Site icon వసుంధర అక్షరజాలం

కార్తికేయ- చిత్రసమీక్ష

kartikeya poster

మనిషి భయాన్ని కోరుకోకపోవచ్చు. కానీ భయంలో మనిషికి వినోదముంది. అందుకే భయం నవరసాల్లో ఒకటయింది. భయాన్ని తర్కంతో బలపర్చే కథలు, సినిమాలు- వినోద రంగంలో ప్రాచుర్యం పొందడానికి కారణమదే! అలాంటి సినిమాల్లో కొత్తదనం, సృజనాత్మకత ఉంటే జనాదరణ విషయం ఎలా ఉన్నా- తీసినవారికీ, చూసినవారికీ అదో తృప్తి. అలాంటి తృప్తినివ్వడానికి జరిగిన ఓ ప్రయత్నం ఈ అక్టోబర్ 24న విడుదలైన కార్తికేయ చిత్రం.

ఇందులో ఓ సుబ్రహ్మణ్యపురం. ఆ ఊళ్లో ఒక గుడి. ఏదో కారణంతో ధర్మకర్తలు ఆ గుడిని మూయించేశారు. అప్పట్నించీ ఎవరైనా ఆ గుడికి వెళ్లాలనుకున్నా, ఆఖరికి ఆ గుడి గురించి మాట్లాడినా కూడా చావుకి గురి ఔతున్నారు. వాటిలో కొన్ని చావులకి- పగబట్టిన ఓ సర్పం కారణం. ఆ సుబ్రహ్మణ్యపురానికి మెడికల్ క్యాంపుతో వచ్చాడు హీరో. ‘సృష్టిలో ప్రతి ప్రశ్నకూ ఒక జవాబుంటుంది. ఆ జవాబును అన్వేషించదానికి ప్రాణలనైనా వదులుకోవాలి తప్ప, ప్రశ్నను వదలకూడదు’ అనే పట్టుదల ఉన్న ఈ హీరో ఆ గుడి మిస్టరీని సాధించడానికి చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం.

ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. కానీ కథ చెప్పిన తీరు కొత్తగా ఉంది. దైవత్వాన్నీ, మూఢ నమ్మకాల్నీ, భక్తినీ, విజ్ఞానశాస్త్రాన్నీ, తర్కాన్నీ సమన్వయం చేసిన తీరు మెచ్చుకునేలా ఉంది. అందుకోసం ఎన్నుకున్న పాత్రలూ, సన్నివేశాలూ సముచితంగా ఉన్నాయి. విడియో రివ్యూ   రివ్యూ

నిఖిల్ మెడికల్ కాలేజి స్టూడెంటుగా హీరో పాత్రకి హుందాతనాన్నిచ్చాడు. నృత్యాల్లో కూడా రెచ్చిపోకుండా- అవసరమైన మేరకు కాలూ చెయ్యీ సుతారంగా కదిపి ఊరుకోవడం- పాటలకూ హుందాతనాన్నిచ్చింది. కనిపించడమే తప్ప నటించాలని ప్రయత్నించకపోవడం కూడా అతడికి ప్లస్సే అయింది. ఒకటి రెండు సందర్భాల్లో బరువైన సన్నివేశాలు వచ్చినప్పుడు- అతడికి నటనలో పరిణతి చాలదని తెలిసిపోతుంది మరి! ఏది ఏమైనా చిత్రం చూసేక ఈ చిత్రానికి హీరోగా నిఖిల్‍ని తప్ప మరొకర్ని ఊహించుకోలేమనిపించేటంతగా ఆ పాత్రకు సరిపోయాడతడు. హీరోయిన్‍గా స్వాతి ఒకటి రెండు సందర్భాల్లో నటిగా రాణించింది. కానీ మొత్తంమీద ఆమెకు ఈ చిత్రంలో తగినంత పాత్ర లేదు. మెడికల్ కాలేజి విద్యార్థినిగా కాస్త వయసెక్కువ అనిపించింది. పోలీసు ఇనస్పెక్టరుగా కిషోర్, స్వాతి తండ్రిగా తనికెళ్ల భరణి, దేవాలయాల అధికారిగా రావు రమేష్, హీరో మిత్రులుగా ప్రవీణ్, సత్య- ఆయా పాత్రలకు అదనపు విలువని ఆపాదించారు. జోగి బ్రదర్స్ ఫేం- జోగినాయుడు ఓ చిన్న పాత్రలో గొప్పగా రాణించి- తనకి మరింత ప్రాధాన్యమున్న పాత్రలు అవసరమని హెచ్చరించాడు. ఇంచుమించు నటీనటులందరూ తమ పాత్రలకి న్యాయం చేకూర్చిన ఈ చిత్రంలో కొద్ది క్షణాలు మాత్రమే కనిపించిన రాజా రవీంద్ర కూడా తన పాత్రలో గుర్తుండిపోతాడు.

