మార్చి 30, 2018

దీని పేరు సంస్కారం (జీ జీ వా జీ – 2)

Posted in జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, Uncategorized at 7:03 సా. by వసుంధర

(అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం)

మచ్చుకి ఓ కథ

ఆయన ఒక తెలుగు ఎంపీ. ఆయనకు తెలుగు రాష్ట్రప్రభుత్వంపై కోపం వచ్చింది. ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నాడు.

అంతేకాదు. ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా గుర్తించబడ్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని – ఇంచుమించు బూతు అనతగ్గ పదాలతో నిందించాడు. అది సంస్కారం కాదని ఎత్తిచూపినవారిని కూడా నిరసించాడు.  తన విశ్వాసం కోల్పోయినవారిని అలాంటి మాటలనడం సబబేనన్నాదు.

అదే ఎంపీకి కేంద్ర ప్రభుత్వంపై కూడా విశ్వాసం నశించింది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాడు.

సభలో ఆ తీర్మానం చర్చకు రావడానికి ఆటంకాలు వచ్చాయి. ఈలోగా ఒకరోజున ఆయన సభలో ప్రధానమంత్రికి ఎదురు పడ్డాడు. తన విశ్వాసం కోల్పోయిన కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి. అప్పుడీ ఎంపీ ఆయన్ని ఏమంటాడో ఏమిటోనని అంతా భయపడ్డారు.

కానీ ఆ ఎంపీ ఆయనకు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.

అప్పుడలా, ఇప్పుడిలా – ఇదేమిటని చాలామంది ఆయన్ని నిలదీసారు. ఆయన ఏమాత్రం తడుముకోకుండా – ‘ప్రభుత్వంమీద నాకు విశ్వాసం లేకపోవచ్చు. కానీ ఆయన కోట్లాది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న దేశానికి ప్రధానమంత్రి. ఆయనకు చేతులు జోడిస్తే – దాని పేరు సంస్కారం. ఈమాత్రం తెలియదా?’ అని బదులిచ్చాడు.

సగటు పౌరులారా – జీర్ణించుకోవడం కష్టంగా ఉందా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి.

 

Leave a Reply

%d bloggers like this: