్పటి స్పందనలు చూపడం ఏ నటుడికైనా గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే స్థాయికి రామ్ చరణ్ నటన ఇంకా చేరుకోలేదనిపిస్తుంది. అతడికి జోడీగా కాజల్ ఈ చిత్రంలో చాలా అందంగా ఉంది. అయితే ఆమె పబ్‍లో తాగుతూ విచ్చలవిడిగా నృత్యం చెయ్యడం బాలరాజువంటి సంప్రదాయవాది మనవరాలికి తగినట్లు లేదు. ఒకవేళ ఏదో ఒకసారికి సరదా పడిందని సరిపెట్టుకుందామన్నా- హీరోని తనకు తానే మాటిమాటికీ సీరియల్ ముద్దులు పెట్టుకుంది. సినిమా పొడుగునా ఆమె ప్రవర్తన బాలరాజు పెంపకానికి మచ్చగానే మిగిలిపోతుంది.

పరుచూరి బ్రదర్స్ మాటలు వారి ముద్రకు భిన్నంగా సాఫీగా ఉన్నాయి. చిత్రం చివర్లో జయసుధ ప్రకాష్ రాజ్‍తో, ‘ఇంతకాలం మిమ్మల్ని దేవుడిగా భావించాను. కానీ మీరు ఉత్త మొగుడిగా తేలిపోయారు’ అన్నప్పుడు- పరుచూరివారికి పరుచూరివారే సాటి అనిపింపజేస్తుంది.

ఈ చిత్రంలో పాటలు వినడానికి మామూలుగా అనిపిస్తాయి. చిత్రీకరణలో స్వాగతం, నీలిరంగు చీర, రాకుమారా- పాటల్లో దర్శకత్వం, కోరియాగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.

ఇక దర్శకత్వం విషయానికొస్తే- కథ, పాత్రచిత్రణ కంటే- చిత్రీకరణకే ప్రాధాన్యం లభించింది. కొన్ని దృశ్యాలు, సన్నివేశాలు, పాటల చిత్రీకరణ అనితరసాధ్యం అనిపించేలా ఉంది. కథ పాతదిలా అనిపించినా, కథనంలో గజిబిజి ఉన్నా, పాత్రచిత్రణను పట్టించుకోకపోయినా- కేవలం చిత్రీకరణ ఈ చిత్రాన్ని ఆహ్లాదకరంగా అనిపింపజేస్తుంది. విడియో రివ్యూ  రివ్యూ 1   రివ్యూ 2

ఆరంభంలో కనిపించిన హాస్పిటల్ ప్రారంభోత్సవం తేదీ- హీరో కథాకాలంలో సెల్ ఫోన్ వాడకాన్ని సమర్థించదు. ‘మీరింకా పాతికేళ్లు బ్రతుకుతారు, అంటే నూరేళ్లు’ అని ఓ సందర్భంలో నటుడు అవసరాలచేత అనిపించి- బాలరాజు వయసుని 75గా స్థిరీకరించి, చివర్లో ఆయనకు షష్టిపూర్తి జరిపించారు. ఇలాంటి లోపాలు చిత్రీకరణ సమయంలోనే సవరించబడలేదంటే- చిత్రాన్ని ముగించడంలో కొంత హడావుడి పడ్డారనిపింపజేస్తుంది.

అభిరుచి పరంగా నిర్మాతకూ, దర్శకుడికీ కలికితురాయి ఈ చిత్రం. వీరిరువురూ ఇదే అభిరుచిని కొనసాగిస్తూ- చిత్రీకరణకంటే కథకూ, కథనానికీ ప్రాధాన్యమిస్తూ- మున్ముందు మరిన్ని మంచి చిత్రాల్ని ప్రేక్షకుల్కి అందిస్తారని ఆశిద్దాం.

1 వ్యాఖ్య »

  1. బోనగిరి said,

    ఈ సినిమా కృష్ణవంశీ సినిమా. ప్రతి సీనులోను, ముఖ్యంగా పాటల్లో ఆ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
    అలాగే ఈ సినిమాకి హీరో ప్రకాష్‌రాజ్ అనే చెప్పాలి. సినిమా మొత్తం అతని పాత్ర చుట్టూ తిరుగుతుంది. రాం చరణ్ ఇంకా చాలా నేర్చుకోవాలి. అతను కొంచెం చబ్బీగా అవకపోతే అతని ముఖాన్ని క్లోజప్‌లో చూడడం కష్టం.


Leave a Reply

%d bloggers like this: