నవంబర్ 25, 2014
తెలుగుతనానికి గానపథం
ఈటివిలో వచ్చే పాడుతా తీయగా- ఆ ఛానెల్లో వచ్చే కార్యక్రమాలకు తలమానికం. సినీ లలిత సంగీతానికి ప్రయోజనాత్మకం. ఆ కార్యక్రమాన్నిగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) నిర్వహిస్తున్న తీరు నిరుపమానం, ఔత్సహికులకు గొప్ప వరం. ఇక అమెరికాలోని ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి బాసు ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే పాత కార్యక్రమాలతో పోల్చితే- ఆ గాయనీ గాయకుల ప్రదర్శన కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. సంగీత కార్యక్రమాలకు ప్రతిభకే తప్ప ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదని కూడా అనిపించింది. ఇప్పుడు బాసు అమెరికాలో చిన్నారులకోసం కొత్తగా నిర్వహిస్తున్న ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమంలో కూడా గాన ప్రతిభ అంతంతమాత్రంగానూ, అడపా తడపా బహు చప్పగానూ అనిపిస్తోంది. మరి అమెరికాకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అవసరమా అంటే అవసరమే!
బాసు నిర్వహించే కార్యక్రమం మనకు ప్రతిభావంతుల పాటలు వినిపించడానికి కాదు. మట్టిలో మాణిక్యాల్ని వెలికి తియ్యడానికీ, వజ్రాల్ని సానబెట్టడానికీ, అన్న విషయం- ఇప్పటికే నిరూపితమైంది. ఈ కార్యక్రమం సంగీత శిక్షణ. భాషోచ్చారణకు సవరణ. భావప్రకటనకు వివరణ.
తెలుగుతనానికి గానపథం
తెలుగు పాటలకు బాలు కదం
ఇది సుబ్రమణ్య జనితం
బాల సుబ్రమణ్య పథకం
అని పాడుకోవాలనిపిస్తుంది- ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అమెరికా తెలుగువారి వేషధారణలో, భాషోచ్చారణలో- అచ్చ తెలుగుతనాన్ని వీక్షించినప్పుడు. నిర్వాహకులు, పాల్గొనువారల నిబద్ధతను గమనించినప్పుడు. మాణిక్యాల్ని వెలికి తియ్యగలవారు- ఒక మట్టికే పరిమితం కాలేరు కదా! ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో దేశదేశాలకి విస్తరించి- తెలుగు భాషకీ, తెలుగు తనానికీ- అంతరిస్తాయన్న అనుమానమే లేకుండా చెయ్యగలవని మా నమ్మకం. మచ్చుకి నవంబర్ 24న వచ్చిన అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఈటివి, బాసులకి అభివందనాలు.
Sarma Kanchibhotla said,
నవంబర్ 25, 2014 at 11:25 సా.
అంతటివాడు, అంత సహనముతో, అకుంఠిత దీక్షతో, తెలుగుదనానిని ప్రోత్సహించుటకు తనదైన శైలిలో చేయుచున్న ఈ యజ్ఞము నిరంతరముగా సాగాలని మనసారా కోరుకొంటున్న అశేష తెలుగువారిలో నేనొకడినని వినమ్రతతో తెలియజేస్తున్నాను. ఈ యజ్ఞమునకు వనరులు సమకూర్చుచున్న ఈటివి యాజమాన్యపు తోడ్పాటు అనన్యసామాన్యము. అందరికి కృతజ్ఞతాభివందనములు.