ఫొటోగ్రఫీ (కార్తీక్ ఘట్టమనేని) అద్భుతం. నేపథ్య సంగీతం (శేఖర్ చంద్ర) అక్కడక్కడ కాస్త హోరెక్కువ అనిపించినా- కథలోని వాతావరణానికి దీటుగా బాగుంది. పాటల్లో ప్రత్యేకత లేకపోయినా చిత్రీకరణ చాలా బాగుంది. ఒక రొమాంటిక్ సాంగ్‍లో- ఒక చోట కూర్చున్న నిఖిల్- తనలోంచీ బయటకొచ్చి హీరోయిన్ వెంటబడి ఆమెను వివిధంగా దర్శిస్తాడు. చిత్రీకరణలో కొత్తదనంతోపాటు, అవకాశం ఉన్నా, ఎక్కడా అసభ్యతకు తావివ్వకపోవడం ప్రశంసనీయం.

‘ఒకచోట స్థిరంగా లేకుండా, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి వాస్తు ఏమిటి?’- హేతుబద్ధమై, చమత్కారం నిండిన ఇలాంటి డైలాగ్స్- మాటల రచయితగా దర్శకుడి ప్రతిభకు నిదర్సనం. పాము పగ పట్టడాన్ని స్నేక్ హిప్నాటిజంతో సమర్థించడం బహుశా భారతీయ చలనచిత్రాల్లో మొదటిసారి. ఎత్తుగడలో ఉత్సుకత కలిగించి, కథనంలో ఆసక్తి పుట్టించి, మధ్యమధ్య నవ్విస్తూ భయపెడుతూ తర్కానికి ప్రాధాన్యమిచ్చిన ప్రతిభ- ఈ చిత్రం ఈ దర్శకుడికిది తొలిచిత్రం అనిపించనివ్వదు. ఐతే-

ఇండియాలో హారర్ చిత్రాలకు గొప్ప గుర్తింపు తెచ్చిన తొలిచిత్రం బీస్ సాల్ బాద్ (హిందీ, 1962). ఆద్యంతం ఉత్కంఠభరితమై ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టి బాక్సాఫీసు బద్దలు కొట్టిన ఆ చిత్రంలో- చివరకు ఎవరూ అనుమానించని ఓ వృద్ధుడు నేరస్థుడు. ఆ తర్వాతనుంచి అదే ఫార్ములాగా మారి- ఏ సస్పెన్సు చిత్రం వచ్చినా- చివర్లో ఎవరూ అనుమానించని ఓ వృద్ధుడు నేరస్థుడు కావడం మొదలైంది. దాంతో ముగింపు అందరూ ఊహించేసేవారు.

ఇప్పుడు తెలుగులోనూ- ఇలాంటి చిత్రాల్లో నేరస్థుడి పాత్రలకు ప్రత్యేకంగా ఓ నటుణ్ణి ఎన్నుకుంటున్నారు. అదెంతలా అంటే ఆ నటుడు మొదటిసారి తెరమీద కనబడగానే- ఓహోఇతడే నేరస్థుడన్న మాట- అని ప్రేక్షకులకి తెలిసిపోతోంది. ఈ చిత్రంలోనూ అదే జరిగింది. అంతేకాక- కథనీ, కథనాన్నీ మంచి ఊపుతో నడిపించిన ఈ దర్శకుడు క్లైమాక్సుని చాలా తేలికగా తీసుకోవడం కూడా- చివర్లో ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని కలిగిస్తుంది.

ఏదిఏమైనా, పెద్ద నటుల ఫార్ములా చిత్రాలతో మొహం మొత్తిన తెలుగు సినీ ప్రేక్షకులని- విభిన్నంగా అలరించేందుకు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం, ఆదరణీయం. అందుకు నిర్మాత వెంకట్ శ్రీనివాస్, దర్శకుడు చందూ మొండేటి అభినందనీయులు.

Exit mobile version